Gaddar Film Awards : ఘనంగా గద్దర్ అవార్డ్స్ వేడుక.. చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం
Telangana Gaddar Film Awards 2025 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ సినీ పురస్కారాల వేడుకను ఘనంగా నిర్వహించింది. పలువురు సినీ తారలు ఈ వేడుకలో ఆకర్షణగా నిలించారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు.
తెలంగాణ కేంద్రంగా చలనచిత్ర పరిశ్రమల అభివృద్ధి చెందడానికి, సినిమాలకు సంబంధించి అవసరమైన అన్ని రకాల అనుమతుల కోసం సింగిల్ విండో విధానం అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఐటీ, ఫార్మా పరిశ్రమలకు కేంద్రంగా ఉన్నట్టుగానే హైదరాబాద్‌ను గ్లోబల్ సినీ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు.

హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహించిన తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల(TGFA) బహూకరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, పలువురు ఎంపీలు, సలహాదారులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, తెలంగాణ ఫిల్మ్ డెవల్మెంట్ చైర్మన్ దిల్ రాజు, చిత్ర పరిశ్రమకు చెందిన దిగ్గజాలు చిరంజీవి, కమల్ హాసన్, నాగార్జున, మాధురి దీక్షిత్, జయసుధ, ఖుష్బూ, జెనీలియాతో పాటు దర్శకులు, నిర్మాతలు, నటీనటులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. "ఐటీ, ఫార్మా తరహాలోనే సినిమా రంగాన్ని ఒక పరిశ్రమగా గుర్తించి పోత్సహించాలన్న ఆలోచన చేసిన కారణంగానే రాష్ట్రంలో గత పదేళ్లుగా ఆగిపోయిన నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరుతో అవార్డులను పునరుద్ధరించాం. ఆగిపోయిన 10 ఏళ్ల అవార్డులనూ బహూకరించాం. రెండో విడతగా నిర్వహించుకుంటున్న ఈ కార్యక్రమంలో అవార్డు గ్రహీతలందరికీ తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రత్యేక అభినందనలు. గద్దర్ సినిమా అవార్డులను ప్రధానం చేయడం తెలంగాణ ప్రభుత్వం ఒక బాధ్యతగా భావించింది.' అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
ఒకప్పుడు చెన్నై నుంచి హైదరాబాద్‌కు సినిమా పరిశ్రమ తరలిరావడానికి ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర రావు, రామానాయుడు, కృష్ణ తీవ్రమైన కృషి చేశారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. చార్మినార్‌కు నాలుగు మినార్లు ఎలాగో తెలుగు సినిమా పరిశ్రమ తరలి రావడానికి ఈ నలుగురు విశేషంగా కృషి చేశారని వివరించారు.
సినీ కార్మికుల కోసం నటుడు ప్రభాకర్ రెడ్డి తన సొంత స్థలాన్ని ఇళ్లు కట్టుకోవడానికి దానమిచ్చారన్నారు రేవంత్ రెడ్డి. పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా, సంక్షోభం వచ్చినా పరిష్కరించడానికి దర్శకుడు దాసరి నారాయణ రావు చేసిన కృషి గుర్తుచేసుకోవలసిన అవసరం ఉందన్నారు. రామోజీరావు.. రామోజీ ఫిల్మ్ సిటీ స్థాపించడంతో హైదరాబాద్‌లో సినిమా పరిశ్రమ శాశ్వతంగా వేళ్లూనుకోవడానికి కారణమైందన్నారు.
హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, తెలుగు అని కాకుండా పాన్ ఇండియా - భారతీయ సినిమా ఒక గ్లోబల్ హబ్‌గా పరిశ్రమ మొత్తం ఒకే గొడుగు కిందకు వచ్చి గొప్ప సినిమాలు అందించాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. హాలీవుడ్ సినిమాలను సైతం హైదరాబాద్ నగరానికి ఆహ్వానించి ఇక్కడి నుంచే నిర్మించేలా ఉన్నతంగా తీర్చిదిద్దుకుందామన్నారు.
'ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ హైదరాబాద్ తన కేంద్రాన్ని ప్రారంభించింది. నెట్‌ఫ్లిక్స్ రాకతో హైదరాబాద్‌కు హాలీవుడ్ వచ్చినట్టే. అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ సినిమాల నిర్మాణం కోసం సింగిల్ విండో విధానం అమలు చేస్తాం. అందుకు త్వరలోనే ఒక ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేస్తాం. లక్షల కోట్ల మందిని తన గళంతో ప్రజలను ప్రభావితం చేసిన ప్రజాయుద్ధ నౌక గద్దర్ ఒక చైతన్యం, స్ఫూర్తి, అందుకని గద్దర్ పేరుతో ఈ అవార్డులను పునరుద్ధరించాం. సామాజిక సమస్యలను పరిష్కరించుకోవడానికి సినిమాలు అత్యంత ప్రభావవంతమైన ఆయుధం.' అని రేవంత్ రెడ్డి చెప్పారు.
సమాజాన్ని చైతన్య పరిచేందుకు సినిమా ఒక సాధనంగా ఉపయోగపడాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సామాజిక బాధ్యతను గుర్తెరిగి, సామాజిక సమస్యల పరిష్కారానికి సినిమాల ద్వారా సందేశం అందించాలన్నారు. హైదరాబాద్, తెలంగాణ అత్యంత భద్రత కలిగిన రాష్ట్రమని, టాలెంట్‌కు అవకాశాలున్నాయన్నారు. హైదరాబాద్ అన్ని అవకాశాలను కల్పిస్తుందని చెప్పారు. హాలీవుడ్ చిత్రాలను ఇక్కడ నిర్మించాలని పిలుపునిచ్చారు. మీ పెట్టుబడులకు భద్రత ఉంటుందని, అందుకు తెలంగాణ ప్రభుత్వం హామీనిస్తుందన్నారు.
ఏ అవార్డులు ఎవరికి?
- ప్రత్యేక విభాగంలో కొణిదెల చిరంజీవి (ఎన్టీఆర్ జాతీయ పురస్కారం)
- సింగీతం శ్రీనివాస రావు (బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు)
- చలసాని అశ్వినీదత్ (నాగిరెడ్డి – చక్రపాణి అవార్డు)
- సుద్దాల అశోక్ తేజ (డాక్టర్ సి. నారాయణరెడ్డి అవార్డు)
- జయసుధ (అక్కినేని నాగేశ్వరరావు అవార్డు)
- ఆర్ నారాయణ మూర్తి (కాంతారావు అవార్డు)
- అక్కినేని రమేష్ ప్రసాద్ (రఘుపతి వెంకయ్య అవార్డు)
- కమల్ హాసన్ (పైడి జైరాజ్ అవార్డు)
- ఉత్తమ నటుడు నాగ చైతన్య (తండేల్)
- ఉత్తమ నటిగా రష్మిక (ది గర్ల్ ఫ్రెండ్)
వీటితోపాటుగా వివిధ కేటగిరీల్లో విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రం, నగదు బహుమతిని అందించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


