...
...
Next Story

Bunny Vas: భారీ కలెక్షన్ అని చెప్పుకోవడం తెలివి తక్కువతనం-పెద్ద హీరోలూ కారణమే-ఆదాయం పడిపోయింది: బన్నీ వాసు సంచలన పోస్ట్

Bunny Vas: తెలుగు పాపులర్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ బన్నీ వాసు పెట్టిన పోస్ట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. ఎగ్జిబ్యూటర్ల డిమాండ్ల నేపథ్యలో బన్నీ వాసు ఎక్స్ పోస్ట్ తెగ వైరల్ గా మారింది. ఇందులో అతను సంచలన పాయింట్లు టచ్ చేశాడు.

Published on: May 13, 2026, 10:16:17 IST
Advertisement

Bunny Vas: తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు ఎగ్జిబ్యూటర్ల డిమాండ్లు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ సినిమా ఓనర్లు న్యాయం చేయాలంటున్నారు. ఇన్ని రోజులూ రెంట్ విధానంలో సినిమాలు ఆడించామని, ఇకపై పర్సెంటేజీ కావాలంటున్నారు. దీనిపై పాపులర్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ బన్నీ వాసు సంచలన పోస్టు పెట్టాడు.

బన్నీ వాసు పోస్ట్

బన్నీ వాసు (x/bunny vas)
బన్నీ వాసు (x/bunny vas)

అసలే ఆదాయం తగ్గిపోయిందని, వచ్చే పావలా వాటా కోసం కొట్టుకోవడం కరెక్ట్ కాదని బన్నీ వాసు తన పోస్టులో పేర్కొన్నాడు. బుధవారం (మే 13) ఎక్స్ లో బన్నీ వాసు పెట్టిన సుదీర్ఘ పోస్టు వైరల్ గా మారింది. ఇందులో మూల కారణం ఏంటో గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలని వాసు రాసుకొచ్చాడు. ఇందుకు నాలుగు ప్రధాన కారణాలు చెప్పాడు.

కలెక్షన్లు

‘‘పెద్ద సినిమాలకు కూడా ఆదాయం రూపాయి నుంచి అర్ధరూపాయికి పడిపోయింది. ఈరోజు సినిమాలు వందల కోట్లు కలెక్ట్ చేస్తున్నాయని మనం చూస్తున్నాం. కానీ ఆ కలెక్షన్లు నిజంగా ప్రేక్షకుల సంఖ్య పెరగడం వల్ల వచ్చినవి కాదు.. టికెట్ రేట్లు, ఇతర ధరలు పెరగడం వల్ల వచ్చినవని మనందరం అర్థం చేసుకోవాలి. అంటే, సగటు ప్రేక్షకుడు థియేటర్‌కు రావడం తగ్గిపోయింది’’ అని బన్నీ వాసు చెప్పుకొచ్చాడు.

తెలివి తక్కువ తనం

‘‘వచ్చే కొద్దిమంది ప్రేక్షకుల మీదే అధిక భారం వేసి వసూళ్లు పెంచుకుని, దాన్నే భారీ కలెక్షన్లు అని చెప్పుకోవడం కన్నా పెద్ద తెలివితక్కువతనం ఇంకొకటి ఉండదు. చిన్న సినిమాల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. వారి ఆదాయం పావలా స్థాయికి పడిపోయింది. ఇప్పుడు ఆ పావలాలో ఎవరు ఎంత తీసుకోవాలి అని మనం కొట్టుకుంటున్నాం కానీ, అసలు మన రూపాయి ఆదాయం ఎందుకు పోయిందో మాత్రం మర్చిపోతున్నాం’’ అని బన్నీ వాసు తన పోస్టులో తెలిపాడు.

నిర్మాతలకు నష్టం

‘‘నా అభిప్రాయం ప్రకారం ప్రధాన కారణాలు ఇవి..

1. హీరోలు సినిమాలు పూర్తి చేయడానికి చాలా ఎక్కువ సమయం తీసుకోవడం. సగటు ప్రేక్షకుడిని థియేటర్‌కు తీసుకురావడంలో హీరోల పాత్ర చాలా ముఖ్యం. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలో ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించడంలో హీరోల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఇండస్ట్రీలో హీరోలు రెండు సంవత్సరాలకు ఒక సినిమా మాత్రమే చేస్తే, ప్రేక్షకుడికి సినిమాలపై ఆసక్తి క్రమంగా తగ్గిపోతుంది. దాని ప్రభావం కేవలం పెద్ద సినిమాలపైనే కాదు, చిన్న సినిమాల మీద కూడా పడుతుంది.

2. సినిమాలను కేవలం 27 రోజుల్లోనే OTTలో విడుదల చేయడం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపోవడం.

3. ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయి కంటెంట్ లేకపోవడం. “ఇంత ఖర్చు పెట్టి థియేటర్‌కు వెళ్లాల్సిన అవసరమా?” అనే భావన ప్రేక్షకుల్లో రావడం.

4. మల్టీప్లెక్సుల్లో అధిక క్యాంటీన్ ధరలు’’ అని బన్నీ వాసు పేర్కొన్నాడు.

ఏం లాభం?

‘‘ఈ నాలుగు కారణాల్లో మూడు కారణాలు మన చేతిలోనే ఉన్నాయి. కంటెంట్ విషయం మాత్రమే పూర్తిగా మన నియంత్రణలో ఉండదు. ఈ మూడు అంశాలను సరిచేయకుండా, ఎంత శాతం పంచుకోవాలని వాదించుకుంటే ఉపయోగం లేదు. రేపు వచ్చే ఆ పావలా ఆదాయంలో ఎవరు ఎంత తీసుకోవాలి అని కొట్టుకోవడం తప్ప, దాంతో ఎవరికీ నిజమైన లాభం ఉండదు’’ అని బన్నీ వాసు తన పోస్టు ఎండ్ చేశాడు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks