దేవుడిని నమ్మకపోతే దేవుడిపై సినిమా తీయొద్దా.. మీకెందుకు బీపీ, అల్సర్లు.. అలా సక్సెసైనందుకే ఇలా: రాజమౌళికి ఆర్జీవీ మద్దతు

రాజమౌళిని వెనకేసుకొచ్చాడు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. దేవుడిపై నమ్మకం లేదన్న అతని కామెంట్స్ లో తప్పులేదని, దేవుడిని నమ్మకపోతే దేవుడిపై సినిమా తీయకూడదా అని ప్రశ్నించాడు. ఆర్జీవీ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

Published on: Nov 21, 2025, 14:40:14 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వారణాసి గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో లార్డ్ హనుమాన్ గురించి ఎస్.ఎస్. రాజమౌళి చేసిన కామెంట్స్ వివాదాస్పదమైన నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అతనికి మద్దతుగా మాట్లాడాడు. రాజమౌళికి దేవుడిపై నమ్మకం లేదని చెప్పే హక్కు ఉందని వర్మ అన్నాడు. అయినా దేవుడిపై నమ్మకం లేదంటూ అదే దేవుడిపై ఎందుకు సినిమా తీస్తున్నాడని ప్రశ్నించిన వారికి కూడా అతడు గట్టి సమాధానమే ఇచ్చాడు.

దేవుడిని నమ్మకపోతే దేవుడిపై సినిమా తీయొద్దా.. మీకెందుకు బీపీ, అల్సర్లు.. అలా సక్సెసైనందుకే ఇలా: రాజమౌళికి ఆర్జీవీ మద్దతు
దేవుడిని నమ్మకపోతే దేవుడిపై సినిమా తీయొద్దా.. మీకెందుకు బీపీ, అల్సర్లు.. అలా సక్సెసైనందుకే ఇలా: రాజమౌళికి ఆర్జీవీ మద్దతు

రాజమౌళిని వెనకేసుకొచ్చిన ఆర్జీవీ

వారణాసి ఈవెంట్ లో రాజమౌళి కామెంట్స్ పై విమర్శల నేపథ్యంలో శుక్రవారం (నవంబర్ 21) రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. అందులో అతడు చేసిన కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి. ఓ సుదీర్ఘమైన పోస్టు అతడు రాయడం విశేషం. “రాజమౌళి మీద భక్తులమని చెప్పుకుంటున్నవాళ్లంతా ఆ విషం కక్కుతున్నారు కదా.. వాళ్లకు తెలియాల్సింది ఏంటంటే: ఇండియాలో నాస్తికుడిగా ఉండడం తప్పు కాదు. రాజ్యాంగంలో ఆర్టికల్ 25 ఏం చెప్తుందంటే నమ్మకుండా ఉండే హక్కు కూడా మనకు ఉంది. కాబట్టి ఆ విషం కక్కేవాళ్లకి నమ్మకం ఉందని చెప్పే హక్కు ఎంత ఉందో.. ఆయనకు (రాజమౌళికి) నమ్మకం లేదని చెప్పే హక్కు కూడా అంతే ఉంది.

ఇప్పుడు ఆ పనికిమాలిన వాదన దగ్గరికి వద్దాం. "దేవుడ్ని నమ్మకపోతే, సినిమాల్లో దేవుడ్ని ఎందుకు చూపిస్తాడు?" అని అంటున్నారు. ఆ లెక్కన చూస్తే ఒక దర్శకుడు గ్యాంగ్‌స్టర్ సినిమా తీయాలంటే గ్యాంగ్‌స్టర్ అవ్వాలా? హారర్ సినిమా తీయాలంటే దెయ్యం అవ్వాలా? ఇంకో షాకింగ్ నిజం ఏంటంటే? రాజమౌళి దేవుడ్ని నమ్మకపోయినా చాలామంది భక్తులు వంద జన్మల్లో కూడా చూడనంత విజయాన్ని, డబ్బును, అభిమానం అనే పూజను దేవుడే ఈయనకు వంద రెట్లు ఎక్కువ ఇచ్చాడు."

