RGV Obsession Review: స్టార్ల వెంట పడుతున్న వారికి ఈ మూవీ ఓ చెంపదెబ్బ: రూ.2279 కోట్ల హారర్ థ్రిల్లర్ మూవీపై ఆర్జీవీ
RGV Obsession Review: భారీ బడ్జెట్లు, స్టార్ హీరోలు, గ్రాఫిక్స్ హంగులు లేకుండానే ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించిన హాలీవుడ్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ 'అబ్సెషన్' (Obsession) పై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశంసల జల్లు కురిపించారు.
RGV Obsession Review: భారీ బడ్జెట్లు, అగ్ర నటీనటుల కాల్‌షీట్లు, కళ్లు చేదిరే గ్రాఫిక్స్ ఉంటేనే సినిమాలు హిట్ అవుతాయనే భ్రమలో ఉన్న సినీ పరిశ్రమకు హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ మూవీ 'అబ్సెషన్' (Obsession) కనువిప్పు కలిగించిందని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విశ్లేషించారు. కర్రీ బార్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సూపర్ నేచురల్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ చిత్రంపై వర్మ ప్రశంసలు కురిపించారు.

నటీనటుల స్టార్ ఇమేజ్, రీమేక్‌లు లేదా భారీ నిర్మాణ వ్యయాలపై ఆధారపడకుండా కేవలం కథాబలంతో సినిమా ఎలాంటి అద్భుతాలు సృష్టించగలదో ఈ మూవీ నిరూపించిందని ఆర్జీవీ స్పష్టం చేశారు. శుక్రవారం (జూన్ 12, 2026) సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ సినిమా విజయం వెనుక ఉన్న రహస్యాలను సుదీర్ఘంగా పంచుకున్నారు.
ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో, టాలీవుడ్, బాలీవుడ్‌లలో వందల కోట్ల బడ్జెట్లతో సినిమాలు తీయడం ఒక ట్రెండ్‌గా మారింది. హీరోల రెమ్యునరేషన్లు, భారీ విజువల్ ఎఫెక్ట్స్ (VFX) కోసమే నిర్మాతలు కోట్లాది రూపాయలు కుమ్మరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో కేవలం కథనం, ఎడిటింగ్ నైపుణ్యాలతో ప్రేక్షకుడిని థియేటర్లలో కూర్చోబెట్టవచ్చని 'అబ్సెషన్' నిరూపించిందని ఆర్జీవీ వివరించారు.
"భారీ సినిమాలు కాదు.. మంచి సినిమాలు తీయండి!"
ఈ అబ్సెషన్ సినిమా బడ్జెట్, సాధించిన వసూళ్ల లెక్కలను ఆర్జీవీ తన పోస్ట్‌లో పూసగుచ్చినట్లు వివరించారు. "అధికారికంగా ప్రకటించిన 7.5 లక్షల డాలర్ల బడ్జెట్‌ను కాసేపు పక్కన పెడితే.. కేవలం రెండు గదులు, ఒక కారు లోపలి భాగం, ఒక చిన్న స్టోర్ నేపథ్యంలో ఐదుగురు కొత్త నటీనటులతో తీసిన ఈ చిత్ర నిర్మాణ వ్యయం రూ.70 లక్షల కంటే ఎక్కువేమీ ఉండదు" అని ఆర్జీవీ లెక్కగట్టారు.
ఇంతటి తక్కువ ఖర్చుతో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 238 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 2,279 కోట్లు) వసూళ్లను రాబట్టిందని ఆయన వెల్లడించారు. ఇండియాలోనే ఈ మూవీ రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. ఈ అంకెలు చూసైనా చిత్రనిర్మాతలు "పెద్ద సినిమాలు కాదు.. మంచి సినిమాలు తీయడం" నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు.
ఆర్జీవీని మెప్పించిన సాంకేతిక మ్యాజిక్
దర్శకుడు కర్రీ బార్కర్ స్క్రీన్‌ప్లేని నడిపించిన తీరు వర్మను ఎంతగానో ఆకట్టుకుంది. "పరిమిత ప్రదేశాలలో షూటింగ్ చేయడం అనేది బడ్జెట్ తగ్గించుకోవడానికి కాదు, ప్రేక్షకుడిని పాత్రల మానసిక స్థితిలో బంధించడానికి దర్శకుడు వాడిన వ్యూహం" అని వర్మ విశ్లేషించారు.
