...
...
Next Story

RGV Michael Review: ఐ హేట్ మైఖేల్.. నువ్వూ మాలాగా మనిషివి అయినందుకు.. మోసం చేశావ్.. అది చివరి శ్వాస వరకూ నాతోనే: ఆర్జీవీ

RGV Michael Review: కింగ్ ఆఫ్ పాప్ మైఖేల్ జాక్సన్ పై వచ్చిన మైఖేల్ మూవీపై రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన రివ్యూ వైరల్ అవుతోంది. ఐ హేట్ మైఖేల్ అంటూ మొదలుపెట్టి అతడు చేసిన ఎమోషనల్ పోస్ట్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది.

Published on: May 22, 2026, 18:00:52 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

RGV Michael Review: టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు ఎప్పుడూ సరికొత్త చర్చకు దారితీస్తాయి. తాజాగా ఆయన చేసిన ఒక సుదీర్ఘమైన పోస్ట్ నెటిజన్ల గుండెలను పిండేస్తోంది. పాప్ కింగ్, దివంగత మైఖేల్ జాక్సన్ (MJ) పై తనకున్న అమితమైన ప్రేమను, ఆయన మరణం కలిగించిన తీరని వేదనను వర్మ అక్షర రూపంలో పంచుకున్నారు. "నేను మైఖేల్ జాక్సన్‌ను ద్వేషిస్తున్నాను" అంటూ ప్రారంభించిన ఈ సందేశం ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఆ అక్షరాలు నా ప్రపంచాన్ని కుదిపేశాయి

RGV Michael Review: ఐ హేట్ మైఖేల్.. నువ్వూ మాలాగా మనిషివి అయినందుకు.. మోసం చేశావ్.. అది చివరి శ్వాస వరకూ నాతోనే: ఆర్జీవీ
RGV Michael Review: ఐ హేట్ మైఖేల్.. నువ్వూ మాలాగా మనిషివి అయినందుకు.. మోసం చేశావ్.. అది చివరి శ్వాస వరకూ నాతోనే: ఆర్జీవీ

మైఖేల్ జాక్సన్ బయోపిక్ మైఖేల్ మూవీ చూసిన తర్వాత తనకు కలిగిన భావాలను ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా 2009 జూన్ 25 నాటి భయంకరమైన రోజును వర్మ గుర్తు చేసుకున్నారు. ఆ రాత్రి ఆలస్యంగా నిద్రపోయి, ఉదయాన్నే లేచి చూసేసరికి టీవీ స్క్రీన్‌పై నలుపు రంగు బ్యాక్‌గ్రౌండ్‌లో తెల్లటి అక్షరాలతో ఒక వార్త కనిపించింది.

"మైఖేల్ జాక్సన్ మరణించారు" అనే వార్తను టీవీ స్క్రీన్‌పై చూసి షాకయ్యాను.

"మొదట అది ఒక పీడకల అనుకున్నాను. ఇంతటి ఘోరమైన కల నాకు ఎందుకు వస్తుందని భావించాను. కానీ ప్రతి న్యూస్ ఛానల్‌లోనూ యాంకర్లు అదే విషయాన్ని తీవ్రమైన ఆవేదనతో చెప్తుండటంతో నమ్మక తప్పలేదు" అని వర్మ ఆనాటి చేదు జ్ఞాపకాన్ని పంచుకున్నారు.

విజయవాడ వీడియో పార్లర్.. 'థ్రిల్లర్' సృష్టించిన తుఫాన్

తన సినీ ప్రస్థానానికి పునాది పడిన రోజుల్లోకి వెళ్తూ, విజయవాడలో ఇంజనీరింగ్ చదువుతున్న రోజులను వర్మ గుర్తుచేసుకున్నారు. 1984 జనవరి 2న ఒక స్నేహితుడు బలవంతంగా తనను ఒక చిన్న చీకటి వీడియో పార్లర్‌కు తీసుకెళ్లాడు. అక్కడ లైట్లు ఆర్పేసి, మైఖేల్ జాక్సన్ ప్రసిద్ధ 'థ్రిల్లర్' (Thriller) మ్యూజిక్ వీడియోను ప్లే చేశారు.

స్క్రీన్‌పై జాక్సన్ ఒక అద్భుత శక్తిలా కదిలారని, ఆయన మనిషిలా కాకుండా ఒక దేవుడిలా, భూమిపై ఉన్న మనుషులను ఆశీర్వదించడానికి వచ్చిన ఒక ఊహాజనిత రూపంలా కనిపించారని వర్మ పేర్కొన్నారు.

నా సినిమా పాటలకు ఆయనే అంతిమ బెంచ్‌మార్క్

భారతీయ చిత్రరంగంలో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన రామ్ గోపాల్ వర్మ, తన ప్రతి సినిమాలోనూ పాటల చిత్రీకరణకు మైఖేల్ జాక్సన్ వీడియోలనే స్ఫూర్తిగా తీసుకునేవారట. 'బీట్ ఇట్', 'బిల్లీ జీన్', 'స్మూత్ క్రిమినల్', 'బ్లాక్ ఆర్ వైట్', 'బ్యాడ్' వంటి అద్భుతమైన పాటలు తన టీమ్‌తో లేదా ఇతర దర్శకులతో జరిపే ప్రతి చర్చలోనూ ప్రస్తావనకు వచ్చేవని చెప్పారు.