మీకెందుకు బీపీ, అల్సర్లు?

"కాబట్టి మూడిట్లో ఏదో ఒకటి జరిగి ఉండాలి.. దేవుడికి భక్తుల కంటే నాస్తికులే ఎక్కువ ఇష్టం.. దేవుడు ఇవన్నీ పట్టించుకోడు.. లేదంటే.. దేవుడు అక్కడ కూర్చుని, ఎవరు నమ్ముతున్నారో ఎవరు నమ్మడం లేదో నోట్‌ప్యాడ్‌లో రాసుకునే పనిలో లేడేమో? దేవుడికే ఆయనతో సమస్య లేకపోతే, ఈ స్వయం ప్రకటిత దేవుడి దళారులకు బీపీ, అల్సర్లు ఎందుకొస్తున్నాయి?

నిజమైన సమస్య ఈయన (రాజమౌళి) నాస్తికత్వం కాదు. నిజమైన సమస్య ఏంటంటే.. ఈయన దేవుడ్ని నమ్మకుండానే సక్సెస్ అయ్యాడు.. పిచ్చి పట్టినట్లు మొక్కినా సక్సెస్ కాలేకపోయిన వాళ్లకి ఇది భయాన్నిస్తుంది. కాబట్టి భక్తులు దేవుడ్ని వెనకేసుకొని రావడం ఆపాలి. ఎందుకంటే అది దేవుడ్ని అవమానించినట్లే. వాళ్ల రక్షణ అవసరమయ్యేంత బలహీనుడుగా దేవుడ్ని చూపిస్తున్నట్లే.

నిజం ఏంటంటే, రాజమౌళి నాస్తికుడు అయినంత మాత్రాన దేవుడు తగ్గిపోడు. ఎవరైనా నమ్మడం ఆపేస్తే తమ విశ్వాసం కూలిపోతుందని భయపడే వాళ్ల భద్రతా రాహిత్యం మాత్రమే పెరుగుతుంది. కాబట్టి రిలాక్స్ అవ్వండి. దేవుడు బాగానే ఉన్నాడు. రాజమౌళి బాగానే ఉన్నాడు. బాధపడేది ఎవరంటే.. ఆ ఇద్దరినీ అర్థం చేసుకోలేని జనం మాత్రమే.

అందుకే ఆ వారణాసి సినిమా ద్వారా దేవుడు మళ్లీ రాజమౌళి నిండుగా ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్‌కు ఇంకో భారీ అదృష్టాన్ని కలపబోతుంటే, ఆ ఓడిపోయిన వాళ్లు అసూయతో ఏడుస్తూ ఉండొచ్చు. ఫైనల్‌గా చెప్పాలంటే ఇది దేవుడిపై నమ్మకంలా నటించే పచ్చి అసూయ మాత్రమే.. జై హనుమాన్” అని వర్మ ట్వీట్ చేశాడు.

వివాదానికి కారణమేంటంటే?

వివాదం మొత్తం తన రాబోయే చిత్రం 'వారణాసి' గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ సందర్భంగా ప్రారంభమైంది. అక్కడ జరిగిన సాంకేతిక లోపాలపై రాజమౌళి భావోద్వేగంతో స్పందించాడు. "నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదు. నాన్నగారు వచ్చి ఇందాక హనుమ.. వెనకాల ఉంటాడు, నడిపిస్తాడు అని చెప్పారు. ఇది అయిన వెంటనే కోపం వచ్చింది. ఇదేనా నడిపించేది అని?" అని రాజమౌళి అన్నాడు.

ఈ వ్యాఖ్యలతో హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ నవంబర్ 15న వానర సేన సంస్థ హైదరాబాద్‌లో రాజమౌళిపై ఫిర్యాదు చేసింది. ఇక వారణాసి మూవీ విషయానికి వస్తే ఇందులో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మూవీ 2027లో రిలీజ్ కానుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More