Keerthy Suresh: నువ్వు లావుగా ఉంటేనే బాగుండేదానివని అంటున్నారు.. కష్టపడి తగ్గితే సర్జరీ అంటారా: కీర్తి సురేష్ కామెంట్స్

Keerthy Suresh: బాడీ షేమింగ్, ప్లాస్టిక్ సర్జరీ పుకార్లపై జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఘాటుగా స్పందించారు. తాను ఎదుర్కొన్న శారీరక, మానసిక ఇబ్బందులను పంచుకుంటూ, తనపై వచ్చే నెగెటివ్ కామెంట్లకు గట్టి సమాధానమిచ్చారు.

Published on: May 18, 2026, 17:05:32 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Keerthy Suresh: సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ తోపాటు ఆ వెనుకే ఉండే ఒత్తిళ్లు, విమర్శలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హీరోయిన్ల శరీరాకృతిపై సోషల్ మీడియాలో నెటిజన్లు చేసే కామెంట్లు ఒక్కోసారి హద్దులు దాటుతుంటాయి. తాజాగా 'మహానటి' కీర్తి సురేష్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక సుదీర్ఘమైన పోస్ట్ ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తన కెరీర్‌లో ఎదుర్కొన్న బాడీ షేమింగ్, ప్లాస్టిక్ సర్జరీ పుకార్లపై ఆమె తొలిసారి బహిరంగంగా స్పందించారు. జిమ్‌లో తను కష్టపడుతున్న పాత వీడియోలను షేర్ చేస్తూ భావోద్వేగ నోట్ రాశారు.

Keerthy Suresh: నువ్వు లావుగా ఉంటేనే బాగుండేదానివని అంటున్నారు.. కష్టపడి తగ్గితే సర్జరీ అంటారా: కీర్తి సురేష్ కామెంట్స్
Keerthy Suresh: నువ్వు లావుగా ఉంటేనే బాగుండేదానివని అంటున్నారు.. కష్టపడి తగ్గితే సర్జరీ అంటారా: కీర్తి సురేష్ కామెంట్స్

ఆ సినిమా తర్వాతే నా ప్రయాణం మారింది

కీర్తి సురేష్ తన ఫిట్‌నెస్ జర్నీ గురించి వివరిస్తూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. "2013లో నేను నటిగా కెరీర్ ప్రారంభించినప్పుడు నాకేమీ తెలియదు. చాలా మందిలాగే జిమ్ నాకు సెట్ కాదనుకున్నా. నా శరీరానికి ఏం కావాలో కనీస అవసరాలను పట్టించుకోలేదు" అని కీర్తి గుర్తు చేసుకున్నారు.

అయితే 2018లో వచ్చిన ‘మహానటి’ సినిమా ఘనవిజయం సాధించిన తర్వాత, ఒక చిన్న బ్రేక్ లో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని ఆమె నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి తొమ్మిది నెలల పాటు కఠినంగా శ్రమించి దాదాపు 10 కిలోల బరువు తగ్గారు.

సర్జరీ పుకార్లపై ఘాటు స్పందన

కష్టపడి బరువు తగ్గితే అభినందించాల్సింది పోయి, జనాలు విమర్శలు చేయడం మొదలుపెట్టారని కీర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె చాలా బలహీనంగా మారిపోయిందని, అందం కోసం సర్జరీలు చేయించుకుందంటూ అప్పట్లో పుకార్లు పుట్టించారు.

ఈ ప్రచారంపై కీర్తి స్పందిస్తూ.. "నేను నా ముఖం విషయంలో కూడా ఎప్పుడూ సహజత్వానికే ప్రాధాన్యత ఇస్తాను. నా కష్టాన్నంతా పక్కనబెట్టి సర్జరీ కత్తి కిందకు నెట్టేసరికి కొంచెం బాధేసింది" అని రాసుకొచ్చారు. జిమ్‌తో పాటు 2020లో తాను ప్రారంభించిన యోగా తన జీవితాన్ని, ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసిందని తెలిపారు.