జాక్సన్ డ్యాన్స్, వాయిస్ మాత్రమే కాదు.. ఆయనకున్న అద్భుతమైన ఆరా ఎవరికీ సాధ్యం కాని ఒక ప్రమాణాన్ని నెలకొల్పిందని కొనియాడారు. ఆయన చుట్టూ ఉన్న వివాదాలు లేదా గాసిప్స్ తనను ఎప్పుడూ ప్రభావితం చేయలేదని, ఆ వార్తలు కేవలం వెనుక వినిపించే శబ్దాలు మాత్రమేనని తేల్చి చెప్పారు. జాక్సన్ సృష్టించిన కళ మాత్రమే తన మనసును తాకిందని స్పష్టం చేశారు.

మనిషిగా ఎందుకు చనిపోయావు? అందుకే ద్వేషిస్తున్నా

జాక్సన్‌ను ఒక అమరుడిగా, దేవుడిగా భావించిన వర్మకు, ఆయన మరణం తీవ్ర నిరాశను మిగిల్చింది. ఆయన చనిపోయాడనే నిజాన్ని వర్మ భరించలేకపోయారు.

"ఆయన కూడా మనలాగే రక్తం, మాంసం ఉన్న సాధారణ మనిషేనని, బతకడానికి ఆక్సిజన్ అవసరమని రుజువు చేసినందుకు ఆయనపై కోపం వచ్చింది" అని వర్మ ఎంతో ఆవేదనతో రాసుకొచ్చారు.

జాక్సన్ పార్థివ దేహాన్ని మార్చురీకి తరలించారనే వార్త చూసి తన ఫాంటసీ ప్రపంచం ముక్కలైందని చెప్పారు. "నన్ను మోసం చేసి, దేవుడి స్థానం నుంచి మనిషిగా మారిపోయినందుకు ఆయనను ద్వేషిస్తున్నాను" అంటూ తన మనసులోని మాట బయటపెట్టారు.

చివరగా.. "ఐ లవ్ యు మైఖేల్.. మాటల్లో చెప్పలేనంతగా నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు ఏ లోకంలో ఉన్నా, నక్షత్రాలు కూడా తలవంచేలా గెలాక్సీల మధ్య మూన్‌వాక్ చేస్తూనే ఉంటావని నాకు తెలుసు. విజయవాడ వీడియో పార్లర్‌లో కలిగిన ఆ విస్మయం నా చివరి శ్వాస వరకు నాతోనే ఉంటుంది" అంటూ వర్మ తన సుదీర్ఘమైన పోస్ట్‌ను ముగించారు. ఒక దర్శకుడిగా వర్మను ఇంతలా కదిలించిన అంతర్జాతీయ సెలబ్రిటీ మరొకరు లేరనడానికి ఈ పోస్టే నిదర్శనం.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. మైఖేల్ జాక్సన్ గురించి రామ్ గోపాల్ వర్మ చేసిన తాజా పోస్ట్ సారాంశం ఏమిటి? మైఖేల్ జాక్సన్ తన జీవితాన్ని, సినిమా మేకింగ్ శైలిని ఎంతగా ప్రభావితం చేశారో వివరిస్తూ వర్మ ఒక సుదీర్ఘమైన, భావోద్వేగపూరితమైన పోస్ట్ పెట్టారు. ఆయనను ఒక దేవుడిగా భావించానని, ఆయన మరణం ద్వారా తానొక సాధారణ మనిషినని నిరూపించుకున్నందుకు 'ద్వేషిస్తున్నాను' అంటూనే, ఆయనపై ఉన్న అమితమైన ప్రేమను వ్యక్తపరిచారు.

2. ఆర్జీవీపై మైఖేల్ జాక్సన్ ప్రభావం ఎప్పుడు, ఎక్కడ మొదలైంది? 1984 జనవరి 2న విజయవాడలో ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో, ఒక చిన్న వీడియో పార్లర్‌లో మైఖేల్ జాక్సన్ ప్రసిద్ధ ఆల్బమ్ 'థ్రిల్లర్' చూసినప్పటి నుంచి వర్మ ఆయనకు మతిపోయే అభిమానిగా మారారు. ఆ విజువల్స్ తన ఆలోచనా విధానాన్ని మార్చేశాయని వర్మ చెప్పారు.

3. తన చిత్రాలలోని పాటల చిత్రీకరణకు ఆర్జీవీ ఎవరిని బెంచ్‌మార్క్‌గా తీసుకునేవారు? తన సినీ కెరీర్‌లో ఏ సినిమా పాటల చిత్రీకరణ గురించి చర్చ జరిగినా, మైఖేల్ జాక్సన్ మ్యూజిక్ వీడియోలనే అంతిమ బెంచ్‌మార్క్‌గా తీసుకునేవాడినని వర్మ స్వయంగా వెల్లడించారు. 'బిల్లీ జీన్', 'బీట్ ఇట్', 'స్మూత్ క్రిమినల్' వంటి పాటలు తనకు నిరంతరం స్ఫూర్తినిచ్చాయని పేర్కొన్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe