Tamil Thriller: దృశ్యం సినిమాలను మించిన సస్పెన్స్ థ్రిల్లర్.. 9 రేటింగ్.. క్లైమ్యాక్స్ మరో లెవెల్.. ఓటీటీలోకి ఎప్పుడంటే?

Tamil Thriller: సస్పెన్స్, సైకో థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు తమిళ చిత్రం 'జాన్ డో' (John Doe) ఒక అద్భుతమైన థ్రిల్‌ను అందిస్తోంది. ఐఎండీబీ (IMDb)లో ఈ చిత్రానికి ఏకంగా 9.0 రేటింగ్ లభించడం విశేషం. 17 మంది పిల్లల హత్య వెనుక మిస్టరీ చుట్టూ తిరిగే ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో తెలుసుకోండి.

Published on: Nov 24, 2026, 14:43:55 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Tamil Thriller: ఇండియన్ సినిమాలో సైకో థ్రిల్లర్, సస్పెన్స్ జానర్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే చిత్రాలు ‘రాక్షసన్’, ‘దృశ్యం’. అయితే కథనంలోని ఉత్కంఠ, ఊహకందని మలుపుల విషయంలో ఆ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా తెరకెక్కిన మరో తమిళ సైకో థ్రిల్లర్ 'జాన్ డో' (John Doe) ఇప్పుడు సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Tamil Thriller: దృశ్యం సినిమాలను మించిన సస్పెన్స్ థ్రిల్లర్.. 9 రేటింగ్.. క్లైమ్యాక్స్ మరో లెవెల్.. ఓటీటీలోకి ఎప్పుడంటే?
Tamil Thriller: దృశ్యం సినిమాలను మించిన సస్పెన్స్ థ్రిల్లర్.. 9 రేటింగ్.. క్లైమ్యాక్స్ మరో లెవెల్.. ఓటీటీలోకి ఎప్పుడంటే?

ఐఎండీబీ (IMDb)లో ఏకంగా 9.0 రేటింగ్ సొంతం చేసుకున్న ఈ చిత్రం, చిన్నారుల మిస్సింగ్ కేసుల వెనుక దాగి ఉన్న ఒక భయానక మానసిక రుగ్మతను కళ్లకు కడుతుంది. నవంబర్ 13న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లోకి రానుంది. అయితే ఓటీటీ రిలీజ్ డేట్ పై ఇప్పటి వరకూ అధికారిక సమాచారం లేకపోయినా.. డిసెంబర్ రెండో వారంలో అడుగుపెట్టే అవకాశం ఉంది.

డ్యూటీలో మొదటి రోజే విషాదం.. సబ్-ఇన్‌స్పెక్టర్ చంద్రు పంతం

ఈ జాన్ డో సినిమా కథ సబ్-ఇన్‌స్పెక్టర్ చంద్రు చుట్టూ తిరుగుతుంది. ఉద్యోగంలో చేరిన మొదటి రోజే చంద్రు విధి నిర్వహణలో ఒక మహిళతో మాట్లాడుతూ ఉండగా, అతని కళ్ల ముందు నుంచే ఒక కారు వేగంగా వెళ్తుంది. అది సాధారణ ప్రైవేట్ కారు అనుకుని చంద్రు దానిని ఆపకుండా వదిలేస్తాడు.

కానీ క్షణాల్లోనే ఆ కారు సమీపంలోని ఒక సరస్సులో పడి మునిగిపోతుంది. చంద్రు వెంటనే నీటిలోకి దూకి కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ, ఆ కారులో ఉన్న 8 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోతాడు. చిన్నతనంలో తండ్రి ప్రేమకు దూరమై, అవమానాలతో పెరిగిన చంద్రుకు తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాలనే కసి ఉంటుంది. తన కళ్లముందే జరిగిన ఆ బాలుడి మరణం అతనిని తీవ్రంగా కలచివేస్తుంది.

మాయమైన బాలుడు.. మలుపు తిరిగిన దర్యాప్తు

ఇదే సమయంలో విదేశాల నుంచి తిరిగి వచ్చిన దర్శన అనే మహిళ కుమారుడు హృదయ్ అకస్మాత్తుగా కనిపించకుండా పోతాడు. చివరిసారిగా హృదయ్ తన సవతి సోదరి లక్కీతో కలిసి కనిపించడంతో, దర్శన తన కూతురిపైనే అనుమానపడుతుంది. కానీ లక్కీ నిరపరాధి అని తేలుతుంది.

