Malayalam Thriller OTT: బావిలో డెడ్‌బాడీ-గూస్‌బంప్స్ తెప్పించే థ్రిల్లర్-ఇవాళ ఓటీటీకి తెలుగులో వచ్చిన మలయాళం మూవీ
Malayalam Thriller OTT: మలయాళ యంగ్ టాలెంటెడ్ నటుడు రోషన్ మాథ్యూ హీరోగా నటించిన సినిమా ‘ఉయిర్’. ఈ క్రైమ్ ఇన్విస్టిగేటివ్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ నుంచి తెలుగులోనూ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ను ఎందుకు చూడాలో తెలుసుకోండి.
Malayalam Thriller OTT: మలయాళ చిత్రసీమ నుంచి వచ్చే క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలకు తెలుగు డిజిటల్ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. సహజత్వానికి దగ్గరగా ఉండే కథాంశాలు, ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లేతో ఇవి అలరిస్తాయి. అలాంటి మరో మలయాళ సినిమా ‘ఉయిర్’ (Uyir) ఓటీటీలోకి వచ్చేసింది.

ఉయిర్ ఓటీటీ రిలీజ్
మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ‘ఉయిర్’ ఓటీటీలో అడుగుపెట్టింది. పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ (JioHotstar) వేదికగా ఇవాళ (ఆగస్టు 4) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది.
ప్రముఖ దర్శకుడు ఎం. పద్మకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం జూన్ 26న థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
బావిలో గుర్తుతెలియని మృతదేహం
ఒక పోలీస్ ఆఫీసర్ రియల్ లైఫ్ కేరీర్‌లో ఎదుర్కొన్న నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఉయిర్ సినిమాను తెరకెక్కించారు. దీనికి కథను ఓ రియల్ పోలీస్ ఆఫీసర్ అందించడం విశేషం. కన్నూర్ జిల్లాలోని ధర్మడం పోలీస్ స్టేషన్‌లో కొత్తగా బాధ్యతలు చేపట్టిన ప్రొబేషనరీ సబ్-ఇన్‌స్పెక్టర్ అజీబ్ రెహమాన్ (రోషన్ మాథ్యూ) పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది.
బాధ్యతలు చేపట్టిన కొత్తలోనే రెహమాన్ కు ఓ ఛాలెంజ్ ఎదురవుతుంది. పాడుబడిన ఒక బావిలో కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న ఒక అపరిచిత మహిళ మృతదేహం లభ్యమవుతుంది.
మిస్టరీ కేసు
మొదట ఇది ఒక సాధారణ ఆత్మహత్య లేదా అనుమానాస్పద మృతిగా భావించినప్పటికీ, లోతుగా దర్యాప్తు చేసే కొద్దీ ఊహించని సంచలన నిజాలు వెలుగులోకి వస్తాయి. ఆ యువ పోలీస్ ఆఫీసర్ ఈ క్లిష్టమైన మిస్టరీ కేసును ఎలా ఛేదించాడనేదే ఉయిర్ మూవీ స్టోరీ. కేసు విచారణలో వచ్చే ట్విస్ట్ లు గూస్ బంప్స్ తెప్పిస్తాయి.
రోషన్ అదుర్స్
ఉయిర్ సినిమాలో రోషన్ మాథ్యూ నటనకు థియేట్రికల్ రిలీజ్ సమయంలోనే విశేష ప్రశంసలు లభించాయి. నూతన పోలీస్ అధికారిగా అతను చూపించిన హావభావాలు, నటన ఎంతగానో ఆకట్టుకున్నాయి. రోషన్‌తో పాటు బైజు సంతోష్, సైయామి ఖేర్, శృతి మీనన్, వినోద్ సాగర్, వినీత్ తట్టిల్, దివ్య ఎమ్. నాయర్, షాజూ శ్రీధర్, అతుల్య చంద్ర, మహేష్ శెట్టి, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
పోలీసుల దర్యాప్తు శైలిని, వారి రోజువారీ పని ఒత్తిడిని ఏమాత్రం సినిమాటిక్ హంగులు లేకుండా అత్యంత సహజంగా తెరకెక్కించడం ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.
ఓటీటీలో ‘ఉయిర్’ ఎందుకు చూడాలి?
మలయాళ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లకు ఓటీటీలో ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మామూలుగా వచ్చే రొటీన్ లాజిక్ లేని పోలీస్ డ్రామాల కంటే 'కన్నూర్ స్క్వాడ్', 'అంజామ్ పాత్రా' తరహాలో సాగే రియలిస్టిక్ ఇన్వెస్టిగేషన్ సినిమాలకు ఓటీటీ వీక్షకులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
థియేటర్లలో మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, నిజ జీవిత సంఘటన ఆధారంగా రావడం, రోషన్ మాథ్యూ వంటి పవర్‌ఫుల్ పెర్ఫార్మర్ నటించడం ఉయిర్ కు కలిసొచ్చే అంశాలు. జియోహాట్‌స్టార్‌లో ఓటీటీ క్రైమ్ జానర్ లవర్స్‌కు 'ఉయిర్' ఒక ఉత్తమమైన వీకెండ్ వాచ్‌గా మారే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


