పిల్లలకు యాంటీబయాటిక్స్: డోసులు తప్పితే ఏమవుతుంది?

పిల్లలకు గతంలో మిగిలిన యాంటీబయాటిక్స్ ఇవ్వడం లేదా కోర్సు మధ్యలోనే ఆపేయడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరించారు. వైద్యుల సలహా లేకుండా వాడితే సైడ్ ఎఫెక్ట్స్, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ముప్పు పెరుగుతుందని స్పష్టం చేశారు.

Published on: Nov 25, 2026, 19:50:51 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఇంట్లో ఎవరికైనా, ముఖ్యంగా పిల్లలకు నొప్పి లేదా వాపు వంటి లక్షణాలు కనిపించగానే యాంటీబయాటిక్స్ వాడాలనే ఆలోచన చాలామందికి వస్తుంది. గతంలో డాక్టర్ రాసిచ్చిన మందుల్లో కొన్ని డోసులు మిగిలి ఉంటే వాటినే ఇచ్చేద్దామని అనుకుంటారు. కానీ ఒకే రకమైన లక్షణాలకు వేర్వేరు కారణాలు ఉండొచ్చు. దగ్గు, జ్వరం వంటివి వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లలో ఏవైనా రావచ్చు. యాంటీబయాటిక్స్ కేవలం బ్యాక్టీరియాపై మాత్రమే పనిచేస్తాయి.

పిల్లలకు యాంటీబయాటిక్స్: డోసులు తప్పితే ఏమవుతుంది? (Pexel)
పిల్లలకు యాంటీబయాటిక్స్: డోసులు తప్పితే ఏమవుతుంది? (Pexel)

ప్రపంచవ్యాప్తంగా యాంటీబయాటిక్స్ అధిక వినియోగం పెద్ద ఆందోళనకర అంశంగా మారింది. వైద్యుడిని సంప్రదించకుండా పిల్లలకు వీటిని ఇస్తే తీవ్రమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. బ్యాక్టీరియల్ సెల్ బయాలజీలో నిపుణురాలైన ఢిల్లీ ఎన్సీఆర్‌లోని శివ్ నాడార్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ నేచురల్ సైన్సెస్ ప్రొఫెసర్ డాక్టర్ రిచా ప్రియదర్శిని, ముంబైలోని పీడీ హిందూజా హాస్పిటల్ అండ్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ రాకేష్ చోఖానీ పిల్లల యాంటీబయాటిక్ వాడకంపై కీలక విషయాలు పంచుకున్నారు.

మిగిలిన యాంటీబయాటిక్స్ ఎందుకు ఇవ్వకూడదు?

గత నెలలో వచ్చినట్లే ఇప్పుడు కూడా పిల్లలకు దగ్గు, జ్వరం లేదా గొంతు నొప్పి వస్తే పాత మందులే పనిచేస్తాయని తల్లిదండ్రులు భావిస్తుంటారు. కానీ దగ్గు లేదా ముక్కు దిబ్బడ వంటి లక్షణాలను చూసి అది వైరల్ సమస్యో, బ్యాక్టీరియల్ సమస్యో చెప్పలేమని ప్రొఫెసర్ ప్రియదర్శిని స్పష్టం చేశారు. అందువల్ల గత అనారోగ్యానికి సంబంధించిన మిగిలిన యాంటీబయాటిక్స్‌ను పిల్లలకు ఇవ్వవద్దని సూచించారు.

"దగ్గు, ఒళ్లు నొప్పులు, ముక్కు దిబ్బడ, జ్వరం వంటి లక్షణాలు చాలా వ్యాధులకు ఒకేలా ఉంటాయి. ఇవి బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్ రెండింటిలోనూ కనిపిస్తాయి. యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లపై మాత్రమే ప్రభావవంతంగా ఉంటాయి. డాక్టర్ సరైన నిర్ధారణ, పరీక్షలు చేసిన తర్వాతే వీటిని తీసుకోవాలి" అని ఆమె వివరించారు.

సాధారణ జలుబుకు కారణమయ్యే వైరస్‌లపై యాంటీబయాటిక్స్ పనిచేయవు. జలుబుకు వీటిని ఇస్తే లక్షణాలు తగ్గకపోగా, దుష్ప్రభావాల (సైడ్ ఎఫెక్ట్స్) బారిన పడే అవకాశం ఉంటుంది.

డోసులు తప్పితే లేదా కోర్సు మధ్యలో ఆపేస్తే ఏమవుతుంది?

చాలా సందర్భాల్లో డాక్టర్ సూచించిన మేరకు యాంటీబయాటిక్స్‌ను పూర్తిగా కొనసాగించడం లేదు. ఇది కూడా ఆందోళన కలిగించే విషయమే. కొన్ని రోజుల నుంచి కొన్నిసార్లు నెల రోజుల వరకు నిర్దిష్ట కాలపరిమితితో యాంటీబయాటిక్ కోర్సును సూచిస్తారు. చికిత్స ప్రారంభించిన రోజు లేదా రెండు రోజుల్లోనే లక్షణాలు తగ్గగానే యాంటీబయాటిక్స్‌ను నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఇది పెద్ద పొరపాటు.

