గుండెపోటు కాదిది.. అంతకంటే ముప్పు.. 'అయోర్టిక్ డిసెక్షన్' హెచ్చరిక సంకేతాలివే
గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ గురించి అందరూ వింటుంటారు. కానీ వాటికంటే ప్రమాదకరమైన 'అయోర్టిక్ డిసెక్షన్' వ్యాధిపై సరైన అవగాహన లేదు. దీనిపై హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ జగదేష్ మాదిరెడ్డి హెచ్‌టీ తెలుగు పాఠకులకు సమగ్రంగా వివరించారు.
హార్ట్ ఎటాక్ (గుండెపోటు), కార్డియాక్ అరెస్ట్ గురించి అందరూ తరచూ వింటూనే ఉంటారు. అయితే గుండె ఆరోగ్యానికి సంబంధించి వీటి కంటే ఎంతో ప్రమాదకరమైన, అత్యంత అరుదైన మరొక ప్రాణాంతక పరిస్థితి 'అయోర్టిక్ డిసెక్షన్' (Aortic Dissection). దీని బారినపడినప్పుడు ప్రతి నిమిషం ఎంతో విలువైనది. సరైన సమయంలో గుర్తించకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది.

అసలు ఏమిటీ అయోర్టిక్ డిసెక్షన్?
మన శరీరంలోని వివిధ అవయవాలకు రక్తాన్ని చేరవేసే అతిపెద్ద ప్రధాన ధమని 'అయోర్టా' (మహాధమని). దీని గోడలు మూడు పొరలుగా నిర్మితమై ఉంటాయి. మహాధమని లోపలి పొరలో సన్నని గీత లేదా దెబ్బ (Tear) ఏర్పడినప్పుడు, రక్త ప్రవాహ ఒత్తిడికి ఆ పొరలు ఒకదానికొకటి విడిపోతాయి. దీన్నే 'అయోర్టిక్ డిసెక్షన్' అంటారు. ఒకవేళ బయటి పొర కూడా పగిలిపోతే హఠాత్తుగా కార్డియాక్ అరెస్ట్ సంభవించి క్షణాల్లో ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. సాధారణంగా 60 నుంచి 70 ఏళ్ల వయసున్న పురుషులలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. అయితే జన్యుపరమైన లోపాలు, గుండె సమస్యలు ఉన్న ఇతర వయస్కులలోనూ ఇది వచ్చే అవకాశం ఉంది.
వ్యాధి నిర్ధారణ ఎందుకు ఆలస్యమవుతోంది?
అయోర్టిక్ డిసెక్షన్ లక్షణాలు దాదాపు సాధారణ గుండెపోటును పోలి ఉంటాయి. దాంతో చాలామంది దీనిని సాధారణ గుండెపోటుగా భావించి పొరబడతారు. ఈ పొరపాటే వ్యాధి నిర్ధారణను తీవ్రంగా ఆలస్యం చేస్తుంది. ఎంత త్వరగా ఈ సమస్యను గుర్తించి చికిత్స అందిస్తే, ప్రాణాలతో బయటపడే అవకాశాలు అంతగా పెరుగుతాయి.
ప్రధాన హెచ్చరిక సంకేతాలు
ఈ సమస్య బారినపడిన వారిలో అకస్మాత్తుగా లక్షణాలు బయటపడతాయి.
- ఛాతీ లేదా వీపు ఎగువ భాగంలో శరీరం చీలిపోతున్నంత తీవ్రమైన నొప్పులు రావడం.
- ఈ నొప్పి వీపు వెనుక భాగానికి క్రమంగా వ్యాపించడం.
- ఉన్నట్టుండి కడుపులో భరించలేని నొప్పి రావడం.
- తీవ్రమైన ఆయాసం, ఊపిరి ఆడకపోవడం.
- అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోవడం.
- పక్షవాతం లక్షణాలు — అకస్మాత్తుగా చూపు మందగించడం, మాట్లాడటంలో ఇబ్బంది, శరీరం ఒకవైపు బలహీనపడటం.
- కాళ్ల నొప్పులు లేదా నడవడంలో తీవ్రమైన ఇబ్బంది ఏర్పడటం.
ఈ లక్షణాలు, ముఖ్యంగా ఛాతీ లేదా కడుపులో తీవ్రమైన నొప్పి కనిపిస్తే క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే అత్యవసర వైద్య సేవలను ఆశ్రయించాలి.
ముప్పును పెంచే ప్రమాద కారకాలు
అయోర్టిక్ డిసెక్షన్ ముప్పును పెంచడంలో కొన్ని ఆరోగ్య సమస్యలు ప్రధాన పాత్ర పోషిస్తాయి.
- అధిక రక్తపోటు (High BP): ఇది ఈ వ్యాధికి అత్యంత ప్రధానమైన కారణం.
- ధమనుల గోడలలో కొవ్వు, కొలెస్ట్రాల్ పేరుకుపోవడం.
- మహాధమనిలో వాపు లేదా బలహీనమైన భాగాలు (Aneurysm) ఉండటం.
- జన్యుపరమైన లోపాలు, బంధక కణజాల (Connective tissue) సమస్యలు.
- పొగతాగే అలవాటు.
- 60 ఏళ్లు పైబడిన వయసు.
- హఠాత్తుగా బీపీని పెంచే బరువులు ఎత్తడం లేదా తీవ్రమైన కాయకష్టం చేయడం.
చికిత్స, నివారణ మార్గాలు
మహాధమనిలో ఏ భాగానికి నష్టం జరిగిందనే అంశంపై ఆధారపడి వైద్యులు చికిత్స అందిస్తారు. కొన్ని తీవ్రమైన కేసుల్లో అత్యవసర శస్త్రచికిత్స (Surgery) లేదా స్టెంటింగ్ వేయాల్సి రావచ్చు. మరికొన్ని సందర్భాల్లో రక్తపోటును తగ్గించే మందులు, నిరంతర పరిశీలన ద్వారా నయం చేయవచ్చు. ఏది ఏమైనప్పటికీ రక్తపోటును అదుపులో ఉంచుకోవడమే ఈ సమస్య చికిత్సలో అత్యంత ముఖ్యం.
- ఈ సమస్యను పూర్తిగా నివారించలేకపోయినా, కొన్ని జాగ్రత్తల ద్వారా ముప్పును తగ్గించుకోవచ్చు.
- రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్‌ను ఎప్పటికప్పుడు నియంత్రణలో ఉంచుకోవాలి.
- పొగతాగడం తక్షణమే మానెయ్యాలి.
- ఉప్పు తక్కువగా ఉండే, గుండెకు మేలు చేసే సమతుల్యాహారాన్ని తీసుకోవాలి.
- క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
- తగినంత నిద్రపోవాలి.
- వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా సీట్‌బెల్ట్ ధరించాలి.
అయోర్టిక్ డిసెక్షన్ అరుదైనదే అయినప్పటికీ, సకాలంలో స్పందించడం వల్ల ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఛాతీ లేదా వీపు నొప్పిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు.
వ్యాసకర్త:
- డాక్టర్ జగదేష్ మాదిరెడ్డి,
కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్,
యశోద హాస్పిటల్స్, హైదరాబాద్

ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


