AP TG Weather Report : ఓవైపు ఎండలు... మరోవైపు వర్ష సూచన..! తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం, ఐఎండీ అంచనాలు
Telugu States Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగలాడుతున్నాడు. రాబోయే మూడు రోజుల్లో వడగాల్పులు తీవ్రమయ్యే అవకాశం ఉంది.ఇదే సమయంలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే సూచనలున్నాయి.
Telugu States Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. మే నెల ప్రారంభం కావడంతోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతున్నాయి. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ (IMD) కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 72 గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని…. అనవసరంగా బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.

ఏపీలో ఇవాళ ఎండ తీవ్రత ఎక్కువగానే ఉండనుంది. గుంటూరు జిల్లా మేడికొండూరు, పెదనందిపాడు,ఫిరంగిపురం, ప్రత్తిపాడు,తుళ్లూరు,వట్టిచెరుకూరు మండలాల్లో తీవ్ర, మరో 124 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. శనివారం ప్రకాశం జిల్లాలోని కొప్పెరపాడులో 45.4°C, మార్కాపురం జిల్లాలోని బొట్లగూడూరులో 45.1డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇదే సమయంలో పలు జిల్లాల్లో వర్షాలు కూడా పడొచ్చని అంచనా వేసింది. ద్రోణి ప్రభావంతో ఇవాళ(మే 3) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల పూర్తిగా పొడివాతవరణ పరిస్థితులు ఉండనున్నాయి.
వర్ష సూచనల నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, కూలీలు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు.
తెలంగాణలోనూ భిన్న వాతావరణం….
తెలంగాణ వ్యాప్తంగా ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 నుండి 46 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నాయి. రాజధాని హైదరాబాద్‌లోనూ ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
వర్ష సూచన…
ఇక తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్ కూడా ఇచ్చింది. ఇవాళ పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాకుండా... కొమరంభీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
మే 4వ తేదీన ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

