Rakul Preet Singh: ఎవ‌రూ నాకు ప్రాప‌ర్టీని గిఫ్ట్‌గా ఇవ్వ‌లేదు-తప్పుడు కథనాలతో గుండె ముక్కలవుతోంది: రకుల్ ప్రీత్ సింగ్

Rakul Preet Singh: స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు కొన్ని రోజులుగా ట్రెండింగ్ లో నిలుస్తూనే ఉంది. ఆమె ఆస్తులపై ఐటీ రైడ్స్ జరిగాయనే వార్తలు వచ్చాయి. వీటిపై రకుల్ ప్రీత్ సింగ్ ఫైర్ అయ్యారు. నిజాలు తెలుసుకొని కథనాలు ఇవ్వాలని మండిపడ్డారు. రకుల్ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది.  

Published on: Oct 5, 2026, 12:34:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Rakul Preet Singh: ఇన్‌కమ్ టాక్స్ (IT) రైడ్ కు సంబంధించి తనపై వస్తున్న వార్తలను స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) తీవ్రంగా ఖండించారు. తనను లక్ష్యంగా చేసుకుని మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవమని, నిరాధారమైనవని స్పష్టం చేశారు. తనకు ఎలాంటి బినామీ ఆస్తులు లేవని, 20 ఏళ్ల వయస్సు నుంచే బాధ్యతాయుతమైన పౌరురాలిగా పన్నులు చెల్లిస్తున్నానని ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్టు పెట్టారు.

ఎవ‌రూ నాకు ప్రాప‌ర్టీని గిఫ్ట్‌గా ఇవ్వ‌లేదు-తప్పుడు కథనాలతో గుండె ముక్కలవుతోంది: రకుల్ ప్రీత్ సింగ్ (instagram-Rakul Singh)
ఎవ‌రూ నాకు ప్రాప‌ర్టీని గిఫ్ట్‌గా ఇవ్వ‌లేదు-తప్పుడు కథనాలతో గుండె ముక్కలవుతోంది: రకుల్ ప్రీత్ సింగ్ (instagram-Rakul Singh)

నిజాలు తెలుసుకోకుండా రాశారు

తన ప్రాపర్టీస్, నివాసాలపై ఇన్‌కం టాక్స్ సోదాలు జరిగాయంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై రకుల్ ప్రీత్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘమైన ప్రకటన విడుదల చేశారు. ఆన్‌లైన్ రిపోర్టర్లు, కొన్ని ప్రధాన మీడియా సంస్థలు వాస్తవాలను నిర్ధారించుకోకుండా వార్తలను సెన్సేషనలైజ్ చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

"ఆ దాడులకు నాకూ ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయాన్ని ఒక్కసారి స్పష్టం చేయాలనుకుంటున్నాను" అని రకుల్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు.

గాడ్‌ఫాదర్ లేకున్నా

తాను ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చానని, ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్ ఎవరూ లేకుండా కష్టపడి పైకి వచ్చానని రకుల్ గుర్తుచేశారు. 20 ఏళ్ల వయస్సు నుంచే నిబంధనల ప్రకారం ఆదాయపు పన్ను చెల్లిస్తున్నానని స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా గానీ, లేదా ఏ ప్రొడక్షన్ హౌస్ తరఫున గానీ ఎలాంటి అక్రమ విదేశీ నగదు బదిలీల్లో (Illegal Foreign Remittances) తాను భాగస్వామిని కాదని తేల్చి చెప్పారు.

బినామీ ఆస్తులు లేవు

దేశంలో గానీ, విదేశాల్లో గానీ ఎవరి తరఫున కూడా తాను ఎలాంటి 'బినామీ' ఆస్తులను కలిగి లేనని రకుల్ ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు. "నా జీవితంలో ఎవరూ నాకు ప్రాపర్టీలను గిఫ్ట్ గా ఇవ్వలేదు. నేను అలాంటి ఖరీదైన గిఫ్ట్‌లను నేను స్వీకరించను కూడా" అని రకుల్ వెల్లడించారు.

సినిమా నిర్మాణాల పేరుతో విదేశీ నిధుల అక్రమ రవాణా అనుమానంతో తన ప్రాపర్టీస్‌పై ఐటీ దాడులు జరిగాయంటూ ప్రచురితమైన కథనాలను వెంటనే ఉపసంహరించుకోవాలని మీడియా సంస్థలకు రకుల్ విజ్ఞప్తి చేశారు. ప్రసార వ్యాపారంలో వాణిజ్య ఒత్తిళ్లు ఉండవచ్చని, కానీ అవి నిజాన్ని తుడిచిపెట్టేలా ఉండకూడదని, ఒకరి ప్రతిష్టను, జీవనోపాధిని దెబ్బతీసేలా ఉండకూడదని ఆమె విజ్ఞప్తి చేశారు.

అసలేం జరిగింది?

సెప్టెంబర్ 28న ముంబైలోని ఇన్‌కమ్ టాక్స్ విభాగం అధికారులు నటి రకుల్ ప్రీత్ సింగ్, ఆమె మామ ప్రముఖ నిర్మాత వాషు భగ్నానీ (Vashu Bhagnani), పనోరమా స్టూడియోస్‌కు చెందిన దాదాపు 12 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి.

సినిమా ప్రాజెక్టుల నిర్మాణం, విదేశీ డిస్ట్రిబ్యూషన్ పేరిట నిధులను విదేశాలకు తరలించారనే ఆరోపణలపై ఐటీ శాఖ విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే, ఈ తనిఖీలకు సంబంధించి అధికారులు గానీ, వాషు భగ్నానీ గానీ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More