క్లైమ్యాక్స్‌లోనూ హీరో మారకపోవడం నచ్చలేదనుకుంట.. కొన్నేళ్ల తర్వాత ఈ మూవీ వచ్చి ఉంటే నచ్చేదేమో: తెలుసు కదా డైరెక్టర్ నీరజ
సిద్దూ జొన్నలగడ్డ నటించిన తెలుసు కదా మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంపై డైరెక్టర్ నీరజ కోన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. క్లైమ్యాక్స్ లోనూ హీరో మారకపోవడం అనేది ప్రేక్షకులకు నచ్చలేదేమో అని ఆమె అనడం విశేషం.
సిద్దూ జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి నటించిన మూవీ తెలుసు కదా. ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజైనా సక్సెస్ కాలేకపోయింది. సిద్దూకి వరుసగా రెండో ఫ్లాప్ ఇచ్చింది. అయితే దీనిపై తాజాగా గుల్టెలో జరిగిన డైరెక్టర్స్ రౌండ్ టేబుల్లో తెలుసు కదా డైరెక్టర్ నీరజ కోన స్పందించింది. మూవీ చాలా అడ్వాన్స్‌గా ఉండటం వల్ల ప్రేక్షకులకు నచ్చలేదేమో అని అభిప్రాయపడింది.

నీరజ కోన ఏమన్నదంటే?
తెలుసు కదా మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలోని హీరో పాత్ర స్వభావం, ప్రేక్షకుల అంచనాల గురించి నీరజ కోన ఇలా వివరించింది. "హీరో పాత్రలో గ్రే షేడ్స్ (ప్రతికూల ఛాయలు) ఉంటాయి. కనీసం క్లైమాక్స్‌లో అయినా హీరో మారిపోయి ఉంటే సినిమా కచ్చితంగా క్లిక్ అయ్యేది. ఎందుకంటే మన ప్రేక్షకులు కోరుకునేది, ఆశించేది అదే. కానీ హీరో చివరి వరకూ అలాగే మారకుండా ఉండిపోయాడు. దాన్ని జనం జీర్ణించుకోలేకపోయారు" అని చెప్పింది.
అంతేకాకుండా ఈ కథ ఇప్పటి కాలానికి సరిపోలేదేమో అనే సందేహాన్ని కూడా ఆమె వ్యక్తం చేసింది. "బహుశా 'తెలుసు కదా' సినిమా ఇప్పటి ఆడియెన్స్‌కు మరీ అడ్వాన్స్‌డ్‌గా లేదా మరీ కొత్తగా అనిపించి ఉండొచ్చు. మరో కొన్నేళ్ల తర్వాత విడుదలై ఉంటే ఈ సినిమా కచ్చితంగా వర్కవుట్ అయ్యేదేమో" అని నీరజ కోన పేర్కొంది.
తెలుసు కదా మూవీ గురించి..
సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా స్టైలిష్‌గా తెరకెక్కినప్పటికీ, కథనంలో కొత్తదనం ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయిందనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు దర్శకురాలి మాటలు ఆ విమర్శలకు బలం చేకూరుస్తున్నాయి. స్టైలిస్ట్ అయిన నీరజకు డైరెక్టర్ గా ఇదే తొలి సినిమా. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు.
రొమాన్స్, ట్రయాంగిల్ లవ్ స్టోరీ సినిమాలు తెలుగులోనే కాదు ఇతర భాషల్లో కూడా చాలానే వచ్చాయి. తెలుసు కదా కూడా ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీకి సంబంధించినదే. కానీ, ఇలాంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీ మాత్రం తెలుగులో రాలేదని చెప్పాలి.
ప్రేమ కోసం ట్రయాంగిల్ యాంగిల్ ఉండటం సాధారణమే కానీ, ఇక్కడ పిల్లల కోసం ట్రయాంగిల్ డ్రామా సాగడం చాలా యూనిక్ పాయింట్. పిల్లలు కావాలనుకునే భార్యాభర్తలు, సరోగసీ ద్వారా బిడ్డను అందించడానికి మాజీ లవర్ రావడం, ఆ తర్వాత ముగ్గురు మధ్య చోటుచేసుకునే పరిస్థితులు ఒక డిఫరెంట్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


