Sign in

Karuppu: అప్పుడు కారులో కూర్చొని ఏడ్చి.. ఇప్పుడు కాలర్ ఎగరేస్తున్నాడు.. డైరెక్టర్ వల్ల సగం మునిగాను: కరుప్పు ఫైనాన్షియర్

Karuppu: సూర్య లేటెస్ట్ హిట్ 'కరుప్పు' (Karuppu) బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధించినా, రిలీజ్ ముందటి ఆర్థిక వివాదాలు కోలీవుడ్‌లో వేడి పుట్టిస్తున్నాయి. సినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తం డైరెక్టర్ ఆర్జే బాలాజీ ఖాతాలో వేసుకోవడంపై ఫైనాన్సియర్, డిస్ట్రిబ్యూటర్ తిరుప్పూర్ సుబ్రమణియన్ మండిపడ్డారు.

Published on: Jun 12, 2026, 16:51:11 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karuppu: తమిళ స్టార్ హీరో సూర్య, త్రిష కాంబోలో వచ్చిన లేటెస్ట్ ఫాంటసీ యాక్షన్ డ్రామా 'కరుప్పు' థియేటర్లలో భారీ విజయాన్ని నమోదు చేసింది. విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ దగ్గర రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి, 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా రికార్డు సృష్టించింది.

Karuppu: అప్పుడు కారులో కూర్చొని ఏడ్చి.. ఇప్పుడు కాలర్ ఎగరేస్తున్నాడు.. డైరెక్టర్ వల్ల సగం మునిగాను: కరుప్పు ఫైనాన్షియర్
Karuppu: అప్పుడు కారులో కూర్చొని ఏడ్చి.. ఇప్పుడు కాలర్ ఎగరేస్తున్నాడు.. డైరెక్టర్ వల్ల సగం మునిగాను: కరుప్పు ఫైనాన్షియర్

అయితే ఈ సినిమా వెండితెరపైకి రావడానికి ముందు వెనుక ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, వివాదాలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల టైమ్ లో తలెత్తిన సమస్యలపై కోలీవుడ్ సీనియర్ ఫిల్మ్ ఫైనాన్సియర్, డిస్ట్రిబ్యూటర్ తిరుప్పూర్ సుబ్రమణియన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. సినిమా హిట్ అవ్వగానే కాలర్ ఎగరేస్తున్న డైరెక్టర్ ఆర్జే బాలాజీ (RJ Balaji) తీరును ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.

"కార్లో కూర్చుని ఏడవడం కాదు".. సమస్యను ఎదుర్కోవాలి!

ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తిరుప్పూర్ సుబ్రమణియన్ మాట్లాడుతూ.. కరుప్పు సినిమా రిలీజ్‌కు రెండు రోజుల ముందు పడిన కష్టాలు తమకు మాత్రమే తెలుసని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ పరిమితులు దాటిపోవడం వల్ల నిర్మాతలు, ఫైనాన్సియర్లు ఎంతటి మానసిక ఒత్తిడికి లోనవుతారో డైరెక్టర్లు అర్థం చేసుకోవడం లేదని మండిపడ్డారు.

"కరుప్పు సినిమా విడుదలకు రెండు రోజుల ముందు మేము ఎలాంటి నరకం చూశామో మాకు తెలుసు. ఒక దర్శకుడిగా బాలాజీ మా పక్కన నిలబడి సమస్యను ఎదుర్కోవాల్సింది. కానీ ఆయన కారులోకి వెళ్లి, ఏడుస్తూ వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడు సినిమా హిట్ అవ్వగానే కాలర్ ఎగరేస్తూ తిరుగుతున్నారు. కానీ ఆ కష్ట సమయంలో సినిమాను థియేటర్ల వరకు తీసుకురావడానికి హీరో సూర్య మాత్రమే ముందుకు వచ్చారు. ఆయన తప్ప మరెవరూ ఆ ఆర్థిక సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించలేదు" అని సుబ్రమణియన్ ఓపెన్ గా విమర్శించారు.

Budget Overrun | బడ్జెట్ పెంచేసి ఫైనాన్సియర్లను ముంచేస్తారా?

సినిమా బడ్జెట్‌ను ఇష్టానుసారంగా పెంచేయడం వల్ల పరిశ్రమలో ఫైనాన్సియర్లు ఏ విధంగా నష్టపోతారో ఆయన వివరించారు. మొదట అనుకున్న బడ్జెట్ కంటే రెట్టింపు ఖర్చు చేయడం వల్ల ఫైనాన్సింగ్ వ్యవస్థ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సినిమా కోసం తాను పెట్టిన పెట్టుబడిలో ఇప్పటివరకు కేవలం యాభై శాతం మాత్రమే తిరిగి రికవరీ అయిందని ఆయన స్పష్టం చేశారు. మొదట రూ. 30 నుండి 40 కోట్ల బడ్జెట్ అని చెప్పి, ఏకంగా రూ. 80 కోట్లకు బడ్జెట్ దాటేస్తే ఎలా తట్టుకుంటారని ఆయన ప్రశ్నించారు. ఈ బడ్జెట్ రచ్చ వల్లే 2025 దీపావళికి రావాల్సిన సినిమా ఎనిమిది నెలలు ఆలస్యంగా వచ్చింది.

