హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.
Suriya Movies 2026: సూర్యనే థియేటర్లను బతికించాడు..ఆ 3 సినిమాలతోనే 785 కోట్లు.. మిగతా హీరోలు ఏం చేస్తున్నారు: ఎగ్జిబిటర్
Suriya Movies 2026: ఈ ఏడాది తమిళ ఇండస్ట్రీతో పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లను కాపాడింది సూర్య నటించిన మూడు సినిమాలేనని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ తిరుప్పూర్ సుబ్రమణ్యం ప్రశంసించారు. కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్, సీన్ మూవీస్ ఏకంగా రూ.785.85 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించాయని ఆయన పేర్కొన్నారు.
Suriya Movies 2026: తమిళ సినిమా ఇండస్ట్రీ బాక్సాఫీస్ లెక్కలు, సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడపై ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ తిరుప్పూర్ సుబ్రమణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026 సంవత్సరంలో కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కేవలం నాలుగైదు సినిమాలు మాత్రమే థియేటర్లను బతికించాయని, అందులో సింహభాగం ఘనత స్టార్ హీరో సూర్యకే దక్కుతుందని ఆయన కొనియాడారు.

ఇటీవల 'శ్రీ శక్తి సినిమాస్' యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. సూర్య వరుస సినిమాలతో థియేటర్లకు జీవం పోస్తుంటే, మిగతా తమిళ హీరోలు మాత్రం ఏడాదికి ఒక సినిమా కూడా చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
సూర్య 3 సినిమాలతోనే థియేటర్లకు ప్రాణం.. రూ.785 కోట్ల విధ్వంసం
ఈ ఏడాది 'మొద రాత్రి' (Modha Rathiri) వంటి చిన్న సినిమాలు బాగా ఆడినప్పటికీ, సింగిల్ స్క్రీన్ థియేటర్లు మనుగడ సాగించాలంటే పెద్ద హీరోల సినిమాలే కీలకమని తిరుప్పూర్ సుబ్రమణ్యం స్పష్టం చేశారు.
2026లో సూర్య నటించిన 'కరుప్పు' (Karuppu), 'విశ్వనాథ్ అండ్ సన్స్' (Vishwanath & Sons), 'సీన్' (Scene) చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాయి. ఈ మూడు సినిమాల ద్వారా సూర్య ఈ ఏడాది ఏకంగా రూ.785.85 కోట్ల గ్రాస్ వసూళ్లను అందించి పరిశ్రమను నిలబెట్టారని సుబ్రమణ్యం తెలిపారు.
సూర్య సినిమాలతో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్ 2’, దళపతి విజయ్ 'జన నాయగన్' చిత్రాలు జనవరి నుంచి థియేటర్లకు పూర్వవైభవం తెచ్చాయని అన్నారు. కనీసం నెలకు ఒక స్టార్ హీరో సినిమా విడుదలైతేనే సింగిల్ స్క్రీన్లను కాపాడుకోగలమని ఆయన అభిప్రాయపడ్డారు.
"మిగిలిన రోజుల్లో రామాయణ, మహాభారతాలు చదువుతున్నారా?" – హీరోలపై ఫైర్!
సినిమాల విడుదలలో తీవ్ర జాప్యం చేస్తున్న పలువురు తమిళ హీరోల పేర్లను ప్రస్తావిస్తూ తిరుప్పూర్ సుబ్రమణ్యం ఘాటు విమర్శలు చేశారు. “రెండేళ్లకు ఒక సినిమా చేస్తే థియేటర్లు నడవవు. ఉదాహరణకు సూరినే తీసుకోండి.. 'మండాడి' (Mandaadi) విడుదలై మూడు నెలలైనా ఇంకా తన తదుపరి సినిమా షూటింగ్ ప్రారంభించలేదు. శివకార్తికేయన్ ఏడాదిన్నరకు ఒక సినిమా చేస్తున్నారు. ధనుష్, శింబు, విక్రమ్.. వీరంతా ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేస్తున్నారు. ఒక హీరో స్వయంగా షూటింగ్లో పాల్గొనడానికి పట్టే సమయం కేవలం 50 నుంచి 70 రోజులు మాత్రమే. మరి సంవత్సరంలోని మిగిలిన రోజుల్లో వాళ్లంతా ఇంట్లో కూర్చుని రామాయణ, మహాభారతాలు చదువుతున్నారా?” అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు.
2026లో కోలీవుడ్ టాప్-10 చిత్రాలు, కలెక్షన్ల జోరు
కమర్షియల్ విజయాలతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలతో 2026 కోలీవుడ్‌కు కలిసొచ్చింది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా రూ.836.18 కోట్ల వసూళ్లతో రజనీకాంత్ ‘జైలర్ 2’ అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా అగ్రస్థానంలో నిలవగా, సూర్య సినిమాలు రూ.785.85 కోట్లతో సత్తా చాటాయి.
వీటితో పాటు విజయ్ 'జన నాయగన్', సూరి 'మండాడి', లోకేష్ కనగరాజ్ 'డీసీ' (DC), ధనుష్ 'ఓఎం: ఆపరేషన్ మోల్' (OM: Operation Mole) చిత్రాలు 2026 టాప్-10 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. మరోవైపు రిషికాంత్ నటించిన 'మొద రాత్రి', సనత్తో కలిసి చేసిన ‘డోరతీ’, విజయ్ సేతుపతి ‘బత్తా’ విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. సూర్యను ఆదర్శంగా తీసుకుని మిగతా స్టార్ హీరోలు కూడా వేగంగా సినిమాలు పూర్తి చేస్తేనే తమిళ సినీ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుందని ఎగ్జిబిటర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

E-Paper
