Udhayanidhi Stalin: ఉదయనిధిని లోపలేయడం మంచి పనే.. నోటికొచ్చినట్లు మాట్లాడితే జైల్లో వేయాల్సిందే: కంగనా రనౌత్

Udhayanidhi Stalin: తమిళనాడు సీఎం విజయ్, త్రిషలపై అసభ్యకరమైన కామెంట్స్ చేసిన ఉదయనిధి స్టాలిన్ పై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ విరుచుకుపడింది. ఇది మంచి పరిణామమే అని, ఇలాంటి కామెంట్స్ చేస్తే జైల్లో వేయాల్సిందే అని అనడం గమనార్హం.

Published on: Aug 4, 2026, 18:41:05 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Udhayanidhi Stalin: కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ (Trisha Krishnan)పై తమిళనాడు మాజీ డిప్యూటీ సీఎం, డీఎంకే (DMK) కీలక నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు సౌత్ ఇండియా వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఒక పబ్లిక్ ర్యాలీలో త్రిషను ఉద్దేశించి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు పోలీసులు అతడిని నిర్బంధించగా, ఈ వ్యవహారంపై బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్రస్థాయిలో స్పందించారు.

Udhayanidhi Stalin: ఉదయనిధిని లోపలేయడం మంచి పనే.. నోటికొచ్చినట్లు మాట్లాడితే జైల్లో వేయాల్సిందే: కంగనా రనౌత్
Udhayanidhi Stalin: ఉదయనిధిని లోపలేయడం మంచి పనే.. నోటికొచ్చినట్లు మాట్లాడితే జైల్లో వేయాల్సిందే: కంగనా రనౌత్

బహిరంగ సభల్లో అసభ్యకర పదజాలం వాడటం, మహిళలను కించపరిచేలా డబుల్ మీనింగ్ జోకులు వేయడం ఏ నాగరిక సమాజం కూడా ఒప్పుకోదని కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఘాటుగా రాసుకొచ్చారు.

"జైలుకు వెళ్లడం మంచి పరిణామమే".. సోషల్ మీడియాలో కంగనా రచ్చ

ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ వార్తలపై స్పందిస్తూ కంగనా రనౌత్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. "ఇలాంటి నేరాలకు పాల్పడిన వ్యక్తిని జైలుకు పంపడం ఒక మంచి పరిణామం. అతనికి బెయిల్ వచ్చి ఉండవచ్చు, కానీ చట్టం ముందు అందరూ సమానమే అనే సంకేతం ఇవ్వడం చాలా అవసరం" అని కంగనా పేర్కొన్నారు.

నటిగా మాత్రమే కాకుండా ఒక పార్లమెంట్ సభ్యురాలిగా మహిళల ఆత్మగౌరవంపై దెబ్బతీసే వ్యాఖ్యలను సహించేది లేదని కంగనా స్పష్టం చేశారు.

కావాలనే వివాదం.. అసలు పబ్లిక్ ర్యాలీలో ఏం జరిగింది?

కావేరి నదీ జలాల సమస్యపై ఏర్పాటు చేసిన ఒక పబ్లిక్ మీటింగ్‌లో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆ సమయంలో ఆడియన్స్ నుంచి కొందరు త్రిష పేరును గట్టిగా అరిచారు. దీంతో ఉదయనిధి నవ్వుతూ కావేరి నీళ్లతో పాటు త్రిషను ముడిపెడుతూ డబుల్ మీనింగ్ కామెంట్స్ చేశారనే ఆరోపణలు వచ్చాయి.

ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కి చెందిన పాలిటికల్ పార్టీ టీవీకే (TVK) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపిస్తూ పోలీసులు, జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో పోలీసు శాఖ ఉదయనిధిని తన చెన్నై నివాసంలో నిర్బంధించింది.

"ఇదొక పెద్ద కామెడీ".. ఉదయనిధి స్టాలిన్ కౌంటర్

పోలీస్ వ్యాన్‌లో నుంచి మీడియాతో మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్ ఈ అరెస్ట్ వ్యవహారాన్ని ఒక పెద్ద కామెడీగా అభివర్ణించారు. "నేను ఏ ఒక్కరి పేరును ప్రత్యక్షంగా తీయలేదు, ఎవరినీ కించపరిచేలా మాట్లాడలేదు. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఈ కేసులు పెడుతున్నారు. చట్టపరంగా ఎదుర్కొనేందుకు నేను సిద్ధంగా ఉన్నాను" అని ధీమా వ్యక్తం చేశారు.

డీఎంకే సీనియర్ నేత టిఆర్ బాలు కూడా ఉదయనిధికి మద్దతుగా నిలుస్తూ, ఇవన్నీ కల్పిత కథలని, ఏ ఒక్క మహిళ పేరును ఉదయనిధి ప్రస్తావించలేదని స్పష్టం చేశారు.

మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాలు.. బెయిల్‌పై రిలీజ్

మరోవైపు ఉదయనిధి స్టాలిన్ వేసిన అత్యవసర యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణాధికారి జస్టిస్ జి.కె.ఇళందిరైయన్ ఉదయనిధిని ప్రశ్నించిన వెంటనే విడుదల చేయాలని పోలీసులను ఆదేశించారు.

తమిళనాడు అడ్వకేట్ జనరల్ విజయ్ నారాయణ్ కోర్టులో వాదనలు వినిపిస్తూ, ఉదయనిధిని కస్టడీలోకి తీసుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, కేవలం విచారణ కోసమే పిలిచామని వివరించారు. దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని ఆదేశిస్తూ హైకోర్టు ఈ కేసుకు సంబంధించిన విచారణను ముగించింది.

కంగనా చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్
కంగనా చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్
  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More