మరోవైపు సరస్సులో చనిపోయిన బాలుడు తమ కుమారుడేనంటూ ఒక జంట ముందుకొచ్చి అంత్యక్రియలు నిర్వహిస్తుంది. అయితే విచారణలో ఒక షాకింగ్ నిజం బయటపడుతుంది. ఆ జంట అసలు కుమారుడు ఎప్పుడో చనిపోయాడని, ఆ విషాదాన్ని తట్టుకోలేకపోతున్న భార్యను ఓదార్చడానికి భర్త అనాథ శవానికి అంత్యక్రియలు చేయించాడని చంద్రు గుర్తిస్తాడు.

వెన్నులో వణుకు పుట్టించే క్లైమాక్స్

కథ అసలైన మలుపు అప్పుడే మొదలవుతుంది. సరస్సులో చనిపోయిన బాలుడి పోలికలు, దర్శన కొడుకు హృదయ్ పోలికలు ఒకేలా ఉండటంతో చంద్రు ఆ విషయాన్ని దర్శనకు చెబుతాడు. కానీ నెల రోజుల తర్వాత హృదయ్ సరస్సు ఒడ్డున క్షేమంగా దొరికి ఇంటికి తిరిగొచ్చాడని దర్శన చెప్పడంతో చంద్రు ఆశ్చర్యపోతాడు.

ఆ బాలుడిని పరీక్షించిన వైద్యులు, ఎవరో అతని గుర్తింపును మార్చే ప్రయత్నం చేశారని చెబుతారు. ఆ బాలుడు తన పేరు హృదయ్ కాదని, ‘గాబ్రియేల్’ అని చెబుతుంటాడు. ఆ పేరు వినగానే లక్కీకి తమ పక్కింట్లో ఉండే లత ఆంటీ కొడుకు గాబ్రియేల్ గుర్తొస్తాడు.

లక్కీ వెంటనే లత ఇంటికి వెళ్లి చూడగా, గోడపై ఉన్న గాబ్రియేల్ ఫోటో అచ్చం తన తమ్ముడు హృదయ్‌లాగే ఉండటం చూసి నిర్ఘాంతపోతుంది. ఇంతలో లత భర్త జోసెఫ్ అక్కడికి వచ్చి లక్కీకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి, ఆమెను ఒక గ్రే కలర్ కారులో బంధించి సరస్సులో ముంచి చంపడానికి తీసుకెళ్తాడు.

సరైన సమయానికి ఆధారాలు సేకరించిన చంద్రు, సరస్సు వద్దకు చేరుకుని లక్కీని కాపాడి జోసెఫ్‌ను అదుపులోకి తీసుకుంటాడు. విచారణలో జోసెఫ్ చెప్పిన నిజం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. జోసెఫ్, లతల అసలు కుమారుడు గాబ్రియేల్ కొన్నేళ్ల క్రితమే సరస్సులో మునిగి చనిపోయాడు. ఆ షాక్‌తో లత తనను తాను గాయపరుచుకోవడం మొదలుపెట్టింది.

భార్యను కాపాడుకోవాలనే పిచ్చితో జోసెఫ్, అచ్చం గాబ్రియేల్ పోలికలతో ఉన్న పిల్లలను కిడ్నాప్ చేసి, తమ కొడుకేనని లతకు నమ్మించేవాడు. ఎప్పుడైతే లతకు ఆ బాలుడు తమ కొడుకు కాదని అనుమానం వస్తుందో, వెంటనే జోసెఫ్ ఆ చిన్నారిని సరస్సులో ముంచి చంపేసేవాడు. అలా అతను ఏకంగా 17 మంది అమాయక చిన్నారులను బలితీసుకున్నట్లు బయటపడుతుంది. ఆద్యంతం ఊహకందని ట్విస్టులతో సాగే ఈ చిత్రం థ్రిల్లర్ ప్రియులకు ఒక మరపురాని అనుభూతిని ఇస్తుంది. ఈ సినిమాకు ఐఎండీబీలో 9 రేటింగ్ ఉండటంతో ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

ABOUT THE AUTHOR

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.