KDM Code Issue | చివరి నిమిషంలో క్యాన్సిల్ అయిన షోలు

'కరుప్పు' సినిమా మే 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఈ సినిమాకు ఉదయం 9 గంటల స్పెషల్ షోలకు కూడా పర్మిషన్ ఇచ్చారు. అయితే పాత బాకీల సెటిల్మెంట్ కాకపోవడంతో చివరి నిమిషంలో రాష్ట్రవ్యాప్తంగా మార్నింగ్ షోలు రద్దయ్యాయి. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ గతంలో చెల్లించాల్సిన రూ. 10 కోట్ల బకాయిల వివాదమే దీనికి కారణమని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి.

తమిళ చిత్ర పరిశ్రమలో పాత బాకీలు పూర్తిగా చెల్లించే వరకు డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ల స్క్రీనింగ్‌కు అవసరమైన 'కీ డెలివరీ మెసేజ్' (KDM) డిజిటల్ కోడ్‌ను నిలిపివేస్తారు. నిర్మాత ఈ మొత్తాన్ని సకాలంలో చెల్లించకపోవడంతో షోలు రద్దయ్యాయి. ఆ సమయంలోనే డైరెక్టర్ ఆర్జే బాలాజీ కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక వీడియోను షేర్ చేశారు. ఎట్టకేలకు అన్ని సమస్యలు తొలిగి మే 15న సినిమా థియేటర్లలోకి వచ్చింది.

సూర్య నటన, సాయి అభ్యంకర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను అలరించడంతో ఈ చిత్రం రూ. 300 కోట్ల క్లబ్‌లో చేరి భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

హెచ్‌టీ విశ్లేషణ

సినిమా హిట్ అయినంత మాత్రాన తెరవెనుక ఉన్న ఆర్థిక సంక్షోభాన్ని తక్కువ చేసి చూడలేం. ఒక దర్శకుడిగా సినిమాను టైమ్ కి, అనుకున్న బడ్జెట్ లో పూర్తి చేయడం కూడా వాళ్ల బాధ్యతే. బడ్జెట్ డబుల్ అయిపోయినప్పుడు ఫైనాన్సియర్లు పడే ఇబ్బందులను తిరుప్పూర్ సుబ్రమణియన్ చాలా క్లియర్ గా చెప్పారు.

సూర్య లాంటి స్టార్ హీరో స్వయంగా జోక్యం చేసుకొని సమస్యను సెటిల్ చేయడం వల్లే సినిమా బయటకు వచ్చింది. ఈ వివాదం కోలీవుడ్ లో బడ్జెట్ కంట్రోల్ పై సరికొత్త చర్చకు దారితీసేలా ఉంది.

People Also Ask (FAQs)

సూర్య నటించిన 'కరుప్పు' సినిమా బడ్జెట్ వివాదానికి కారణం ఏంటి?

సినిమా బడ్జెట్‌ను మొదట రూ. 30-40 కోట్లుగా అనుకున్నప్పటికీ, చివరకు అది రూ. 80 కోట్లకు చేరింది. ఈ బడ్జెట్ భారీగా పెరగడం వల్ల ఫైనాన్సియర్లు, నిర్మాతలు తీవ్ర నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

'కరుప్పు' సినిమా మే 14న విడుదల కావాల్సిన షోలు ఎందుకు రద్దయ్యాయి?

నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ గతంలో ఇవ్వాల్సిన రూ. 10 కోట్ల బాకీల సెటిల్మెంట్ కాకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ల స్క్రీనింగ్‌కు అవసరమైన కెడిఎమ్ (KDM) డిజిటల్ కోడ్‌ను నిలిపివేశారు. దీనివల్ల షోలు రద్దయ్యాయి.

డైరెక్టర్ ఆర్జే బాలాజీపై తిరుప్పూర్ సుబ్రమణియన్ ఎందుకు మండిపడ్డారు?

ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు సమస్యను పరిష్కరించకుండా కారులో కూర్చుని ఏడుస్తూ వీడియోలు తీశారని, ఇప్పుడు సినిమా హిట్ అవ్వగానే క్రెడిట్ అంతా తన ఖాతాలో వేసుకోవడం కరెక్ట్ కాదని బాలాజీపై సుబ్రమణియన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

'కరుప్పు' సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత వసూలు చేసింది?

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుని ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. 2026లో అత్యధిక వసూళ్లు రాబట్టిన తమిళ చిత్రంగా నిలిచింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More