రేవంత్ రెడ్డి… తెలంగాణను చంద్రబాబుకు తాకట్టు పెట్టారా..? హరీశ్ రావ్ ప్రశ్నలు

తెలంగాణను చంద్రబాబుకు తాకట్టు పెట్టారా రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి హరీశ్ రావ్ ప్రశ్నించారు. కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నప్పటికీ… కాంగ్రెస్ సర్కార్ చోద్యం చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published on: Mar 16, 2026, 19:06:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు.

మాజీ మంత్రి హరీశ్ రావు
మాజీ మంత్రి హరీశ్ రావు

అసెంబ్లీ మీడియా హాల్‌లో శనివారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో హరీశ్ రావ్ మాట్లాడుతూ…. కాంగ్రెస్ మొద్దు నిద్రను వదిలించేందుకే బీఆర్ఎస్ పక్షాన పదేపదే నిలదీస్తున్నామని స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రంలో నీళ్ల విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు గత తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ నిరంతరం శ్రమించారని వివరించారు.

తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయి - హరీశ్ రావ్

గోదావరి నదిలో బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం తెలంగాణకు ఉన్న హక్కులను కేసీఆర్ శాశ్వతంగా కాపాడారని హరీశ్ రావ్ గుర్తు చేశారు. “గోదావరిలో ఉన్న 1400 టీఎంసీల నీటిలో 968 టీఎంసీలు తెలంగాణకు, 518 టీఎంసీలు ఏపీకి కేటాయించారు. మన 968 టీఎంసీల హక్కులను స్థిరపరచడానికి యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టులు కట్టి, 400 టీఎంసీల ప్రాజెక్టులకు అనుమతులు సాధించిన ఘనత కేసీఆర్ దే. ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ, ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వం కలిసి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయి. కృష్ణాలో నీటి దోపిడీ చేసిన ఏపీ.. ఇప్పుడు ఆదమరిచి నిద్రపోతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వ చేతకానితనాన్ని ఆసరాగా చేసుకుని గోదావరి జలాలపై పడింది” అని హరీశ్ రావ్ వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్ ప్రతిపక్షంగా నిలదీసిన ప్రతిసారీ ఉలిక్కిపడి లేచి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి లేఖలు రాస్తోందని హరీశ్ రావ్ చెప్పుకొచ్చారు. “బహుశా ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టి అడిగాను కాబట్టి, సాయంత్రానికి మళ్లీ ఏదైనా లేఖ రాసే డ్రామా ఆడుతుందేమో. జనవరి 30న ఢిల్లీలో రెండు రాష్ట్రాల ఇరిగేషన్ ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. ఆ మీటింగ్ ద్వారా తెలంగాణ నీటి హక్కులను హరించేందుకు ఏపీ పక్కా స్కెచ్ వేసింది. కేంద్రంలోని బీజేపీ అండ చూసుకుని గోదావరి నీళ్లను దోచుకునేందుకు టీడీపీ ప్లాన్ చేసింది. గోదావరిలో ఏ రాష్ట్రానికీ బచావత్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేయలేదని ఏపీ వాదించడం దుర్మార్గం” అని హరీశ్ రావ్ దుయ్యబట్టారు.

చంద్రబాబుకు తాకట్టు పెట్టారా…? హరీశ్ ప్రశ్నలు

“ఢిల్లీ మీటింగ్‌కు సంబంధించిన మినిట్స్ ఫిబ్రవరి 12నే రాష్ట్రానికి వచ్చాయి. ఈరోజు మార్చి 16. నెల రోజులు దాటిపోయినా అందులో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదు? రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రాన్ని చంద్రబాబుకు తాకట్టు పెట్టారా? లేక దాసోహం అయ్యారా? గోదావరి, బనకచర్ల అంశాలు ఎజెండాలో లేకపోతేనే ఢిల్లీ మీటింగ్‌కు వెళ్తామని ముందు చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం.. ఏపీ ప్రభుత్వం పోలవరం, నల్లమల్ల సాగర్ అంశాలను ఎజెండాలో పెట్టినా కూడా మోకాళ్ల మీద పరిగెత్తుకుంటూ వెళ్లి మీటింగ్‌లో కూర్చుంది. తెలంగాణకు ద్రోహం చేసిన ఆదిత్యనాథ్ దాస్‌ను చైర్మన్‌గా చేసి దొంగ చేతికే తాళాలు ఇచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మీటింగ్ మినిట్స్ పేజీ 3లో రాష్ట్రాల మధ్య గోదావరి జలాల కేటాయింపులు అసలు లేవని ఏపీ స్పష్టంగా చెప్పినట్లు ఉంది. దీనిపై ఇప్పటిదాకా ప్రభుత్వం స్పందించలేదంటే, తెలంగాణకు వాటా లేదని అంగీకరించినట్టే కాదా…?” అని హరీశ్ రావ్ ప్రశ్నించారు.

బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు చేయకపోతే గోదావరిపై పలు రాష్ట్రాలలో సెంట్రల్ వాటర్ కమిషన్ 76 ప్రాజెక్టులకు ఎలా అనుమతులు ఇచ్చిందని హరీశ్ రావ్ నిలదీశారు. ట్రిబ్యూనల్ అవార్డును ప్రశ్నించే హక్కు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఎక్కడిదన్నారు. ఏపీ సర్కార్ ట్రిబ్యునల్‌ను ధిక్కరించడం అంటే రాజ్యాంగాన్ని ధిక్కరించడమేనని… తెలంగాణ హక్కులను కాలరాయడమేనని కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే సీతారామ ప్రాజెక్టుకు అనుమతులు తెచ్చామని గుర్తు చేశారు. అప్పుడు ఏపీకి 531 టీఎంసీల వాటా ఉన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకునే సీతారామ ప్రాజెక్టుకు (67 టీఎంసీలు) సీడబ్ల్యూసీ అనుమతి ఇచ్చిందని వివరించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More