లావుగా ఉంటే ఒకలా.. సన్నగా ఉంటే ఇంకోలా

సమాజంలో, సినిమా ఇండస్ట్రీలో ఉండే ద్వంద్వ ప్రమాణాలను కీర్తి ఎండగట్టారు. "ఈ రోజు నా ఫిట్‌నెస్ చూసి నేను గర్వపడుతుంటే.. జనాలు మాత్రం నువ్వు లావుగా ఉన్నప్పుడే బాగున్నావంటూ అనవసరపు సలహాలు ఇస్తున్నారు. లావుగా ఉంటే సన్నబడమంటారు, సన్నగా మారితే లావుగా అవ్వమంటారు. అసలు ఈ ప్రపంచం ఎలా ఆలోచిస్తుందో అర్థం కావడం లేదు" అని ఆమె అసహనం వ్యక్తం చేశారు.

శారీరక, మానసిక ఇబ్బందులు

గత కొన్ని నెలలుగా తాను సోషల్ మీడియాకు, సినిమా షూటింగులకు కాస్త దూరంగా ఉండటానికి గల కారణాన్ని కూడా ఆమె బయటపెట్టారు. ఇటీవల తాను తీవ్రమైన శారీరక, మానసిక ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు అంగీకరించారు.

"ఇటీవల నేను మానసికంగా, శారీరకంగా కాస్త వెనకబడ్డాను. కొన్నిసార్లు బ్రేక్ తీసుకోవాల్సి రావచ్చు, ఆగాల్సి రావచ్చు.. కానీ నేను ఎప్పటికీ లొంగిపోను, పోరాడుతూనే ఉంటా" అని కీర్తి తన మనోధైర్యాన్ని చాటారు.

కీర్తి సురేష్ చేసిన ఈ పోస్ట్‌కు పరిశ్రమలోని తోటి నటీమణులు కల్యాణి ప్రియదర్శన్, మంజిమా మోహన్, ప్రగ్యా జైస్వాల్, అతుల్య రవి మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం కీర్తి చేతిలో వరుస ప్రాజెక్టులు ఉన్నాయి. తెలుగులో ‘ఉప్పు కప్పురంబు’ చిత్రంలో నటించిన ఆమె.. త్వరలోనే తమిళంలో ‘కన్నివేడి’, ‘సత్యవాన్ సావిత్రి’, తెలుగులో ‘రౌడీ జనార్దన’, మలయాళంలో ‘తోట్టం’, హిందీలో ‘రఫ్తార్’ వంటి క్రేజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

ప్రశ్న: కీర్తి సురేష్ బరువు తగ్గడానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారా?

జవాబు: లేదు.. కీర్తి సురేష్ ఎలాంటి సర్జరీలు చేయించుకోలేదు. తొమ్మిది నెలల పాటు జిమ్‌లో కఠినమైన వర్కవుట్లు, యోగా చేయడం ద్వారానే ఆమె సహజంగా 10 కిలోల బరువు తగ్గారు. తనపై వచ్చిన సర్జరీ పుకార్లను ఆమె పూర్తిగా ఖండించారు.

ప్రశ్న: కీర్తి సురేష్ ఇటీవల సినిమాలకు ఎందుకు దూరంగా ఉన్నారు?

జవాబు: ఇటీవల తాను తీవ్రమైన శారీరక, మానసిక ఇబ్బందులను ఎదుర్కొన్నానని, అందుకే కొన్ని నెలల పాటు సోషల్ మీడియాకు, లైమ్‌లైట్‌కు దూరంగా ఉన్నానని కీర్తి స్వయంగా వెల్లడించారు.

ప్రశ్న: కీర్తి సురేష్ రాబోయే కొత్త సినిమాలు ఏవి?

జవాబు: కీర్తి సురేష్ త్వరలోనే తెలుగులో 'రౌడీ జనార్దన' అనే చిత్రంలో నటించనున్నారు. దీంతో పాటు తమిళంలో ‘కన్నివేడి’, ‘సత్యవాన్ సావిత్రి’, హిందీలో వరుణ్ ధావన్‌తో కలిసి ‘రఫ్తార్’ చిత్రాల్లో నటిస్తున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More