OTT Real: నిజ జీవిత కథలతో మెప్పించిన బెస్ట్ 5 ఓటీటీ థ్రిల్లర్స్- అన్నీ తెలుగులో, ఒకేదాంట్లో స్ట్రీమింగ్- ఎక్కడ చూడాలంటే?

Top 5 OTT Series With Real Incidents On Sony Liv: సినిమా కథలను మించిన అసలైన సత్యాలు, థ్రిల్లింగ్ సంఘటనలతో రూపొందిన వెబ్ సిరీస్‌‌లకు ఓటీటీలో విపరీతమైన క్రేజ్ ఉంది. దేశ చరిత్రలోని అతిపెద్ద కుంభకోణాలు, శాస్త్రవేత్తల పోరాటాలు, మిలిటరీ ఆపరేషన్ల ఆధారంగా సోనీలివ్ తీసుకొచ్చిన టాప్ 5 సిరీస్‌లపై లుక్కేద్దాం.

Published on: Oct 2, 2026, 17:00:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Top 5 OTT Series With Real Incidents: సినిమా తెరపై వచ్చే కల్పిత కథలు ఒకే తరహా ఫార్ములాతో కొన్నిసార్లు విసుగు తెప్పిస్తుంటాయి. అలాంటి సమయంలో నిజ జీవితంలో జరిగిన యథార్థ సంఘటనలు, ఊహకందని మలుపులు ఉన్న కథలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.

నిజ జీవిత కథలతో మెప్పించిన బెస్ట్ 5 ఓటీటీ థ్రిల్లర్స్- అన్నీ తెలుగులో, ఒకేదాంట్లో స్ట్రీమింగ్- ఎక్కడ చూడాలంటే?
నిజ జీవిత కథలతో మెప్పించిన బెస్ట్ 5 ఓటీటీ థ్రిల్లర్స్- అన్నీ తెలుగులో, ఒకేదాంట్లో స్ట్రీమింగ్- ఎక్కడ చూడాలంటే?

కుంభకోణాలు, చారిత్రాత్మక ఘట్టాలు, మిలటరీ ఆపరేషన్లు

భారతదేశ చరిత్రలో చోటుచేసుకున్న అతిపెద్ద కుంభకోణాలు, చారిత్రాత్మక ఘట్టాలు, మిలటరీ ఆపరేషన్లు, నేర పరిశోధనల నేపథ్యంతో రూపొందే కథలకు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. డిజిటల్ ప్రపంచంలో ఇలాంటి నిజమైన కథలను అద్భుతమైన నిర్మాణ విలువలతో అందించడంలో ఓటీటీ వేదిక 'సోనీలివ్' (SonyLIV) ముందువరసలో నిలిచింది. నిజ సంఘటనల ఆధారంగా నిర్మించి, తప్పక చూడాల్సిన టాప్ 5 వెబ్ సిరీస్‌లు ఏంటో లుక్కేద్దాం.

స్కామ్ 1992: ది హర్షద్ మెహతా స్టోరీ (Scam 1992: The Harshad Mehta Story)

భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో సంచలనం సృష్టించిన హర్షద్ మెహతా జీవిత కథ ఆధారంగా ఈ ఓటీటీ సిరీస్ రూపుదిద్దుకుంది. ఒక సామాన్య దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన హర్షద్ మెహతా.. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్‌ను ఎలా శాసించాడు? బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలను అనుకూలంగా మార్చుకుని వేల కోట్ల ఆర్థిక సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడు? చివరకు అది ఎలా కూలిపోయింది? అనే అంశాలను దర్శకుడు హన్సల్ మెహతా తెరపై ఆవిష్కరించారు.

ప్రసిద్ధ జర్నలిస్టులు సుచేతా దలాల్, దేబాశిష్ బసు రాసిన 'ది స్కామ్: హూ వోన్, హూ లాస్ట్, హూ గాట్ అవే' పుస్తకం ఆధారంగా ఈ 10 ఎపిసోడ్ల సిరీస్‌ను రూపొందించారు. ఇందులో హర్షద్ మెహతా పాత్రలో ప్రతీక్ గాంధీ నటించగా.. శ్రేయా ధన్వంతరి, హేమంత్ ఖేర్, అంజలి బరోట్ ఇతర కీలక పాత్రల్లో మెప్పించారు.

కేవలం ఒక క్రైమ్ డ్రామాగా మాత్రమే కాకుండా, నాటి ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను, మానవ నైజాలను విశ్లేషిస్తూ ఈ సిరీస్ సాగుతుంది. ప్రతీక్ గాంధీ నటన ఈ సిరీస్‌‌ను ఓటీటీ చరిత్రలోనే ఒక బెంచ్ మార్క్‌గా నిలిపింది. ఇది తెలుగులో కూడా ఓటీటీలో అందుబాటులో ఉంది.

రాకెట్ బాయ్స్ (Rocket Boys)

భారతదేశ అణు, అంతరిక్ష పరిశోధనల పితామహులైన డాక్టర్ హోమీ జే బాబా, డాక్టర్ విక్రమ్ సారాభాయ్‌ల జీవిత ప్రయాణం ఆధారంగా తెరకెక్కిన అద్భుతమైన సిరీస్ 'రాకెట్ బాయ్స్'. స్వతంత్ర భారతంలో అగ్రదేశాలకు సవాలు విసురుతూ మన దేశ శాస్త్ర సాంకేతిక రంగాన్ని వారు ఏ విధంగా నిర్మించారో ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారు. జేమ్స్ సార్బ్, ఇష్వాక్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌కు రెండు సీజన్లు వచ్చాయి.

