RHTDM: మాధవన్ క్లాసిక్ మూవీకి 25 ఏళ్లు.. రోజుకు 18 గంటలు పని చేసిన రోజులు గుర్తు చేసుకున్న దియా.. మాధవన్ రియాక్షన్ ఇలా

RHTDM: 2001లో విడుదలైన ఐకానిక్ రొమాంటిక్ మూవీ 'రెహనా హై తేరే దిల్ మే' (RHTDM) నిన్నటితో విజయవంతంగా 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హీరోయిన్ దియా మీర్జా, హీరో ఆర్ మాధవన్ సోషల్ మీడియా వేదికగా అరుదైన బిహైండ్ ది సీన్స్ (BTS) వీడియోలు పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

Published on: Oct 20, 2026, 16:06:02 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

RHTDM: భారతీయ సినీ చరిత్రలో కొన్ని ప్రేమకథలు కాలంతో పనిలేకుండా ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. అందులోనూ 2000ల ప్రారంభంలో వచ్చిన 'రెహనా హై తేరే దిల్ మే' (Rehnaa Hai Terre Dil Mein) చిత్రానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

RHTDM: మాధవన్ క్లాసిక్ మూవీకి 25 ఏళ్లు.. రోజుకు 18 గంటలు పని చేసిన రోజులు గుర్తు చేసుకున్న దియా.. మాధవన్ రియాక్షన్ ఇలా
RHTDM: మాధవన్ క్లాసిక్ మూవీకి 25 ఏళ్లు.. రోజుకు 18 గంటలు పని చేసిన రోజులు గుర్తు చేసుకున్న దియా.. మాధవన్ రియాక్షన్ ఇలా

నిన్నటితో (అక్టోబర్ 19) ఈ లవ్ క్లాసిక్ మూవీ విడుదలటై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ప్రధాన పాత్రధారులు దియా మీర్జా (Dia Mirza), ఆర్ మాధవన్ (R Madhavan) సోషల్ మీడియాలో అత్యంత భావోద్వేగపూరితమైన పోస్టులు షేర్ చేశారు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించిన ఈ చిత్రం ద్వారానే దియా మీర్జా బాలీవుడ్ అరంగేట్రం చేయగా, మాధవన్‌కు హిందీలో హీరోగా గుర్తింపు లభించింది.

"19 ఏళ్ల వయసులో ఆ రోజులు ఓ మ్యాజిక్!" – దియా మీర్జా

తన తొలి చిత్రం 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నటి దియా మీర్జా అప్పటి వర్కింగ్ స్టిల్స్, సీన్ల బిహైండ్ ది సీన్స్ వీడియోను షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆమె రాసుకొస్తూ..

"అది అక్టోబర్ 2001.. అప్పట్లో పత్రికలు నన్ను 'దియా' అని, మ్యాడీని 'మాధవన్' అని రాసేవి. మున్ముందు ఏం జరగబోతుందో, ఎలాంటి పాపులారిటీ దక్కుతుందో మాకు అస్సలు తెలియదు. సరిగ్గా అప్పుడే మా ఇద్దరి ప్రయాణం మొదలైంది. రోజుకు 18 గంటల పాటు నిరంతర షూటింగ్, లెక్కలేనన్ని రీటేక్‌లు, నవ్వులు, అలసట.. కానీ ఇప్పుడు ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటే అదొక మ్యాజిక్‌లా అనిపిస్తుంది" అని పేర్కొన్నారు.

అలాగే.. "ఆ రోజుల్లో 19 ఏళ్ల వయసులో వర్షంలో డాన్స్ చేసిన ఆ అమ్మాయి.. 25 ఏళ్ల తర్వాత కూడా మీ నుంచి అందుతున్న ఈ ప్రేమకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది. నాటి పాటలు ఇప్పటికీ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి" అని దియా మీర్జా ఎమోషనల్ అయ్యారు.

"మాధవ్ శాస్త్రి నాలోనే జీవిస్తున్నాడు" – ఆర్ మాధవన్

ఈ సినిమాలో 'మ్యాడీ' అలియాస్ మాధవ్ శాస్త్రి పాత్రతో దేశవ్యాప్తంగా విపరీతమైన లేడీ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హీరో ఆర్ మాధవన్ కూడా అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

"ఈ సినిమా వచ్చి 25 ఏళ్లు అయిందంటే నేను నమ్మలేకపోతున్నాను. ఇప్పటికీ నాలో ఆ 'మాధవ్ శాస్త్రి' అలాగే జీవించి ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలుగా మాపై ప్రేక్షకులు కురిపిస్తున్న నిరంతర అభిమానానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను" అని మాధవన్ వ్యాఖ్యానించారు.

గౌతమ్ మీనన్ మ్యాజిక్.. ఆల్ టైమ్ చార్ట్‌బస్టర్ మ్యూజిక్

తమిళంలో మాధవన్, షాలిని జంటగా వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ 'మిన్నలే'కు రీమేక్‌గా ఈ చిత్రాన్ని గౌతమ్ వాసుదేవ్ మీనన్ హిందీలో తెరకెక్కించారు. ఈ సినిమాతోనే దియా మీర్జా నటిగా పరిచయం కాగా, మాధవన్‌కు హిందీలో మొదటి సినిమాగా నిలిచింది. ఇందులో మరో కీలక పాత్రలో సైఫ్ అలీ ఖాన్, మాధవన్ తండ్రిగా అనుపమ్ ఖేర్ అద్భుతంగా నటించారు.

ముఖ్యంగా హారిస్ జయరాజ్ అందించిన స్వరాలు ఈ సినిమాను మ్యూజికల్ హిట్ గా నిలబెట్టాయి. "జరా జరా", "దిల్ కో తుమ్సే ప్యార్ హువా" వంటి గీతాలు రెండు దశాబ్దాలు దాటినా ఇప్పటికీ కుర్రకారు ప్లేలిస్ట్‌లలో మారుమోగుతూనే ఉన్నాయి. యూత్ కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన 'రెహనా హై తేరే దిల్ మే' 25 ఏళ్ల మైలురాయిని చేరుకోవడంపై సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More