Ramayana Pakistan: పాకిస్థాన్‌ను ఊపేస్తున్న రామాయణ క్రేజ్.. ఎటు చూసినా జై శ్రీరామ్ నినాదాలు.. రణ్‌బీర్ కటౌట్లే..

Ramayana Pakistan: రణబీర్ కపూర్, దర్శకుడు నితేష్ తివారీ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న మైథలాజికల్ విజువల్ వండర్ 'రామాయణ' (Ramayana) మేనియా సరిహద్దులు దాటింది. పాకిస్థాన్ లోని కరాచీలో ఉన్న హిందూ భక్తులు రణబీర్ 'రామాయణ' పోస్టర్లతో వీధుల్లో భారీ ఊరేగింపు నిర్వహించి, జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు.

Published on: Oct 29, 2026, 15:15:27 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Ramayana Pakistan: రామాయణం ఇండియానే కాదు పాకిస్థాన్ ను కూడా ఊపేస్తోంది. దాయాది దేశంలో ఉన్న హిందువులు ఈ సినిమా రిలీజ్ ను పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ నవంబర్ 5న దీపావళి సందర్భంగా థియేటర్లలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

Ramayana Pakistan: పాకిస్థాన్‌ను ఊపేస్తున్న రామాయణ క్రేజ్.. ఎటు చూసినా జై శ్రీరామ్ నినాదాలు.. రణ్‌బీర్ కటౌట్లే.. (hindustan)
Ramayana Pakistan: పాకిస్థాన్‌ను ఊపేస్తున్న రామాయణ క్రేజ్.. ఎటు చూసినా జై శ్రీరామ్ నినాదాలు.. రణ్‌బీర్ కటౌట్లే.. (hindustan)

అయితే ఈ సినిమా పట్ల కేవలం ఇండియా లేదా పాశ్చాత్య దేశాలలోనే కాదు, పొరుగున ఉన్న పాకిస్థాన్ లోనూ ఊహించని రీతిలో భారీ క్రేజ్ నెలకొంది. కరాచీలోని చరిత్రాత్మక శ్రీరామ ఆలయంలో డప్పు వాయిద్యాల నడుమ సినిమా పోస్టర్‌ను ప్రతిష్టించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

కరాచీ వీధుల్లో డప్పుల చప్పుడు.. 'మేరే ఘర్ రామ్ ఆయే' పాటలు

పాపులర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడిట్ (Reddit)లో ప్రచారంలోకి వచ్చిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. పాకిస్తాన్‌లోని కరాచీ (Karachi) నగరానికి చెందిన హిందూ సమాజంలోని వాళ్లు రణబీర్ కపూర్ 'రామాయణ' సినిమా పోస్టర్లను చేతిలో పట్టుకుని కరాచీ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లారు.

ఆడపడుచులు, యువకులు డప్పు వాయిద్యాల నడుమ శోభాయాత్రగా సాగుతూ.. భక్తి పారవశ్యంతో "మేరే ఘర్ రామ్ ఆయే హై" (నా ఇంటికి రామయ్య వచ్చాడు) అనే దివ్యమైన పాటను పాడుతూ నృత్యాలు చేశారు. "జై శ్రీరామ్", "సియావర్ రామచంద్రకీ జై" అంటూ కరాచీ వీధుల్లో వారు చేసిన నినాదాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.

రణబీర్ కపూర్‌కు ఆస్కార్ రావాలి

ఈ ఊరేగింపులో పాల్గొన్న ఒక పాకిస్తానీ మహిళ మాట్లాడుతూ.. "రణబీర్ కపూర్ మా అందరికీ ఎంతో ఇష్టమైన హీరో. ఆయన శ్రీరాముడి పాత్ర పోషించడం మాకు ఎంతో సంతోషాన్నిస్తోంది. శ్రీరాముడి ఆశీస్సులు రణబీర్ పై ఎల్లప్పుడూ ఉండాలని, ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయాలని మేము కోరుకుంటున్నాం" అని హృదయపూర్వకంగా తెలిపారు.

వీడియో చిత్రీకరించిన మరొక వ్యక్తి స్పందిస్తూ.. "ఈ 'రామాయణ' చిత్రం ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద విజయం సాధించడమే కాకుండా, మన భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పి ఆస్కార్ (Oscar)ను కూడా గెలుచుకోవాలి" అని ఆకాంక్షించారు.

చారిత్రక కరాచీ మందిరంలో 'రామాయణ' పోస్టర్

వీధుల్లో ఊరేగింపు అనంతరం భక్తులంతా కరాచీలోని చరిత్రాత్మక శ్రీరామ మందిరానికి చేరుకుని, డప్పు వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో సినిమా పోస్టర్‌ను ప్రతిష్టించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన పూజారి మాట్లాడుతూ.. "ఈ దీపావళికి విడుదలవుతున్న 'రామాయణం' సినిమాను మేమంతా ఎంతో ఆసక్తిగా చూడబోతున్నాం. రామాయణంలో రాముడు చూపిన ధర్మ మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలి. ఇంతటి అద్భుతమైన చిత్రాన్ని నిర్మించిన నమిత్ మల్హోత్రా, నితేష్ తివారీలకు, రణబీర్ కపూర్‌కు పాకిస్థాన్ హిందువుల తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం" అని అన్నారు.

రూ. 4000 కోట్ల బడ్జెట్.. నవంబర్ 5న గ్రాండ్ రిలీజ్

భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌గా చెబుతూ ఏకంగా రూ. 4000 కోట్ల అంచనా వ్యయంతో నిర్మితమైన ఈ సినిమాను నమిత్ మల్హోత్రా, కేజీఎఫ్ స్టార్ యశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సన్నీ డియోల్ (హనుమంతుడు), రవి దూబే (లక్ష్మణుడు) కీలక పాత్రలు పోషిస్తున్న ఈ విజువల్ వండర్ పార్ట్-1 రాబోయే నవంబర్ 5న (దీపావళి కానుకగా) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇక రెండో భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More