రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వచ్చినా.. మీరు అనారోగ్యంగా ఫీల్ అవుతున్నారా? శరీరం ఇచ్చే ఈ 10 సంకేతాలను అస్సలు విస్మరించొద్దు
రక్త పరీక్షలు, స్కానింగ్ రిపోర్టులు అన్నీ సాధారణంగా ఉన్నప్పటికీ, శరీరం కొన్నిసార్లు అనారోగ్య సంకేతాలను పంపిస్తుంటుంది. మనకు తెలియకుండానే లోలోపల దాగున్న 10 ముఖ్యమైన ఆరోగ్య సమస్యల గురించి అమెరికాకు చెందిన ఫంక్షనల్ మెడిసిన్ నిపుణురాలు డాక్టర్ క్లియో టెట్జ్‌లాఫ్ వివరించారు.
మనలో చాలామందికి ఒక అనుభవం ఎదురవుతుంది. విపరీతమైన నీరసంగా ఉందనో, జుట్టు రాలుతోందనో డాక్టర్‌ను కలిస్తే.. వారు కొన్ని రక్త పరీక్షలు చేస్తారు. రిపోర్టులు రాగానే "అన్నీ నార్మల్‌గా ఉన్నాయి, ఏం పర్లేదు.. కాస్త ఒత్తిడి వల్ల అలా అనిపిస్తోంది, వయసు పెరిగే కొద్దీ ఇవన్నీ మామూలే" అని చెబుతారు. కానీ, లోలోపల శరీరం మాత్రం ఇంకా ఇబ్బంది పడుతూనే ఉంటుంది.

రిపోర్టులు బాగున్నా మనం అనారోగ్యంగా ఎందుకు ఫీల్ అవుతాం? కాలిఫోర్నియాకు చెందిన ఫంక్షనల్ మెడిసిన్ నిపుణురాలు డాక్టర్ క్లియో టెట్జ్‌లాఫ్ దీనిపై స్పష్టతనిచ్చారు. రిపోర్టులు 'నార్మల్' అని చెబుతున్నా, మీ శరీరం పంపే ఆ 10 రహస్య హెచ్చరికలు ఇవే:
1. థైరాయిడ్ రిపోర్ట్ ఓకే.. కానీ అలసట తగ్గదు
మీ థైరాయిడ్ పరీక్ష 'ఇన్ రేంజ్' (In range) లోనే ఉండవచ్చు. కానీ ఆ ఒక్క పరీక్ష పూర్తి నిజాన్ని చెప్పదు. థైరాయిడ్‌కు సంబంధించి మరికొన్ని లోతైన పరీక్షలు చేయకపోవడం వల్ల, సమస్య ఉన్నా అది బయటపడదు. ఫలితంగా మీరు నిరంతరం నీరసంగానే ఉంటారు.
2. ఏకాగ్రత లోపించడం (Brain Fog)
మీ విటమిన్ బి12 స్థాయిలు 'నార్మల్' అనిపించినా, అది మీ మెదడు చురుగ్గా పనిచేయడానికి సరిపోకపోవచ్చు. దీనివల్లే జ్ఞాపకశక్తి తగ్గడం, దేనిపైనా దృష్టి పెట్టలేకపోవడం, తల భారంగా ఉండటం వంటివి జరుగుతాయి.
3. జుట్టు రాలడం
మీకు రక్తహీనత (Anemia) లేదని రిపోర్టులు చెప్పవచ్చు. కానీ మీ శరీరంలో ఐరన్ నిల్వలు (Ferritin) తక్కువగా ఉండటం వల్ల జుట్టు విపరీతంగా రాలడం, త్వరగా అలసిపోవడం వంటివి జరుగుతాయి. దీనిని సాధారణ బ్లడ్ కౌంట్ పరీక్షలు ఒక్కోసారి గుర్తించలేవు.
4. ఆందోళన లేదా కుంగుబాటు
విటమిన్ డి స్థాయిలు టెక్నికల్‌గా 'సరిగ్గా' ఉన్నా, మీ శరీరానికి అవసరమైన స్థాయిలో ఉండకపోవచ్చు. విటమిన్ డి లోపం నేరుగా మీ మానసిక స్థితిని, రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తుంది.
5. బరువు పెరగడం
సాధారణ బ్లడ్ షుగర్ పరీక్ష బాగుండవచ్చు. కానీ శరీరంలో ఇన్సులిన్ సమస్యలు (Insulin Resistance) నిశ్శబ్దంగా మీ బరువును పెంచుతుంటాయి. దీనివల్లే పదే పదే ఏదైనా తినాలనిపించడం (Cravings), నీరసం వంటివి వస్తుంటాయి.
