Tamannaah: అలాంటి వాళ్లను పట్టించుకుంటే జీవితంలో ముందుకు సాగలేం: నటుడి కామెంట్స్‌కు తమన్నా కౌంటర్
Tamannaah: బాలీవుడ్ సీనియర్ నటుడు అన్ను కపూర్ తన శరీరాకృతి, శరీర రంగుపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తొలిసారిగా స్పందించారు. 'ఎన్డీటీవీ ప్రాఫిట్ ఇగ్నైట్' వేదికగా మాట్లాడిన తమన్నా.. అలాంటి విమర్శలను తాను అస్సలు పట్టించుకోనని స్పష్టం చేశారు.
Tamannaah: తెలుగుతోపాటు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ దాదాపు రెండు దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్‌గా అలరిస్తున్న నటి తమన్నా భాటియా. తన అద్భుతమైన నటన, గ్లామర్, డ్యాన్స్ లతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ మిల్కీ బ్యూటీ ఆ మధ్య 'స్త్రీ 2' చిత్రంలోని 'ఆజ్ కీ రాత్' (Aaj Ki Raat) స్పెషల్ సాంగ్‌తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

ఫిల్టర్ చేయడం నేర్చుకోవాలి: తమన్నా
అయితే గత ఏడాది బాలీవుడ్ సీనియర్ నటుడు అన్ను కపూర్ (Annu Kapoor) ఒక పాడ్‌కాస్ట్‌లో తమన్నా శరీర రంగు, ఆకృతిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆ వ్యాఖ్యలు మహిళలను హేళన చేసేలా ఉన్నాయంటూ నెటిజన్లు తీవ్రంగా ఖండించారు. తాజాగా జరిగిన 'ఎన్డీటీవీ ప్రాఫిట్ ఇగ్నైట్' (NDTV Profit Ignite) సమ్మిట్‌లో పాల్గొన్న తమన్నా.. అన్ను కపూర్ వ్యాఖ్యలపై ఎట్టకేలకు నోరు విప్పి అత్యంత పరిణతితో కూడిన సమాధానమిచ్చారు.
మహిళలపై వస్తున్న ప్రతికూల వ్యాఖ్యలను ఫిల్టర్ చేయడం నేర్చుకోకపోతే జీవితంలో ముందుకు వెళ్లలేమని స్పష్టం చేసిన తమన్నా.. అన్ను కపూర్ వ్యాఖ్యలకు ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఇంటర్వ్యూలో హోస్ట్.. అన్ను కపూర్ చేసిన వివాదాస్పద కామెంట్ల గురించి ప్రశ్నించగా.. తమన్నా నవ్వుతూ స్పందించారు. "క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉన్న వ్యక్తులుగా మనకున్న అతిపెద్ద బాధ్యత ఇతరుల మాటలను వినడం. అయితే మనం వినే విషయాల్లో ఏవి ఉంచుకోవాలి? ఏవి ఫిల్టర్ చేసి బయటకు పారేయాలి? అనేది చాలా ముఖ్యం. ఒక మహిళగా ఆలోచిస్తే.. మనం ఇలాంటి అనవసరమైన వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఇస్తూ కూర్చుంటే, జీవితంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం" అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
నటనే సేవగా భావిస్తా
తమ ప్రయాణం గురించి మరింత వివరిస్తూ.. "నేను ఇలాంటి నెగెటివ్ వ్యాఖ్యలను అస్సలు చూడను, పట్టించుకోను. నా దృష్టి ఎప్పుడూ నా నటన, నా సినిమాలు, నేను నిర్మించాలనుకునే కెరీర్‌పైనే ఉంటుంది. నిజం చెప్పాలంటే నటనను నేను ఒక సేవగా భావించి మనస్ఫూర్తిగా చేస్తాను. బహుశా ఆ ఆలోచన సరైన స్థానం నుంచి వస్తుంది కాబట్టే నా పని ప్రేక్షకులకు అంతగా చేరువవుతోంది" అని తమన్నా స్పష్టం చేశారు.
అసలు అన్ను కపూర్ ఏమన్నారంటే?
గత ఏడాది ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అన్ను కపూర్‌ను హోస్ట్ 'ఆజ్ కీ రాత్' పాట గురించి, అందులోని తమన్నా గ్లామర్ గురించి అడిగారు. దానికి అన్ను కపూర్ స్పందిస్తూ.. "దేవుడా.. ఆమెది ఎంత తెల్లటి పాలలాంటి శరీరమో.. ఆమె తన పాటతో, తమ పాలలాంటి ముఖంతో మన పిల్లలను నిద్రపుచ్చుతున్నారు. అది చాలా మంచి విషయం.. మన దేశ పిల్లలు ప్రశాంతంగా నిద్రపోవడం దేశానికి ఎంతో మంచిది" అంటూ అసభ్యకరమైన శైలిలో వ్యాఖ్యానించారు. ఆ సమయంలో ఈ కామెంట్లు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీశాయి.
తమన్నా చేతిలో క్రేజీ ప్రాజెక్ట్‌లు
ఇటీవల సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి 'వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్' (Vvaan: Force of the Forest) చిత్రంలో అలరించిన తమన్నా.. ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. బాలాజీ మోషన్ పిక్చర్స్ నిర్మిస్తున్న మోస్ట్ అవేటెడ్ హారర్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ 'రాగిణి ఎమ్ఎమ్ఎస్ 3' (Ragini MMS 3)లో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ (Junaid Khan) కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అడ్డంకులను, నెగెటివిటీని పక్కనపెట్టి తన పనితోనే సవాలు విసురుతున్న తమన్నా వైఖరిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


