Heatwave alert : రుతుపవనాలకు ముందు.. భానుడి భగభగలు- 46డిగ్రీల ఉష్ణోగ్రత! అక్కడ మాత్రం వర్షాలు..
IMD alerts : భారత వాతావరణ శాఖ (ఐఎండీ) దేశంలో ఒకేసారి రెండు విభిన్న వాతావరణ పరిస్థితులపై అలర్ట్ జారీ చేసింది. మే 26నే కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు అంచనా వేయగా, అదే సమయంలో దిల్లీ, యూపీ, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాల్లో తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది. పూర్తి వివరాలు..
Weather today : భారతదేశంలో ఒకేసారి రెండు భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి! ఒకవైపు ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాల ప్రభావం కనిపిస్తుంటే, మరోవైపు ఉత్తర, మధ్య భారత దేశాలు భానుడి భగభగలకు మండిపోతున్నాయి. దేశ రాజధాని దిల్లీతో పాటు పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి వాయువ్య రాష్ట్రాలలో రాబోయే రోజుల్లో వడగాల్పుల తీవ్రత మరింత పెరగనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది.

అయితే, ఎండలతో అలమటిస్తున్న దేశ ప్రజలకు ఐఎండీ ఇటీవలే ఒక చల్లటి కబురు కూడా అందించింది. అరబేసియా, బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితుల వల్ల నైరుతి రుతుపవనాలు వేగంగా ముందుకు సాగుతున్నాయని, ఇవి మే 26 నాడే కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వెల్లడించింది.
వాతావరణ శాఖ తన తాజా నివేదికలో.. “నైరుతి రుతుపవనాలు మే 26 నాటికి కేరళలో ప్రవేశించే అవకాశం ఉంది (దీనికి అటు ఇటుగా 4 రోజుల వ్యత్యాసం ఉండవచ్చు). కాగా, ఈ వారంలో వాయువ్య, మధ్య భారతదేశంలోని మైదాన ప్రాంతాలలో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉంది,” అని పేర్కొంది.
ఐఎండీ లేటెస్ట్ వెదర్ అలర్ట్స్..
పలు ఈశాన్య, తూర్పు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో సిక్కిం, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలకు వాతావరణ శాఖ ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది.
ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో మే 21, 22 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఇక దక్షిణాది విషయానికి వస్తే.. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, దక్షిణ కర్ణాటక అంతర్గత ప్రాంతాలలో మే 19 వరకు, కేరళలో మే 18 వరకు, లక్షద్వీప్‌లో మే 17న అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అండమాన్ నికోబార్ దీవులలో కూడా వచ్చే 3 రోజులు విస్తారంగా వర్షాలు పడనున్నాయి.
మండిపోనున్న ఉత్తర, మధ్య భారతం..
ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు తీవ్రమైన వడగాల్పుల హెచ్చరికతో కూడిన ‘యెల్లో అలర్ట్’ ఇచ్చింది.
శనివారం (మే 16) నాడు మహారాష్ట్రలోని వర్ధా, అమరావతి ప్రాంతాలలో అత్యధికంగా 46 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదవడం గమనార్హం!
పశ్చిమ రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో మే 22 వరకు వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మే 19 నుంచి 22 మధ్య ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరనున్నాయి. అలాగే పశ్చిమ మధ్యప్రదేశ్‌లో మే 17–20 వరకు; తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, తూర్పు రాజస్థాన్‌లలో మే 17–22 వరకు; పంజాబ్, హరియాణా, చండీగఢ్, దిల్లీలలో మే 18–22 వరకు; ఛత్తీస్‌గఢ్‌లో మే 20–22 వరకు వడగాల్పులు వీస్తాయని బులెటిన్ పేర్కొంది. రాబోయే 3-4 రోజుల్లో వాయువ్య భారత మైదాన ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు మరో 3 నుండి 5 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది.
దిల్లీ వాతావరణం ఇలా..
దేశ రాజధాని దిల్లీ నివాసితులకు ఎండల తీవ్రత పెరుగుతుంది. దిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.6°సీ నుంచి 3.0°సీ వరకు ఎక్కువగా నమోదవుతూ 41°సీ నుంచి 43°సీ మధ్య ఉండే అవకాశం ఉంది. కనీస ఉష్ణోగ్రతలు 24°సీ నుంచి 26°సీ గా నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