దేశ అభివృద్ధి కోసం సైన్స్‌ను ఎలా ఉపయోగించాలనే విషయంలో బాబా, సారాభాయ్‌ల మధ్య ఉన్న భిన్న అభిప్రాయాలను, వారి మధ్య ఉన్న ఆప్యాయతను సమతుల్యంగా ఆవిష్కరించారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం యువకుడిగా ఉన్నప్పటి సన్నివేశాలు ప్రేక్షకాభిమానాన్ని పొందాయి. శాస్త్రవేత్తల వ్యక్తిగత జీవితాలు, దేశం కోసం వారు చేసిన త్యాగాలను లోతుగా విశ్లేషిస్తూ సాగే ఈ కథనం సోనీ లివ్‌లో తెలుగులో ఓటీటీ రిలీజ్ అయింది.

స్కామ్ 2003: ది తెల్గీ స్టోరీ (Scam 2003: The Telgi Story)

స్టాక్ మార్కెట్ స్కామ్ తర్వాత స్టాంప్ పేపర్ల కుంభకోణంతో దేశాన్ని కుదిపేసిన అబ్దుల్ కరీం తెల్గీ కథతో ఈ సిరీస్ వచ్చింది. రైళ్లలో పండ్లు విక్రయించే ఒక సాధారణ వ్యక్తి, నకిలీ స్టాంప్ పేపర్ల నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా విస్తరించి వేల కోట్లు ఎలా సంపాదించాడనేది ప్రధానాంశం. జర్నలిస్ట్ సంజయ్ సింగ్ రాసిన 'తెల్గీ స్కామ్: రిపోర్టర్స్ డైరీ' పుస్తకం ఆధారంగా దీనిని తెరకెక్కించారు.

గగన్ దేవ్ రియార్ ఈ ఓటీటీ సిరీస్‌లో తెల్గీ పాత్రలో జీవించారు. పాత్ర కోసం ఆయన శరీరాకృతిని మార్చుకున్న తీరు ప్రశంసలు అందుకుంది. రాజకీయ, అధికార యంత్రాంగంలోని లోపాలను వాడుకుంటూ తెల్గీ నిర్మించిన నెట్‌వర్క్, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తాయి. ఇది కూడా తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

అవరోధ్: ది సీజ్ విత్ఇన్ (Avrodh: The Siege Within)

2016లో భారత సైన్యం శత్రు మూకలపై జరిపిన 'ఉరి సర్జికల్ స్ట్రైక్స్' వెనుక ఉన్న అసలు వ్యూహాలను ఆవిష్కరించిన సిరీస్ ఇది. శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాసిన 'ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్' పుస్తకంలోని ఒక అధ్యాయం ఆధారంగా దీనిని రూపొందించారు. అమిత్ సాధ్, నీరజ్ కాబీ, దర్శన్ కుమార్, విక్రమ్ గోఖలే ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.

కమాండోలు సరిహద్దు దాటి ఆపరేషన్ చేయడం మాత్రమే కాకుండా, న్యూఢిల్లీలోని రక్షణ శాఖ, నిఘా వర్గాలు తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలు, పక్కా ప్రణాళికలను ఎంతో సమగ్రంగా చూపించారు. స్పెషల్ ఫోర్సెస్ కమాండర్ మేజర్ టాంగో పాత్రలో అమిత్ సాధ్ తన నటనతో ఆకట్టుకున్నారు. ఇది కూడా తెలుగులోనే ఉంది.

కాట్మండు కనెక్షన్ (Kathmandu Connection)

1993 బొంబాయి బాంబు పేలుళ్ల అనంతరం సాగిన సుదీర్ఘ దర్యాప్తు నేపథ్యంలో రూపొందిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఒక పోలీసు అధికారి హత్య, వ్యాపారవేత్త కిడ్నాప్, ఒక టీవీ యాంకర్ వేధింపులకు గురికావడం.. ఈ మూడు విభిన్న సంఘటనల వెనుక ఉన్న అసలు నెట్‌వర్క్ నేపాల్ రాజధాని కాట్మండుతో ఎలా ముడిపడి ఉందో పోలీసులు గుర్తిస్తారు.

డిజిటల్ సాంకేతికత, నిఘా కెమెరాలు లేని 90ల కాలంలో పోలీసులు కష్టపడి కేసులను ఎలా ఛేదించారో ఇందులో ఆసక్తికరంగా చూపించారు. అమిత్ సియాల్, గోపాల్ దత్ కీలక పాత్రల్లో నటించారు.

అన్నీ తెలుగులోనే

యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ ఐదు సిరీస్‌లు కేవలం వినోదాన్ని ఇవ్వడమే కాకుండా నాటి చారిత్రక పరిణామాలపై అవగాహనను కల్పిస్తాయి. అంతేకాకుండా సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్‌లన్నీ ఒకేదాంట్లో తెలుగులో అందుబాటులో ఉండటం చూసేందుకు బెస్ట్ ఆప్షన్ అను చెప్పుకోవచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More