గోదావరి వృథా జలాలు వాడుకుంటే తప్పేంటి? న్యాయం మన వైపే ఉంది : మంత్రి నిమ్మల రామానాయుడు

గోదావరి వృథా జలాలు వాడుకుంటే తప్పేంటి? అని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. న్యాయం మన వైపే ఉందని, గట్టిగా వాదించాలని న్యాయవాదులకు సూచించారు.

Published on: Jan 11, 2026, 18:09:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గోదావరి నదీ జల ప్రవాహానికి దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ సముద్రంలో వృథాగా కలిసిపోతున్న 3000 టీఎంసీల నీటిలో 200 టీఎంసీలు నీటిని వాడుకుంటే తప్పేంటి అని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆవేదన చెందారు. తోటి తెలుగు రాష్ట్రానికి స్నేహ హస్తం అందిస్తుంటే, వారు ఏపీకి అన్యాయం జరిగేలా కోర్టుకి వెళ్లడం విచారకరమన్నారు.

మంత్రి నిమ్మల రామానాయుడు
మంత్రి నిమ్మల రామానాయుడు

పోలవరం-బనకచర్ల/నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుపై సోమవారం సుప్రీం కోర్టులో వాయిదా నేపథ్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ అధికారులు, న్యాయవాదులతోనూ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించాలని లీగల్ టీమ్‌కు మంత్రి నిమ్మల సూచించారు. ఈ కేసుకు సంబంధించిన అన్ని రికార్డులు, లీగల్ టీమ్‌కు అందించాలని ఇరిగేషన్ ఉన్నతాధికారులకు చెప్పారు.

ఏటా వృథాగా సముద్రంలో ఉప్పునీటిలో కలుస్తున్న 3 వేల టీఎంసీల నీటిలో, కేవలం 200 టీఎంసీలు మాత్రమే తీసుకునేలా ఈ ప్రాజెక్టును ప్రతిపాదించామని మంత్రి నిమ్మల వెల్లడించారు. GWDT అవార్డు ప్రకారం మిగిలిన నీటిని వినియోగించే హక్కు ఏపీకి ఉందన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. గోదావరి బేసిన్‌లో ఆంధ్రప్రదేశ్ దిగువ ప్రవాహ రాష్ట్రం కావడంతో, ఇతర రాష్ట్రాల హక్కులకు భంగం కలుగకుండా మిగిలిన వరద నీటిని వాడుకోవచ్చన్నారు.

వృథాగా సముద్రంలోకి పోతున్న నీటిని రాయలసీమ ప్రాంతానికి తరలించి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యంగా రామానాయుడు చెప్పారు. కేంద్రానికి ప్రాజెక్ట్ ఫీజుబులిటీ రిపోర్ట్ సమర్పించాం, వారి సూచనల మేరకే మార్పులు చేస్తున్నామన్నారు. డీపీఆర్‌కి సంబంధించిన టెండర్లు కేవలం ముందస్తు సన్నాహక చర్య మాత్రమేనని వెల్లడించారు. చట్టపరమైన అన్ని అనుమతులు వచ్చాకే పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టు చేపడతామని, రామానాయుడు చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ తరఫున సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదిస్తున్నారు. కౌన్సిల్‌లో మరో న్యాయవాది జయదీప్ గుప్తా వాదిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ సాయిప్రసాద్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి, న్యాయవాదులు, ఇంటర్‌స్టేట్ ఇరిగేషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More