OTT: ఇరాన్ కొండల్లో అమెరికా సైనికుడు.. ఆర్గో సినిమాను తలపించేలా సాహసోపేత రెస్క్యూ ఆపరేషన్.. ఆ మూవీ ఈ ఓటీటీలోనే..
OTT: ఇరాన్ గడ్డపై కూలిపోయిన ఫైటర్ జెట్ నుంచి పారాచూట్ ద్వారా దూకేసిన అమెరికా ఎయిర్‌మన్‌ను యూఎస్ సైన్యం అత్యంత సాహసోపేతంగా రక్షించింది. సీల్ టీమ్ 6, డెల్టా ఫోర్స్ కమెండోలతో కూడిన 100 మంది ప్రత్యేక బలగాలు ఈ మెరుపు దాడిలో పాల్గొన్నాయి.
అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరిన వేళ.. హాలీవుడ్ యాక్షన్ సినిమాను తలపించే ఒక భారీ రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. ఇరాన్ గడ్డపై కూలిపోయిన తన యుద్ధ విమాన పైలట్లను కాపాడుకునేందుకు అమెరికా సైన్యం, సీఐఏ (CIA) కలిసి జరిపిన ఈ ఆపరేషన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకవైపు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఇరాన్‌ను హెచ్చరిస్తుండగానే, మరోవైపు సైనికులు శత్రువుల కళ్లుగప్పి తమ అధికారిని ప్రాణాలతో వెనక్కి తీసుకొచ్చారు.

7000 అడుగుల ఎత్తులో ప్రాణ సంకటం
న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. అమెరికాకు చెందిన ఒక ఫైటర్ జెట్ ఇరాన్ భూభాగంలో కూలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే ఇద్దరు పైలట్లు పారాచూట్ సహాయంతో కిందకు దూకేశారు. పైలట్‌ను ఆరు గంటల్లోనే రక్షించగలిగారు కానీ, వెపన్స్ ఆఫీసర్ జాడ తెలియలేదు.
ఆయన ఇరాన్ దళాలకు దొరకకుండా ఉండేందుకు సుమారు 7000 అడుగుల ఎత్తైన పర్వత ప్రాంతానికి చేరుకుని, ఒక కొండ చీలికలో దాక్కున్నారు. తన దగ్గర ఉన్న బీకాన్ సహాయంతో ఆయన సిగ్నల్ పంపడంతో, అమెరికా అధికారులు ఆయన లొకేషన్ గుర్తించారు.
100 మంది కమెండోలతో మెరుపు దాడి
ఈ విషయం తెలిసిన వెంటనే అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీల్ టీమ్ 6 (SEAL Team 6), డెల్టా ఫోర్స్, ఆర్మీ రేంజర్లకు చెందిన 100 మందికి పైగా స్పెషల్ ఫోర్స్ కమెండోలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. వారికి తోడుగా హెలికాప్టర్లు, నిఘా విమానాలు, ఫైటర్ జెట్లు రంగంలోకి దిగాయి.
ఇరాన్ దళాలు ఆయన కోసం వెతుకుతున్న సమయంలోనే, అమెరికా కమెండోలు మెరుపు వేగంతో స్పందించి ఆ అధికారిని రక్షించారు. ఇజ్రాయెల్ నిఘా వర్గాలు కూడా ఈ ఆపరేషన్‌లో కీలక సమాచారాన్ని అందించడం విశేషం.
చివరి నిమిషంలో ఉత్కంఠ
అధికారిని రక్షించిన తర్వాత తిరుగు ప్రయాణంలో ఊహించని అడ్డంకి ఎదురైంది. కమెండోలను తీసుకెళ్లాల్సిన రెండు సి-130 (C-130) విమానాలు ఇసుకలో కూరుకుపోయాయి. దీంతో వెంటనే మరో మూడు విమానాలను పంపి బలగాలను సురక్షితంగా తరలించారు.
శత్రువుల చేతికి చిక్కకుండా ఉండేందుకు ఇసుకలో ఆగిపోయిన రెండు విమానాలను అమెరికా సైన్యమే బాంబులతో పేల్చేసింది. అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్ కేవలం డ్రామా అని, ఇరాన్ నుంచి యురేనియం దొంగిలించేందుకే అమెరికా ఈ ప్లాన్ వేసిందని ఇరాన్ విదేశాంగ శాఖ ఆరోపించింది.
'ఆర్గో' రోజులు గుర్తుకొచ్చాయి..
ఈ తాజా ఆపరేషన్ చూస్తుంటే 1979 నాటి ప్రసిద్ధ 'ఆర్గో' (Argo) ఆపరేషన్ గుర్తుకు వస్తోంది. అప్పట్లో ఇరాన్‌లో బందీలుగా చిక్కుకున్న ఆరుగురు అమెరికా దౌత్యవేత్తలను రక్షించేందుకు సీఐఏ ఒక నకిలీ సైన్స్ ఫిక్షన్ సినిమా షూటింగ్ పేరుతో డ్రామా ఆడింది.
హాలీవుడ్ మేకప్ ఆర్టిస్టుల సహాయంతో కెనడా పాస్‌పోర్టులు సృష్టించి వారిని విమానం ఎక్కించి చాకచక్యంగా రక్షించారు. ఇదే కథాంశంతో 2012లో బెన్ అఫ్లెక్ దర్శకత్వంలో వచ్చిన 'ఆర్గో' చిత్రం ఆస్కార్ లను కూడా గెలుచుకుంది. ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. ఈ మూవీ ప్రస్తుతం జియోహాట్‌స్టార్, ప్రైమ్ వీడియల్లో అందుబాటులో ఉంది.

E-Paper












