ఏసీ ఆన్ చేసినప్పుడు ఫ్యాన్ కూడా వేయాలా..? కరెంట్ బిల్లు తగ్గుతుందా, పెరుగుతుందా? అసలు నిజాలివే

వేసవిలో గదిని త్వరగా చల్లబరచడానికి ఏసీతో పాటు ఫ్యాన్ వేయడం మంచిదా కాదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఈ రెండింటిని కలిపి వాడటం వల్ల కరెంటు బిల్లు తగ్గడంతో పాటు ఏసీపై లోడ్ ఎలా తగ్గుతుందో ఇక్కడ చూద్దాం…

Published on: May 17, 2026, 10:56:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భానుడి భగభగలకు వేసవి కాలంలో ఇళ్లు, గదులు సెగలు కక్కుతుంటాయి. ఈ ఉక్కపోత నుంచి ఉపశమనం పొందడానికి ప్రతి ఒక్కరూ ఎయిర్ కండిషనర్ (AC) వైపు మొగ్గు చూపుతారు. అయితే గది త్వరగా చల్లబడాలని చాలా మంది ఏసీ ఆన్ చేసిన వెంటనే ఫ్యాన్ కూడా వేస్తుంటారు. మరికొందరేమో ఇలా ఏసీ, ఫ్యాన్ కలిపి నడపడం వల్ల కరెంటు బిల్లు విపరీతంగా పెరిగిపోతుందని, ఫ్యాన్ గాలి వల్ల ఏసీ కంప్రెసర్‌పై ఒత్తిడి పెరిగి మిషన్ పాడైపోతుందని భయపడుతుంటారు.

ఏసీ ఆన్ చేసినప్పుడు ఫ్యాన్ కూడా వేయాలా..?
ఏసీ ఆన్ చేసినప్పుడు ఫ్యాన్ కూడా వేయాలా..?

సాంకేతిక నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ నమ్మకం పూర్తిగా తప్పు. వీటిని సరైన పద్ధతిలో కలిపి ఉపయోగిస్తే గది రెట్టింపు వేగంతో చల్లబడుతుంది, ఏసీపై లోడ్ పడదు మరియు మీ కరెంటు బిల్లు కూడా గణనీయంగా తగ్గుతుంది.

వేసవిలో గది ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు ఏసీని నేరుగా 16 లేదా 18 డిగ్రీల వంటి తక్కువ ఉష్ణోగ్రతపై ఉంచి రన్ చేస్తే… గదిని చల్లబరచడానికి కంప్రెసర్ ఎక్కువ సమయం పాటు పూర్తి సామర్థ్యంతో పనిచేయాల్సి వస్తుంది. దీనివల్ల ఏసీ మిషన్‌పై విపరీతమైన లోడ్ పడి, విద్యుత్ వినియోగం పెరిగిపోతుంది. ఫలితంగా మీ చేతికి వచ్చే కరెంటు బిల్లు గుండెల్లో గుబులు రేపుతుంది.

ఏసీ, ఫ్యాన్ కలిపి నడిపితే ఏం జరుగుతుంది?

మీరు గదిలో కేవలం ఏసీ మాత్రమే ఆన్ చేసినప్పుడు, అది గదిలోని వేడి గాలిని లాగేసుకుని చల్లటి గాలిని నెమ్మదిగా విడుదల చేస్తుంది. ఈ చల్లదనం గది అంతటా సమానంగా వ్యాపించడానికి కనీసం అరగంట సమయం పడుతుంది. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలంటే ఏసీతో పాటు ఫ్యాన్‌ను కూడా 2 లేదా 3 వ నంబర్ స్పీడ్‌లో రన్ చేయాలి.

ఫ్యాన్ తిరగడం వల్ల ఏసీ విడుదల చేసే చల్లటి గాలి గదిలోని ప్రతి మూలకు, ప్రతి వైపుకు త్వరగా చేరుకుంటుంది. ఉదాహరణకు… మీరు ఏసీని 24 డిగ్రీల వద్ద సెట్ చేసి, ఫ్యాన్‌ను 3 వ నంబర్ స్పీడ్‌లో పెడితే.. ఫ్యాన్ గాలి వల్ల గదిలో ‘విండ్ చిల్ ఎఫెక్ట్’ (గాలి తీవ్రత వల్ల కలిగే చల్లదనం) ఏర్పడుతుంది. గది 18 డిగ్రీల వద్ద ఉన్నంత చల్లగా అనిపిస్తుంది. దీనివల్ల ఏసీ కంప్రెసర్ త్వరగా ఆటో-కట్ అవుతుంది. ఏసీ తక్కువ సమయం పనిచేయడం వల్ల విద్యుత్ బిల్లు స్వయంచాలకంగా తగ్గుతుంది ఎయిర్ కండిషనర్ యంత్రం జీవితకాలం పెరుగుతుంది. ఫ్యాన్ సహాయంతో మీరు ఏసీ ఉష్ణోగ్రతను 24, 25 లేదా 26 డిగ్రీల వద్ద ఉంచినా కూడా గది శీతలంగా మారుతుంది.

ఉక్కపోత, వింత వాసనలకు చెక్

చాలా మంది రాత్రిపూట ఏసీ వేసుకుని పడుకున్నప్పుడు గదిలో తేమ ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. బెడ్‌షీట్లు, దుస్తులు కాస్త పచ్చిగా అనిపించడం లేదా గదిలో ఒక రకమైన వింత వాసన రావడం వల్ల కొందరికి సరిగ్గా నిద్ర పట్టదు. ఏసీతో పాటు లైట్‌గా ఫ్యాన్ కూడా నడిపితే గదిలో గాలి నిరంతరం ప్రసరిస్తూ ఉంటుంది. దీనివల్ల గదిలోని తేమ మాయమై, గాలి తాజాగా మారుతుంది. ఇది హాయిగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.

మరికొన్ని చిట్కాలు:

చిన్న గది అయితే: మీ బెడ్‌రూమ్ పరిమాణం చిన్నదిగా ఉంటే, మొదట ఏసీని 22 డిగ్రీల ఉష్ణోగ్రతకు సెట్ చేసి కొంతసేపు రన్ చేయండి. ఆ సమయంలో ఫ్యాన్ ఆఫ్ చేయండి. గది కాస్త చల్లబడిన తర్వాత ఏసీ ఉష్ణోగ్రతను 24 లేదా 25కి పెంచి… ఫ్యాన్‌ను తక్కువ స్పీడ్‌లో (1 లేదా 2 నంబర్) ఆన్ చేయండి.

పెద్ద గది అయితే : గది పరిమాణం పెద్దదైతే ఏసీ ఆన్ చేసిన వెంటనే ఫ్యాన్‌ను మీడియం స్పీడ్‌లో రన్ చేయడం వల్ల చల్లటి గాలి త్వరగా రూమ్ అంతా విస్తరిస్తుంది.

గమనిక: ఏసీ ఆన్ చేయడానికి ముందే గది కిటికీలు, తలుపులు పూర్తిగా మూసి ఉన్నాయో లేదో చూసుకోవాలి. తలుపుల సందుల గుండా చల్లటి గాలి బయటకు వెళ్లకుండా ఉంటేనే గది త్వరగా చల్లబడుతుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More