50 ఏళ్లలో ఏ సినిమా గురించీ ఇంతలా మాట్లాడుకోలేదు.. ఇదీ ఆ కుక్కలాంటిదే.. వాళ్లకు ఇదో పీడకల: రామ్ గోపాల్ వర్మ
ధురంధర్ సినిమాపై మరోసారి ప్రశంసల వర్షం కురిపించాడు రామ్ గోపాల్ వర్మ. ఇండస్ట్రీ పెద్దలు ఎవరూ ఈ సినిమాను ప్రశంసించకపోవడంపైనా స్పందించాడు. గత 50 ఏళ్లలో ఏ సినిమా గురించి ఇంతలా మాట్లాడుకోలేదని అతడు అనడం గమనార్హం.
రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్' (Dhurandhar) మూవీ బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల దిశగా దూసుకుపోతోంది. అయితే ఇంత పెద్ద హిట్‌ను ఇండస్ట్రీలోని పెద్దలు ఎవరూ మెచ్చుకోకపోవడంపై రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) తనదైన శైలిలో స్పందించాడు. ఈ సినిమా మిగతా నిర్మాతలకు ఒక భయం కలిగించే కుక్కలా మారిందని, పాత ఫార్ములా నమ్ముకున్న వాళ్లకు ఇదొక పీడకల అని వర్మ విశ్లేషించాడు.

"అదొక భయానకమైన కుక్క లాంటిది.."
ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తున్నా.. ఇండస్ట్రీ నుంచి ఆశించిన స్పందన రావడం లేదు. దీనికి గల కారణాలను ఆర్జీవీ ఎక్స్ వేదికగా పూసగుచ్చినట్టు వివరించాడు. వర్మ ఈ సినిమా ప్రభావాన్ని వివరిస్తూ ఒక ఆసక్తికరమైన ఉదాహరణ చెప్పాడు.
"మనం ఎవరి ఇంటికైనా వెళ్లినప్పుడు.. అక్కడ ఒక భారీ కుక్క మనల్నే చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది? ఓనర్ అది 'ఏం చేయదులే' అని చెప్పినా.. మనకు భయం వేస్తూనే ఉంటుంది కదా? 'ధురంధర్' సినిమా కూడా ఇప్పుడు ఇండస్ట్రీ జనాలకు అలాంటిదే. ప్రతి ప్రొడక్షన్ ఆఫీసులోనూ ఈ సినిమా అనే కుక్క అదృశ్యంగా తిరుగుతూ భయపెడుతోంది. దాని పేరు ఎత్తడానికి కూడా వాళ్లు ఇష్టపడటం లేదు" అని వర్మ సెటైర్ వేశాడు.
హీరోల భజన పనైపోయింది
ఇప్పటిదాకా గ్రాఫిక్స్, భారీ సెట్లు, ఐటమ్ సాంగ్స్, స్టార్ హీరోల భజన.. ఇదే టెంప్లేట్‌తో సినిమాలు తీస్తున్న వారికి 'ధురంధర్' ఒక హారర్ సినిమా లాంటిదని వర్మ అన్నాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న పాన్ ఇండియా సినిమాల పరిస్థితి ఏంటో తలచుకుంటేనే భయమేస్తోందని, 'ధురంధర్' లాంటి స్టాండర్డ్స్ అందుకోలేక మిగతా వాళ్ళు అసూయతో, భయంతో సైలెంట్‌గా ఉన్నారని అతడు అనడం గమనార్హం. "గత 50 ఏళ్లలో ఇంతగా చర్చించుకున్న సినిమా మరొకటి లేదు" అని వర్మ తేల్చి చెప్పాడు.
ఆర్జీవీకి డైరెక్టర్ ఎమోషనల్ రిప్లై
వర్మ పొగడ్తలకు దర్శకుడు ఆదిత్య ధర్ ఎమోషనల్ అయ్యాడు. "కొన్నేళ్ల క్రితం ఒక సూట్‌కేస్, ఒక కల పట్టుకుని ముంబై వచ్చాను. ఎప్పటికైనా మీ (రామ్ గోపాల్ వర్మ) దగ్గర పని చేయాలనేది నా కోరిక. అది కుదరలేదు కానీ.. మీ సినిమాలు నాకు 'ప్రమాదకరంగా ఆలోచించడం' ఎలాగో నేర్పాయి" అని ఆదిత్య రిప్లై ఇచ్చాడు.
'ధురంధర్' బాక్సాఫీస్ హవా
రణ్‌వీర్ సింగ్ లీడ్ రోల్లో నటించిన ధురంధర్ మూవీ ఇప్పటికే ఇండియాలో రూ. 600 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 900 కోట్లు దాటిన ఈ చిత్రం రూ. 1000 కోట్ల క్లబ్ వైపు వెళ్తోంది.
కాందహార్ విమాన హైజాక్, 26/11 ముంబై దాడుల నేపథ్యంలో సాగే ఇంటెన్స్ స్పై థ్రిల్లర్ ఇది. రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


