Teja Sajja Wedding: అవును పెళ్లి చేసుకోబోతున్నా.. అమ్మానాన్నలు చూసిన అమ్మాయి.. డెస్టినేషన్ వెడ్డింగే: తేజ సజ్జా
Teja Sajja Wedding: 'హనుమాన్' చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన యంగ్ హీరో తేజ సజ్జా త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నారు. తన వివాహ నిశ్చితార్థం నవంబర్‌లో, పెళ్లి వేడుక డిసెంబర్‌లో రాజస్థాన్‌లోని రాజసింహ నగరం ఉదయ్‌పూర్‌లో జరగనుందని స్వయంగా స్పష్టం చేశారు.
Teja Sajja Wedding: బాలనటుడిగా టాలీవుడ్ తెరపై తన ముద్దు ముద్దు మాటలతో మురిపించి, ఇప్పుడు 'హనుమాన్' చిత్రంతో పాన్ ఇండియా రేంజ్‌లో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాసిన యంగ్ హీరో తేజ సజ్జా త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఆయన పెళ్లికి సంబంధించి వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, తన వివాహ వార్తను స్వయంగా అధికారికంగా ధృవీకరించారు.

తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న తరుణంలో, అభిమానులకు, మీడియాకు తన పెళ్లి ముహూర్తం వివరాలను పంచుకున్నారు. పెద్దలు కుదిర్చిన ఈ పెళ్లిని అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రైవేట్ వేడుకగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
పెద్దలు కుదిర్చిన బంధం.. నవంబర్‌లో ఎంగేజ్‌మెంట్!
తన పెళ్లికి సంబంధించి వస్తున్న వార్తలపై స్పందించిన తేజ సజ్జా.. ఇది పూర్తిస్థాయిలో పెద్దలు కుదిర్చిన వివాహం (Arranged Marriage) అని స్పష్టం చేశారు. "ఈ వివాహాన్ని మా తల్లిదండ్రులు నిశ్చయించారు. పెద్దల సమక్షంలో కుదిరిన సంబంధం ఇది" అని ఆయన వెల్లడించారు.
అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ ఏడాది నవంబర్ నెలలో అత్యంత వైభవంగా నిశ్చితార్థ వేడుక (Engagement) జరగనుంది. ఆ తర్వాత డిసెంబర్‌లో పెళ్లి వేడుకలు జరగనున్నాయి. అయితే హడావుడి లేకుండా, ఆర్భాటాలకు దూరంగా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో మాత్రమే ఈ వేడుకలను నిర్వహించాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
రాజస్థాన్ సరస్సుల నగరం ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్
తేజ సజ్జా వివాహ మహోత్సవం రాజస్థాన్‌లోని రాయల్ సిటీ, సరస్సుల నగరంగా పేరుగాంచిన ఉదయ్‌పూర్ (Udaipur) లో జరగనుంది. రాజసానికి, ఐకానిక్ ప్యాలెస్‌లకు పుట్టినిల్లయిన ఉదయ్‌పూర్‌లోని ఒక ప్రముఖ ప్యాలెస్ వేదికగా గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ (Destination Wedding) ప్లాన్ చేస్తున్నారు. లైమ్‌లైట్, మీడియా హడావుడికి దూరంగా, ప్రశాంతమైన వాతావరణంలో తన వివాహ సంబరాలు జరగాలని కోరుకుంటున్నట్లు తేజ తెలిపారు.
పెళ్లికూతురు ఎవరంటే?
తేజ సజ్జా పెళ్లి చేసుకోబోతున్నాడంటే సహజంగానే అమ్మాయి ఎవరో అన్న కుతూహలం అందరిలోనూ ఉంటుంది. ఈ విషయాన్ని కూడా అతడు వెల్లడించాడు. అమ్మాయికి ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేదని, బిజినెస్ ఫ్యామిలీ అని, అమెరికాలో పెరిగిందని తేజ తెలిపాడు. అయితే ఆమె పేరును మాత్రం వెల్లడించలేదు.
బాక్సాఫీస్ 'సూపర్ హీరో' ప్రయాణం
కెరీర్ పరంగా తేజ సజ్జా ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత వేగంగా ఎదుగుతున్న యంగ్ స్టార్లలో ఒకరిగా నిలిచారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'హనుమాన్' (Hanu-Man) చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో భారీ విజయం సొంతం చేసుకున్న ఆయన, ఇటీవల 'మిరాయ్' (Mirai) సినిమాతో తన బాక్సాఫీస్ స్టామినాను మరోసారి నిరూపించుకున్నారు.
కేవలం వెండితెరపైనే కాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రతిష్టాత్మక షో 'ది ట్రైటర్స్' (The Traitors) తో పాటు, తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ సీక్వెల్ 'జాంబీ రెడ్డి NXT LVL' తోనూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఒకవైపు వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతూనే, మరోవైపు ఉదయ్‌పూర్ డెస్టినేషన్ వెడ్డింగ్‌తో కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న తేజ సజ్జాకు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