"యాంటీబయాటిక్ చికిత్స మొదలైన రోజు లేదా రెండు రోజుల్లోనే పిల్లల్లో లక్షణాలు తగ్గుముఖం పట్టినప్పటికీ, ఆ దశలో వ్యాధికారక క్రిములు పూర్తిగా నశించవు. శరీరంలోని వ్యాధికారక బ్యాక్టీరియాను సమర్థంగా నిర్మూలించడానికి తగిన స్థాయిలో మందు అందాలి. డోసులు తప్పినప్పుడు శరీరంలో యాంటీబయాటిక్ స్థాయి తగ్గిపోతుంది. దాంతో బ్యాక్టీరియా తిరిగి వృద్ధి చెందడానికి సమయం దొరుకుతుంది. కొన్ని సందర్భాల్లో మందులకు లొంగని (రెసిస్టెన్స్) స్థితికి చేరుకుంటుంది" అని ప్రియదర్శిని తెలిపారు.

క్షయ (టీబీ), ఎండోకార్డిటిస్ లేదా న్యుమోనియా వంటి తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు చికిత్స తీసుకుంటున్న పిల్లల విషయంలో, డాక్టర్‌ను సంప్రదించకుండా మధ్యలో మందులు ఆపడం అత్యంత ప్రమాదకరమని ఆమె హెచ్చరించారు.

పేగులలోని మంచి బ్యాక్టీరియాపై ప్రభావం

జీర్ణక్రియకు తోడ్పడే, రోగనిరోధక వ్యవస్థకు అండగా నిలిచే బ్యాక్టీరియా సహా అనేక సూక్ష్మజీవులకు పేగు నిలయం. వీటినే గట్ మైక్రోబయోమ్ అంటారు. యాంటీబయాటిక్స్ ఈ సమతుల్యతను దెబ్బతీస్తాయి. జీర్ణక్రియ, జీవక్రియ, రోగనిరోధక పనితీరులో మైక్రోబయోమ్ పాత్ర కీలకం కాబట్టి ఆ సమతుల్యతను కాపాడుకోవడం అవసరం.

"చాలా బ్రాడ్-స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ వ్యాధికారక క్రిములనే కాకుండా పేగులోని మంచి బ్యాక్టీరియాను కూడా చంపేస్తాయి. దీనివల్ల గట్ మైక్రోబయోమ్‌లో అసమతుల్యత (డిస్‌బయోసిస్) ఏర్పడి డయేరియా వంటి దుష్ప్రభావాలు వస్తాయి. పేగు ఆరోగ్య స్థితి దెబ్బతింటుంది. దీర్ఘకాలం పాటు అధికంగా యాంటీబయాటిక్స్ వాడితే ఐబీడీ, లీకీ గట్ లేదా సీ. డిఫిసిల్ ఇన్ఫెక్షన్ల వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది" అని దుష్ప్రభావాలను ఆమె వివరించారు.

అందువల్ల పిల్లలకు అనారోగ్యం వస్తే ఏ యాంటీబయాటిక్ ఇచ్చే ముందు అయినా డాక్టర్‌తో సరైన నిర్ధారణ చేయించుకోవాలి. ప్రస్తుత ఇన్ఫెక్షన్ కోసం డాక్టర్ యాంటీబయాటిక్స్ రాస్తే, సూచించిన డోసు, షెడ్యూల్‌ను తప్పకుండా పాటించాలి.

మిగిలిన యాంటీబయాటిక్ డోసు ఇప్పటికే ఇస్తే ఏం చేయాలి?

వీలైనంత త్వరగా డాక్టర్‌తో మాట్లాడి, పిల్లలకు ఏ యాంటీబయాటిక్ ఇచ్చారో చెప్పాలని డాక్టర్ చోఖానీ సూచించారు. "వ్యాధి లక్షణాలకు సంబంధించిన ఆధారాలు మరుగున పడకముందే లేదా కనిపించకుండా పోకముందే తల్లిదండ్రులు త్వరగా డాక్టర్‌ను సంప్రదించాలి. అప్పుడే పిల్లలకు నిజంగా యాంటీబయాటిక్ అవసరమా, ఏది ఇవ్వాలి, ఎంతకాలం ఇవ్వాలి అనేది డాక్టర్ నిర్ణయించగలరు" అని ఆయన పేర్కొన్నారు.

గత అనారోగ్యానికి సంబంధించిన మిగిలిన యాంటీబయాటిక్స్‌ను పిల్లలకు ఇవ్వొద్దని ఆ పీడియాట్రిషియన్ గట్టిగా హెచ్చరించారు. గతంలో వచ్చినట్లే జ్వరం, దగ్గు లేదా గొంతు నొప్పి కనిపించినా, ఈసారి కారణం వేరే అయి ఉండొచ్చని చెప్పారు. చాలా జ్వరాలు, గొంతు నొప్పులకు యాంటీబయాటిక్స్ అవసరం లేదని కూడా గుర్తుచేశారు.

పిల్లలకు జ్వరం ఎంత తీవ్రంగా ఉంది, జ్వరం తగ్గించే మందులకు ఎలా స్పందిస్తోంది, దగ్గు లేదా గొంతు నొప్పి వంటి ఇతర లక్షణాలు ఉన్నాయా అనే అంశాలను డాక్టర్ పరిగణనలోకి తీసుకుంటారు. పిల్లలను పరీక్షించిన తర్వాతే యాంటీబయాటిక్ రాయాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటారు.

ABOUT THE AUTHOR

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.