RGV: ఈ చదువును చంపేయండి.. నీట్ ఎందుకు? ఎంబీబీఎస్ ఎందుకు? పదేళ్లు దండగ: ఆర్జీవీ సంచలన ట్వీట్
RGV: రామ్ గోపాల్ వర్మ మరోసారి ఓ సంచలన ట్వీట్ తో వార్తల్లో నిలిచారు. మన విద్యా వ్యవస్థలోని లోపాలు, ఏఐ చూపుతున్న ప్రభావం వంటి అంశాలపై స్పందిస్తూ.. ఇప్పుడున్న చదువును చంపేయాలని, అసలు పదేళ్లు కష్టపడి ఎంబీబీఎస్ ఎందుకు చదవడం అని ప్రశ్నించడం గమనార్హం.
RGV: టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) సోషల్ మీడియా వేదికగా మరోసారి విపరీతమైన రచ్చ లేపారు. "ప్రస్తుతం దేశంలో ఉన్న చదువుల వ్యవస్థను పూర్తిగా చంపేయాలి" అంటూ ఆర్జీవీ చేసిన ట్వీట్ ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై తీవ్ర దుమారం రేపుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో పాతకాలపు చదువులు దండగ అంటూ ఆయన కుండబద్దలు కొట్టారు.

10 ఏళ్ల మెడికల్ చదువు వేస్ట్.. జేబులో ఉన్న AIకి అన్నీ తెలుసు!
చదువుకొని, పరీక్షలు పాసై, డిగ్రీ తెచ్చుకుని, ఉద్యోగం చేసే పాతకాలపు ఫార్ములాను ఇకనైనా చింపి పారేయాలని రామ్ గోపాల్ వర్మ ఘాటుగా పిలుపునిచ్చారు. ఒక మెడికల్ స్టూడెంట్ ఎంబీబీఎస్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, స్పెషలైజేషన్ అంటూ దాదాపు 10 ఏళ్ల విలువైన కాలాన్ని చదువు కోసం తగలేస్తున్నారని ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అంతకాలం కష్టపడి నేర్చుకునే విషయాన్ని మన జేబులో ఉండే స్మార్ట్‌ఫోన్‌లోని ఏఐ క్షణాల్లో చెప్పేస్తోందని కామెంట్ చేశారు.
డాక్టర్లు పేషెంట్లను పరీక్షించి, డేటా చూసి చికిత్స అందించే పనిని ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా వేగంగా, ఎలాంటి అలసట లేకుండా పర్‌ఫెక్ట్‌గా చేస్తోందని వర్మ గుర్తుచేశారు. ఆధునిక ఏఐకి పితామహుడిగా పేరుగాంచిన జెఫ్రీ హింటన్ (Geoffrey Hinton) కూడా ఇదే విషయాన్ని గట్టిగా చెప్తున్నారని ఆయన పేర్కొన్నారు.
నీట్ ఎగ్జామ్‌లు ఎందుకు? సర్జరీలన్నీ రోబోటిక్ మయమే!
రాబోయే ఒకటి రెండేళ్లలో డాక్టర్లు చేసే పనులన్నింటినీ ఏఐ పూర్తిగా రీప్లేస్ చేస్తుందని నిపుణులు చెప్తున్నారని వర్మ వివరించారు. అలాంటప్పుడు విద్యార్థులు ఇంకా నీట్ (NEET) ఎగ్జామ్స్ కోసం సిద్ధపడటం, ఏళ్లకు ఏళ్లు మెడికల్ కోర్సుల్లో చేరడం దేనికని ఆయన ప్రశ్నించారు.
రోగాలు నిర్ధారించడం ఆల్గోరిథమ్‌లతో, ఆపరేషన్లు రోబోలతో జరుగుతున్నప్పుడు హ్యూమన్ డాక్టర్ కేవలం ఒక మిడిల్‌మ్యాన్‌లా మారిపోతారని, దానికోసం 10 ఏళ్లు చదవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు.
పాతకాలపు ఆలోచనలు వదలండి.. భవిష్యత్తు ఏఐదే!
పిల్లలు ఫోన్‌లో ఉన్న విషయాన్నే మేమెందుకు బట్టీ పట్టాలని ప్రశ్నిస్తే, ఈ సమాజం వాళ్లను పిచ్చివాళ్లలా చూస్తోందని వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. టీచర్లు ఇంకా "సిలబస్‌లో ఉంది" అని, పేరెంట్స్ "అందరూ ఇదే చేస్తున్నారు" అని చెబుతూ కళ్ళు మూసుకుని బతుకుతున్నారని విమర్శించారు. ఇప్పటికే మార్చురీలో ఉన్న ఈ సాంప్రదాయ విద్యావ్యవస్థను ఇంకా ఎందుకు పూడ్చిపెట్టడం లేదని నిలదీశారు.
పెద్దల అజ్ఞానం వల్ల యువత భవిష్యత్తు నాశనం కాకముందే ఈ విద్యావ్యవస్థను రూపుమాపాలని వర్మ పిలుపునిచ్చారు. పిల్లలను వీలైనంత వేగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు తీసుకెళ్లడమే ఏకైక మార్గమని, పాత చదువులను చెత్తబుట్టలో పడేయాలని ఆయన సూచించారు.
ట్రెండింగ్‌లో ఆర్జీవీ పోస్ట్.. నెటిజన్ల భిన్నమైన స్పందన
రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ ట్వీట్‌పై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది. కొంతమంది నెటిజన్లు వర్మ మాటలు వంద శాతం నిజమని, మారిన సాంకేతికతకు అనుగుణంగా విద్యావ్యవస్థ మారాల్సిందేనని మద్దతు ఇస్తున్నారు. మరికొందరు మాత్రం డాక్టర్లకు ఉండే హ్యూమన్ టచ్, ఎమోషనల్ కనెక్షన్‌ను ఏఐ ఎప్పటికీ రీప్లేస్ చేయలేదని కామెంట్స్ చేస్తున్నారు.
ఏది ఏమైనా 'శివ', 'సత్య', 'రంగీలా' లాంటి సంచలన సినిమాలతో ట్రెండ్ సెట్ చేసిన ఆర్జీవీ, ఇప్పుడు సమాజంలో ఉన్న విద్యావ్యవస్థ లోపాలపై చేసిన కామెంట్స్ మాత్రం ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