6. నిద్రలేమి
ఒక్కసారి చేసిన కార్టిసోల్ (స్ట్రెస్ హార్మోన్) పరీక్ష మీ ఒత్తిడిని సరిగ్గా కొలవలేదు. హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల మీరు పగలు అలసిపోయినా, రాత్రిళ్లు మాత్రం నిద్ర పట్టక ఇబ్బంది పడుతుంటారు.
7. వయసుతో వచ్చే మార్పులని సరిపెట్టుకోవడం
ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ లేదా టెస్టోస్టెరాన్ వంటి హార్మోన్లు "వయసుకి తగ్గట్టుగా ఉన్నాయని" రిపోర్టులు చెప్పవచ్చు. కానీ వీటిలో చిన్నపాటి మార్పులు కూడా మీ మూడ్ స్వింగ్స్, నీరసానికి కారణమవుతాయి.
8. లోపల దాగున్న వాపు (Inflammation)
శరీరంలో లోపల జరిగే వాపు లేదా ఇన్‌ఫ్లమేషన్ మీ శక్తిని, బరువును ప్రభావితం చేస్తుంది. సాధారణ బ్లడ్ టెస్టులు దీనిని తరచుగా మిస్ చేస్తుంటాయి.
9. జీర్ణక్రియ సమస్యలు
కడుపు ఉబ్బరం, మలబద్ధకం, అకస్మాత్తుగా వచ్చే ఫుడ్ అలర్జీలను తేలికగా తీసుకోవద్దు. పేగు ఆరోగ్యం (Gut Health) దెబ్బతిన్నదనడానికి ఇవి సంకేతాలు. దీనిపై సరైన పరీక్షలు జరగకపోతే సమస్య తీవ్రమవుతుంది.
10. సమస్యల మధ్య సంబంధాన్ని గుర్తించకపోవడం
నీరసం, జుట్టు రాలడం, నిద్రలేమి, జీర్ణ సమస్యలు.. ఇవన్నీ విడివిడి సమస్యలు కాదు. మన శరీరం ఇచ్చే ఈ చిన్న చిన్న సంకేతాలన్నీ కలిపి చూస్తేనే అసలు అనారోగ్యం ఏంటో అర్థమవుతుంది.
"ఇదంతా కేవలం వయసు వల్లనో లేదా ఒత్తిడి వల్లనో జరుగుతోందని సరిపెట్టుకోకండి. కేవలం మందులు వేసుకోవడం కాకుండా, మీ శరీరం పంపుతున్న ఈ సంకేతాల వెనుక ఉన్న అసలు కారణాన్ని గుర్తించాలి" అని డాక్టర్ క్లియో సూచిస్తున్నారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
1. రిపోర్ట్స్ అన్నీ నార్మల్‌గా ఉన్నా ఎందుకు నీరసంగా అనిపిస్తుంది?
ప్రమాణాల ప్రకారం రిపోర్ట్స్ 'నార్మల్' రేంజ్‌లో ఉన్నా, అవి మీ శరీరపు వ్యక్తిగత అవసరాలకు సరిపోకపోవచ్చు. విటమిన్ డి, బి12 లేదా ఐరన్ నిల్వలు తక్కువగా ఉన్నా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి.
2. జుట్టు రాలడానికి ఐరన్ నిల్వలకు సంబంధం ఏంటి?
కేవలం హిమోగ్లోబిన్ బాగుంటే సరిపోదు. శరీరంలో ఐరన్ నిల్వలను తెలిపే 'ఫెర్రిటిన్' (Ferritin) స్థాయిలు తగ్గితే జుట్టు కుదుళ్లు బలహీనపడి రాలిపోతాయి.
3. నిద్రలేమికి హార్మోన్ల అసమతుల్యత కారణమా?
అవును. కార్టిసోల్ వంటి స్ట్రెస్ హార్మోన్ల హెచ్చుతగ్గులు మీ నిద్ర చక్రాన్ని దెబ్బతీస్తాయి. దీనివల్ల శరీరం అలసిపోయినా మెదడు విశ్రాంతి తీసుకోలేకపోతుంది.
(గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే ఖచ్చితంగా నిపుణులైన వైద్యులను సంప్రదించి సలహా తీసుకోవాలి.)

E-Paper












