Namita Thapar Namaz: నమాజ్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు, నీచ పదజాలంతో దూషణ- హిందువుగా గర్వపడుతున్నానన్న షో జడ్జ్ నమితా థాపర్

Namita Thapar Slams On Namaz Health Benefits Trolling: నమాజ్ వల్ల కలిగి హెల్త్ బెన్‌ఫిట్స్‌ గురించి ఓ వీడియో చేసి పోస్ట్ చేశారు షార్క్ ట్యాంక్ ఇండియా షో జడ్జ్ నమితా థాపర్. ఇది వైరల్ కావడంతో నమితాపై ఓ వర్గం విపరీతమైన వ్యక్తిగత దూషణకు దిగింది. తాజాగా ఈ ట్రోలింగ్‌పై గట్టిగా కౌంటర్ ఇచ్చారు నమితా థాపర్.

Published on: Apr 20, 2026, 12:46:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Namita Thapar Slams On Namaz Health Benefits Trolling: నమాజ్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై వీడియో పోస్ట్ చేసినందుకు తనను, తన తల్లిని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఎమ్‌క్యూర్‌ ఫార్మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, షార్క్ ట్యాంక్ ఇండియా షో జడ్జి నమితా థాపర్ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా నమితా థాపర్ మౌనం వీడి ట్రోలర్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు.

నమాజ్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు, నీచ పదజాలంతో దూషణ- హిందువుగా గర్వపడుతున్నానన్న షో జడ్జ్ నమితా థాపర్
నమాజ్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు, నీచ పదజాలంతో దూషణ- హిందువుగా గర్వపడుతున్నానన్న షో జడ్జ్ నమితా థాపర్

వివాదం నేపథ్యం ఏంటి?

గత మార్చి నెలలో నమితా థాపర్ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేశారు. అందులో నమాజ్ చేయడం వల్ల శరీరానికి కలిగే శారీరక, మానసిక ప్రయోజనాలను ఆమె వివరించారు. నమాజ్ ఒక పూర్తి స్థాయి బాడీ ఎక్సర్‌సైజ్ అని, ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడమే కాకుండా.. మానసిక ప్రశాంతతను ఇస్తుందని పేర్కొన్నారు.

ముఖ్యంగా నమాజ్‌లో భాగంగా వేసే వజ్రాసనం జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుందని నమితా థాపర్ శాస్త్రీయ కోణంలో విశ్లేషించారు. అయితే, ఒక వర్గం నెటిజన్లు దీనిని మతపరమైన అంశంగా చిత్రీకరిస్తూ ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

మూడు వారాలుగా వేధింపులు.. నమితా ఘాటు స్పందన

గత మూడు వారాలుగా సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దాడిని నమితా థాపర్ తీవ్రంగా ఖండించారు. ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా ఒక వీడియో విడుదల చేస్తూ తన ఆవేదనను పంచుకున్నారు.

"గత మూడు వారాలుగా నన్ను అత్యంత నీచమైన పదజాలంతో దూషిస్తున్నారు. నా తల్లిని కూడా వదలడం లేదు. నేను ఒక హెల్త్‌కేర్ ప్రొఫెషనల్‌ని. హిందూ ధర్మంలోని ఆచారాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై గతంలో నేను ఎన్నో వీడియోలు చేశాను. ప్రతి యోగా దినోత్సవం రోజున ఆసనాల గురించి, ముఖ్యంగా సూర్య నమస్కారాల గురించి వివరిస్తూ పోస్ట్‌లు పెడతాను. అప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పలేదు కదా?" అని నమితా థాపర్ ప్రశ్నించారు.

మతం అంటే గౌరవం అని తనకు నేర్పించారని.. కానీ, ఇప్పుడు మహిళలను ఇలా దూషించడమేనా మీరు నేర్చుకున్న గౌరవమా అని ఆమె మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి మాట్లాడే వారు, ఒక మహిళను ఇలా అవమానిస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని నమితా నిలదీశారు.

"హిందువుగా నేను గర్విస్తున్నా.. కర్మ మీ వెంటే ఉంటుంది"

ట్రోలర్లకు హెచ్చరికలు జారీ చేస్తూ నమితా థాపర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "నేను హిందువుగా గర్విస్తున్నాను. మన ధర్మంలో 'కర్మ' అనే సిద్ధాంతం ఉంది. మీరు చేసే పనులను దేవుడు చూస్తున్నాడని గుర్తుంచుకోండి. మీ ఇష్టం వచ్చినట్లు దూషించండి. కానీ, దానికి ఫలితం అనుభవించక తప్పదు" అని నమితా థాపర్ హెచ్చరించారు.

తప్పుడు ప్రచారాలు, నెగెటివ్ వీడియోలు త్వరగా వైరల్ అవుతాయని.. మతం అంటే గౌరవం అని నమ్మే విద్యావంతులైన భారతీయులు తన తాజా వీడియోను వైరల్ చేయాలని నమితా కోరారు. తనపై జరుగుతున్న వ్యక్తిగత దాడులను ఐదేళ్లుగా భరిస్తున్నానని, కానీ ఇప్పుడు మౌనంగా ఉండటం సరికాదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రాథమిక మానవ హక్కులకు భంగం కలిగినప్పుడు ప్రతి భారతీయుడు గళం విప్పాలని పిలుపునిస్తూ 'జై హింద్' అంటూ తన సందేశాన్ని ముగించారు నమితా థాపర్.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. నమితా థాపర్ నమాజ్ గురించి ఏమని చెప్పారు?

నమాజ్ చేయడం వల్ల శరీరంలో వొంగుబాటు (Flexibility) పెరుగుతుందని, కీళ్ల ఆరోగ్యానికి, రక్త ప్రసరణకు ఇది ఎంతో మేలు చేస్తుందని ఆమె వివరించారు. ఇది ఒక ధ్యానం లాంటిదని ఆమె పేర్కొన్నారు.

2. నమితా థాపర్ కేవలం నమాజ్ గురించే వీడియోలు చేస్తారా?

లేదు. ఆమె ఒక ఆరోగ్య నిపుణురాలిగా యోగా, సూర్య నమస్కారాలు, హిందూ సంప్రదాయాల్లోని ఆరోగ్య సూత్రాలపై కూడా తరచుగా వీడియోలు రూపొందిస్తుంటారు.

3. ట్రోలర్లకు నమితా ఇచ్చిన సమాధానం ఏమిటి?

మతం అంటే ఇతరులను గౌరవించడమని, తనను దూషించే వారు 'కర్మ' సిద్ధాంతాన్ని గుర్తుంచుకోవాలని ఆమె హెచ్చరించారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More