రాజమౌళి లాంచ్ చేసిన శ్రీ విష్ణు క్రైమ్ థ్రిల్లర్ మూవీ టీజర్.. సుకుమార్ శిష్యుడే డైరెక్టర్.. గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేషన్
శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ 'మృత్యుంజయ'. సుకుమార్ శిష్యుడు హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్‌ను దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి విడుదల చేశాడు. ఫిబ్రవరి 27న విడుదల కానున్న ఈ సినిమా విశేషాలు, టీజర్ హైలైట్స్ ఇక్కడ చూడండి.
టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ శ్రీ విష్ణు ఎప్పుడూ వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు. ఇప్పుడు అతడు మరో ఆసక్తికరమైన మూవీతో మన ముందుకు రాబోతున్నాడు. అదే 'మృత్యుంజయ' (Mrithyunjay). ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడైన హుస్సేన్ షా కిరణ్ (Hussain Sha Kiran) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ థియేటర్లలో సందడి చేయడానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

రాజమౌళి ప్రశంసలు.. టీజర్ అదిరింది!
బుధవారం (ఫిబ్రవరి 11) మృత్యుంజయ మూవీ టీమ్ సినిమా టీజర్‌ను విడుదల చేసింది. విశేషమేమిటంటే.. భారతీయ సినిమా గర్వించదగ్గ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తన 'ఎక్స్' అకౌంట్ ద్వారా ఈ టీజర్‌ను లాంచ్ చేశాడు. అంతేకాకుండా టీజర్ చాలా బాగుందంటూ టీమ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. జక్కన్న సపోర్ట్ దొరకడంతో ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
ఒక మనిషి తనలో మూడు విషయాలను మార్చుకోలేడు.. ఒకటి హైట్.. రెండోది చూసే చూపు.. మూడోది అంటూ శ్రీవిష్ణు వాయిస్ తో టీజర్ మొదలైంది. నిమిషంలోపే ఉన్నా చాలా ఉత్కంఠగా సాగింది.
మృత్యుంజయ మూవీ కథేంటంటే..
టీజర్ చూస్తుంటే ఇదొక గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా అనిపిస్తోంది. అద్భుతమైన విజువల్స్‌తో కట్ చేసిన ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కథ విషయానికి వస్తే.. ఒక నేరం జరుగుతుంది. అది చూసిన అందరూ దాన్ని కేవలం ప్రమాదం అని నమ్ముతారు. కానీ హీరో శ్రీ విష్ణు మాత్రం అది కచ్చితంగా హత్యే అని బలంగా వాదిస్తాడు.
అసలు ఆ నేరానికి, హీరోకి ఉన్న సంబంధం ఏంటి? అందరూ ప్రమాదం అని అంటుంటే, హీరో దాన్ని హత్య అని ఎలా నిరూపిస్తాడు? ఈ మిస్టరీ వెనుక ఉన్న అసలు దోషులు ఎవరు? అనే ఉత్కంఠభరితమైన అంశాలతో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఈ ప్రశ్నలన్నింటికీ ఫిబ్రవరి 27న వెండితెరపై సమాధానం దొరకనుంది.
కామెడీ నుంచి సీరియస్ మోడ్‌లోకి..
గత కొంతకాలంగా శ్రీ విష్ణు ఎక్కువగా కామెడీ డ్రామాలు, ఎంటర్టైనింగ్ పాత్రలే చేస్తున్నాడు. కానీ చాలా రోజుల తర్వాత అతడు పూర్తిస్థాయి సీరియస్ క్రైమ్ థ్రిల్లర్‌లో నటిస్తుండటం విశేషం. ఈ మార్పు ప్రేక్షకులకు కచ్చితంగా కొత్త అనుభూతిని ఇస్తుంది.
ఈ సినిమాలో రెబా మోనికా జాన్ కీలక పాత్రలో నటిస్తోంది. లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. 'ఆర్ఆర్ఆర్', 'కార్తికేయ 2' ఫేమ్ కాల భైరవ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్‌లో హైలైట్‌గా నిలిచింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


