Ramayana Making: జియోహాట్‌స్టార్‌లో రామాయణ మేకింగ్ వీడియో.. 4 వేల కోట్ల బడ్జెట్.. మూడేళ్ల కష్టం.. బీటీఎస్ వీడియో అద్భుతం
Ramayana Making: రణబీర్ కపూర్, నితీష్ తివారీ కాంబినేషన్లో వస్తున్న మైథలాజికల్ ఎపిక్ ప్రాజెక్ట్ 'రామాయణ' మేకింగ్ వీడియోను జియోహాట్‌స్టార్‌లో విడుదల చేశారు. 6 నిమిషాలకుపైగా నిడివి ఉన్న ఈ బిహైండ్ ద సీన్స్ (BTS) వీడియోలో దాదాపు 3 సంవత్సరాల పాటు వేలాది మంది టెక్నీషియన్లు పడిన అపారమైన శ్రమను చూడొచ్చు.
Ramayana Making: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఊహకందని కాన్వాస్‌పై రూపొందుతున్న మైథలాజికల్ విజువల్ వండర్ 'రామాయణ' (Ramayana). దంగల్ ఫేమ్ నితేష్ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో, సౌత్ క్వీన్ సాయి పల్లవి సీతాదేవి పాత్రలో నటిస్తున్నారు. ఈ భారీ చిత్రం వచ్చే వారం థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో, మేకర్స్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పవర్ఫుల్ ‘మేకింగ్ వీడియో’ని జియోహాట్‌స్టార్ (JioHotstar) ద్వారా విడుదల చేశారు.

ఈ బిహైండ్ ద సీన్స్ క్లిప్ సోషల్ మీడియాలో విడుదలైన నిమిషాల్లోనే వైరల్‌గా మారి, ప్రేక్షకులను మైమరిపిస్తోంది. రాముడి పాత్ర కోసం రణబీర్ కపూర్ తన లైఫ్‌స్టైల్‌నే మార్చుకోగా, సీతగా నటిస్తున్న సాయి పల్లవి ఎమోషనల్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
6 నిమిషాలకుపైగా మేకింగ్ వీడియో
జియోహాట్‌స్టార్ ఓటీటీలో రామాయణ మూవీ మేకింగ్ వీడియో 6 నిమిషాలకుపైగా నిడివితో ఉంది. ఈ వీడియో ప్రారంభంలో శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవి, హనుమంతుల ఫొటో చూపించారు. ఆ తర్వాత రామాయణ శ్లోకాలు, పౌరాణిక గ్రంథాల భాగాలు ప్రత్యక్షమవుతాయి. అనంతరం ఈ సినిమా కోసం వేసిన భారీ సెట్ల నిర్మాణాన్ని దృశ్య రూపంలో ఆవిష్కరించారు.
దశరథ మహారాజు రాజసభ, అంతఃపురం నిర్మాణం, స్వర్ణ లంకను విజువల్ ఎఫెక్ట్స్ (VFX) సహాయంతో ఎలా సృష్టించారో ఇందులో చూపించారు. హాలీవుడ్ స్థాయి విజువల్స్ కోసం విదేశీ స్టంట్ మాస్టర్లు, వీఎఫ్ఎక్స్ నిపుణులు ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేయడం మనం చూడవచ్చు. బ్లూ స్క్రీన్ బ్యాక్‌డ్రాప్‌లో రణబీర్ కపూర్ హై-వోల్టేజ్ యాక్షన్ సీన్లు చేస్తున్న దృశ్యాలు, దర్శకుడు నితేష్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రాల పర్యవేక్షణ ఈ వీడియోలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
రాముడి పాత్రతో మారిన రణబీర్ జీవితం
ఈ సినిమా కోసం రణబీర్ కపూర్ ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా కష్టపడ్డారు. శ్రీరాముడి పాత్రకు సంపూర్ణ న్యాయం చేయడం కోసం ఆయన తన శరీర ఆకృతిని మార్చుకోవడమే కాకుండా, మాట తీరు, నడక, జీవనశైలిని కూడా మార్చుకున్నారు. "ఈ పాత్ర పోషించడం ద్వారా నాకు ఒక రకమైన జ్ఞానోదయం కలిగింది. మానసికంగా నేను చాలా ప్రశాంతంగా, స్పష్టతతో ఉన్నాను" అని రణబీర్ గతంలో పేర్కొన్నారు.
మరోవైపు సీతాదేవి పాత్రలో నటిస్తున్న సాయి పల్లవి మాట్లాడుతూ.. "సాధారణంగా నేను చేసే పాత్రలకు నా సొంత ఆలోచనలను జోడిస్తుంటాను. కానీ ఈ పవిత్రమైన సీతమ్మ పాత్ర కోసం నేను కేవలం అమ్మవారినే ప్రార్థించాను. ఆ పాత్ర నుంచి నేను ఏం నేర్చుకోగలనో దానికే ప్రాధాన్యత ఇచ్చాను" అని వికసించిన హృదయంతో పంచుకున్నారు.
రూ. 4000 కోట్ల బడ్జెట్, వివాదాలు
'రామాయణ' మూవీ రెండు భాగాల నిర్మాణానికి గాను మేకర్స్ నమిత్ మల్హోత్రా, కేజీఎఫ్ స్టార్ యశ్ కలిసి ఏకంగా రూ. 4000 కోట్ల భారీ బడ్జెట్‌ను వెచ్చించారు. కోట్ల మంది హిందువుల భావోద్వేగాలతో కూడుకున్న ఇతిహాసం కావడం వల్ల ఎక్కడా ఎలాంటి సెంటిమెంట్లకు భంగం కలగకుండా అత్యున్నత ప్రమాణాలతో ఈ సినిమాను తెరకెక్కించారు.
అయితే ఇటీవల ఈ సినిమాలోని 'మంగళ్ రంగ్' (Mangal Rang) అనే పాటపై సోషల్ మీడియాలో చిన్నపాటి వివాదం చెలరేగింది. రణబీర్, సాయి పల్లవిలపై చిత్రీకరించిన ఈ పసుపు వేడుక పాటకు 'రాక్‌స్టార్'లోని 'కున్ ఫాయా కున్' కవ్వాలీ పోలికలు ఉన్నాయని, అలాగే హిందూ సంప్రదాయంలో వధూవరులు పసుపు వేడుకలో కలిసి ఉండరని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేశారు.
నవంబర్ 5న గ్రాండ్ రిలీజ్
వివాదాలను పక్కనబెడితే, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ (A.R. Rahman) అందించిన దివ్యమైన సంగీతం, నెట్టింట ఇప్పటికే దుమ్మురేపిన ట్రైలర్ ప్రేక్షకులలో సినిమాపై అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేశాయి. నితేష్ తివారీ తెరకెక్కించిన ఈ దృశ్య కావ్యం నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. బిగ్ స్క్రీన్‌పై ఈ ఎపిక్ అడ్వెంచర్‌ను వీక్షించడానికి కోట్లాది మంది ఆడియెన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


