ట్విన్స్ పుట్టిన ఖుషీలో రామ్ చరణ్, ఉపాసన ఇచ్చిన గిఫ్ట్‌లు చూశారా.. సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు వైరల్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు కవల పిల్లలకు (ఒక బాబు, ఒక పాప) జన్మనిచ్చిన శుభవార్త మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. జనవరి 31న జరిగిన ఈ వేడుకను పురస్కరించుకుని అపోలో ఆసుపత్రి వద్దకు వచ్చిన అభిమానులకు ప్రత్యేక గిఫ్ట్ హ్యాంపర్లను అందజేశారు.

Published on: Feb 3, 2026, 20:31:38 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మెగా కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. రామ్ చరణ్, ఉపాసన దంపతులు జనవరి 31న కవల పిల్లలను (ఒక అబ్బాయి, ఒక అమ్మాయి) తమ జీవితంలోకి ఆహ్వానించిన విషయం తెలుసు కదా. ఆ రాత్రి మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా వేదికగా ఈ శుభవార్తను పంచుకోవడంతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. తమ అభిమాన హీరో తండ్రి అయిన ఆనందంలో ఫిబ్రవరి 1న అపోలో ఆసుపత్రి వద్దకు భారీ సంఖ్యలో మెగా ఫ్యాన్స్ తరలివచ్చారు.

ట్విన్స్ పుట్టిన ఖుషీలో రామ్ చరణ్, ఉపాసన ఇచ్చిన గిఫ్ట్‌లు చూశారా.. సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు వైరల్
ట్విన్స్ పుట్టిన ఖుషీలో రామ్ చరణ్, ఉపాసన ఇచ్చిన గిఫ్ట్‌లు చూశారా.. సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు వైరల్

ఫ్యాన్స్‌కు అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్

శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన అభిమానులను మెగా కుటుంబం నిరాశపరచలేదు. వారి ఆనందాన్ని పంచుకుంటూ ప్రత్యేకమైన గిఫ్ట్ హ్యాంపర్లను పంపిణీ చేశారు. దీనికి సంబంధించిన అన్‌బాక్సింగ్ వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. "రామ్ చరణ్, ఉపాసనలకు శుభాకాంక్షలు.. అపోలో నుంచి ఈ గిఫ్ట్ అందుకున్నాం" అంటూ ఓ అభిమాని వీడియో పోస్ట్ చేశారు.

ఆ బాక్స్‌లో ఏముంది?

ఎరుపు రంగు బాక్స్‌పై రామ్ చరణ్, ఉపాసనల ఫొటోలు ముద్రించి ఉన్నాయి. బాక్స్ లోపల రెండు వెండి గిన్నెలు, వాటికి సరిపోయే స్పూన్లు, ఒక ప్లేట్ ఉన్నాయి. ఆ ప్లేట్‌పై పిల్లలు పుట్టిన తేదీ '31-01-2026' అని రాసి ఉంది. వీటితో పాటు నోరూరించే స్వీట్లు కూడా ఉన్నాయి.

అసలు ఇది వెండి వస్తువులేనా? ధర ఎంత?

గిఫ్ట్ బాక్స్ చూడగానే ఇది వెండిదా లేక వెండి పూత పూసినదా అని నెటిజన్ల మధ్య చర్చ మొదలైంది. అయితే నిశితంగా పరిశీలిస్తే.. ఇవి 'అష్టోక్' (Ashtok) బ్రాండ్‌కు చెందినవని తెలుస్తోంది. వెబ్‌సైట్ సమాచారం ప్రకారం ఇవి స్వచ్ఛమైన వెండి కాదు. 'జర్మన్ సిల్వర్' వస్తువులు. ఒక్కో సెట్ ధర సుమారు రూ. 399 కాగా, ఎక్కువ మొత్తంలో కొంటే రూ. 276కు లభిస్తుంది. స్వీట్ల ఖర్చు అదనం. అయినప్పటికీ తమ హీరో నుంచి వచ్చిన కానుక కావడంతో అభిమానులు దీనిని ఆనందంగా స్వీకరిస్తున్నారు.

ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత.. పసిపాపతో చరణ్

ఫిబ్రవరి 1న తన రెండేళ్ల కుమార్తె క్లిన్ కారాతో కలిసి రామ్ చరణ్ ఆసుపత్రికి వచ్చాడు. ఈ సందర్భంగా అభిమానులు ఒక్కసారిగా అతని చుట్టూ గుమిగూడారు. చరణ్ చేతిలో చిన్నారి ఉన్నప్పటికీ సెల్ఫీల కోసం ఎగబడటంతో కాస్త ఇబ్బందికర వాతావరణం నెలకొంది.

మరోవైపు ఆసుపత్రి ఆవరణలో అభిమానులు బాణసంచా కాల్చడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆసుపత్రిలోని ఇతర రోగులకు, పసిపిల్లలకు ఇది ఇబ్బంది కలిగిస్తుందని, ఆసుపత్రి జోన్‌లో శబ్ద కాలుష్యం సరికాదని పలువురు అభిప్రాయపడ్డారు.

రామ్ చరణ్ కెరీర్ అప్‌డేట్స్

ఇక సినిమాల విషయానికి వస్తే శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'గేమ్ ఛేంజర్' తర్వాత రామ్ చరణ్ జోరు పెంచాడు. అతడు నటిస్తున్న తాజా మూవీ 'పెద్ది' మార్చిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఆ తర్వాత 'పుష్ప', 'రంగస్థలం' వంటి బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన సుకుమార్ దర్శకత్వంలో మరో భారీ చిత్రంలో నటించనున్నాడు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More