"ఇందులో ఎడిటింగ్ అనేది కేవలం సీన్లను జత చేయడం కాదు.. ప్రేక్షకుడిపై సాగే ఒక మానసిక దాడి. తలుపులు గట్టిగా వేయడం, హఠాత్తుగా నవ్వడం, గుండె చప్పుడు, గొంతు మారడం వంటి శబ్దాలతో కూడిన వేగవంతమైన కట్స్ ప్రేక్షకుడిలో భయాన్ని రేకెత్తిస్తాయి" అని వర్మ దర్శకుడి ప్రతిభను కొనియాడారు. ఇంటర్వెల్ సీన్‌లో నిక్కీ ముఖంపై కెమెరాను చాలా సేపు నిలిపి ఉంచిన షాట్ తనకు అత్యంత ఇష్టమైన షాట్ అని ఆయన పేర్కొన్నారు.
ఇండస్ట్రీ ముఖంపై బలమైన చెంపదెబ్బ
స్టార్ల వెంట పడుతూ, రీమేక్‌లను నమ్ముకుంటూ, భారీ బడ్జెట్లతో రిస్క్ తీసుకోకుండా సేఫ్ గేమ్ ఆడాలని చూసే నేటి సినీ పరిశ్రమకు ఈ సినిమా ఒక బలమైన 'చెంపదెబ్బ' అని వర్మ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తక్కువ బడ్జెట్‌ను ఒక పరిమితిగా కాకుండా, స్వేచ్ఛగా భావించి కథనంపై దృష్టి పెట్టాలని ఆయన దర్శకులకు, నిర్మాతలకు సూచించారు.
వందల కోట్లు ఖర్చు పెట్టి ఏళ్ల తరబడి సినిమాలు తీసే నిర్మాతలకు ఈ సినిమా తెచ్చిన లాభాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయమని ఆర్జీవీ ఎద్దేవా చేశారు. కంప్యూటర్ గ్రాఫిక్స్ సైన్యాలు, భారీ సెట్లు, విదేశీ లొకేషన్ల కంటే దర్శకుడి ఆలోచన, పదునైన ఎడిటింగ్, సౌండ్ డిజైన్ మాత్రమే ప్రేక్షకులను ఎక్కువగా ప్రభావితం చేయగలవని ఆయన స్పష్టం చేశారు.
Obsession Plot | అసలు 'అబ్సెషన్' కథేంటి?
ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే.. మ్యూజిక్ స్టోర్‌లో పనిచేసే బేర్ (మైఖేల్ జాన్‌స్టన్) అనే యువకుడికి అనుకోకుండా కోరికలను తీర్చే శక్తులున్న ఒక వింత బొమ్మ దొరుకుతుంది. తన స్నేహితురాలు నిక్కీ (ఇండే నవారెట్) తనతో ప్రేమలో పడాలని ఆ బొమ్మను కోరుకుంటాడు.
అయితే ఆ కోరిక ఎలాంటి భయంకరమైన, ఊహించని పరిణామాలకు దారితీసింది అనేదే ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ కథాంశం. అతి తక్కువ ఖర్చుతో సంచలన విజయం సాధించిన ఈ చిత్రంపై ఇండియాలో అత్యంత ఓపెన్ గా మాట్లాడే దర్శకులలో ఒకరైన ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
హెచ్‌టీ విశ్లేషణ
రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్స్ వందకు వంద శాతం నిజం. టాలీవుడ్, బాలీవుడ్ లలో కేవలం హీరోల రెమ్యునరేషన్ల కోసమే వందల కోట్లు తగలేస్తున్న ఈ రోజుల్లో, కథలో దమ్ముంటే తక్కువ బడ్జెట్ తో కూడా వండర్స్ క్రియేట్ చేయొచ్చని 'అబ్సెషన్' నిరూపించింది. అబ్సెషనే కాదు.. ఇండియాలోనూ ఇలా తక్కువ బడ్జెట్ తో వండర్స్ క్రియేట్ చేసిన సినిమాలూ ఎన్నో ఉన్నాయి.
ఆర్జీవీ స్వయంగా 'శివ', 'రాత్రి', 'దెయ్యం' లాంటి సినిమాలతో తక్కువ బడ్జెట్ లో టెక్నికల్ మ్యాజిక్ చేసిన వ్యక్తి కాబట్టి, ఆయన ఈ సినిమాలోని ఎడిటింగ్, సౌండ్ డిజైనింగ్ ను అంతలా మెచ్చుకున్నారు. రాబోయే రోజుల్లో మన మేకర్స్ కూడా ఈ రూట్ లో ఆలోచిస్తే మంచి కంటెంట్ బయటకు వస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


