Thaai Kizhavi OTT Release: ఓటీటీలోకి రాధికా శరత్‌కుమార్ తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ.. ఐఎండీబీలో 8.1 రేటింగ్
Thaai Kizhavi OTT Release: ఓటీటీలోకి రాధికా శరత్‌కుమార్ నటించిన బ్లాక్‌బస్టర్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది. ఏప్రిల్ 10 నుంచి ఈ సినిమా జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
Thaai Kizhavi OTT Release: ఈ ఏడాది తమిళంలో ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన సినిమా థాయ్ కిళవి. కేవలం రూ.6.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి.. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.75 కోట్లు వసూలు చేసిన సినిమా ఇది. మొత్తానికి సుమారు 50 రోజుల తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కానుంది.

థాయ్ కిళవి ఓటీటీ రిలీజ్ డేట్
రాధికా శరత్‌కుమార్ విశ్వరూపం చూపించిన ఈ థాయ్ కిళవి మూవీ జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కు రానుంది. ఏప్రిల్ 10న మూవీని డిజిటల్ ప్రీమియర్ చేయనున్నట్లు ఆ ఓటీటీ వెల్లడించింది. అయితే ప్రస్తుతానికి కేవలం తమిళం ఆడియోతోనే ఈ మూవీ వచ్చే అవకాశం ఉంది. మిగిలిన డబ్బింగ్ వెర్షన్లపై ఆ ఓటీటీ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఇక జియోహాట్‌స్టార్ లో థాయ్ కిళవి వసూళ్ల పర్వం మొదలు కానుంది అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ తమిళ ఎక్స్ అకౌంట్లో వెల్లడించింది.
థాయ్ కిళవి మూవీ స్టోరీ ఏంటంటే?
ఈ థాయ్ కిళవి సినిమా కథ అంతా పావునుతాయ్ (రాధికా శరత్‌కుమార్) అనే 70 ఏళ్ల వృద్ధురాలి చుట్టూ తిరుగుతుంది. ఊరిలో ఆమె ఒక కరుడుగట్టిన వడ్డీ వ్యాపారి. నోటిదురుసు, మొండితనం ఆమె సొంతం. చివరికి తన ముగ్గురు కొడుకులను కూడా ఆమె తన అదుపులోనే ఉంచుకుంటుంది. అయితే అకస్మాత్తుగా ఆమెకు పక్షవాతం వచ్చి మంచాన పడుతుంది.
ఆమె ఎప్పుడు చనిపోతుందా అని ఊరి జనం, ఆమె దాచిన ఆస్తి ఎక్కడ ఉందో అని ఆమె కొడుకులు ఎదురుచూస్తూ ఉంటారు. మాట్లాడలేని స్థితిలో ఉన్న పావునుతాయ్, తన వేలితో ఏదో సైగ చేస్తూ ఒక రహస్యాన్ని చెప్పాలని ప్రయత్నిస్తుంది. ఆ రహస్యం ఏంటి? ఒక పరాయి వ్యక్తి వచ్చి ఆమె వద్ద ఉన్న '160 తులాల బంగారం' గురించి అడిగినప్పుడు ఏం జరిగింది? అనే అంశాలను దర్శకుడు శివకుమార్ మురుగేషన్ నవ్వులు పూయిస్తూనే, భావోద్వేగంగా తెరకెక్కించాడు.
థాయ్ కిళవి మూవీ విశేషాలు
ఈ సినిమాను కేవలం రూ. 6.5 కోట్లతో నిర్మించారు. విడుదలైన 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 50 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత ఇవి రూ.75 కోట్లకు చేరాయి. 2026లో మోస్ట్ ప్రాఫిటబుల్ సినిమాగా నిలిచింది.
63 ఏళ్ల వయసులో రాధికా ఈ పాత్రలో పరకాయ ప్రవేశం చేసింది. మంచంపై ఉండి కూడా కేవలం కళ్లతో, హావభావాలతో ఆమె పండించిన నటన సినిమాకు అతిపెద్ద బలం. పల్లెటూరి నేపథ్యంలో సాగే సిట్యుయేషనల్ కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. ముఖ్యంగా సింగం పులి, బాల శరవణన్, మునిష్ కాంత్ ల కామెడీ టైమింగ్ అద్భుతంగా కుదిరింది.
ఈ సినిమాను ప్రముఖ హీరో శివకార్తికేయన్ నిర్మించడం వల్ల మంచి ప్రమోషన్ దక్కింది. కేవలం సెంటిమెంట్‌కే పరిమితం కాకుండా, మహిళల ఆర్థిక స్వేచ్ఛ గురించి ఈ సినిమాలో చర్చించిన విధానం మహిళా ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది.
ఈ సినిమా విజయంతో నిర్మాత శివకార్తికేయన్.. రాధికకు రెమ్యునరేషన్‌తో పాటు లాభాల్లో కూడా వాటా ఇచ్చాడు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఒక సీనియర్ నటికి లాభాల్లో వాటా ఇవ్వడం ఇదే మొదటిసారి అని రాధికనే స్వయంగా చెప్పింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


