సాధారణ వెన్నునొప్పి నరాల సమస్యగా మారే ప్రమాదం ఉందా? నిపుణుల హెచ్చరిక

సాధారణ వెన్నునొప్పి అనుకుని నిర్లక్ష్యం చేస్తే నరాలు శాశ్వతంగా దెబ్బతినే ముప్పుంది. వెన్నుపాము, నరాల నొప్పి లక్షణాలు, అత్యవసర వైద్యం ఎప్పుడు అవసరమనే అంశాలపై హైదరాబాద్ గ్లెనెగల్స్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరోలాజిస్ట్ డాక్టర్ ఎ. అవినాష్ కుమార్ అద్దోజు తెలిపిన వివరాలు ఇవే.

Published on: Oct 16, 2026, 15:05:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

రోజంతా కూర్చుని పనిచేయడం, తప్పుడు భంగిమలో వంగడం లేదా కండరాలు పట్టేయడం వల్ల సాధారణ వెన్నునొప్పి రావడం సహజం. విశ్రాంతి తీసుకుంటే చాలావరకు ఇది తగ్గుతుంది. అయితే వెన్నుపాము కేవలం శరీరానికి ఆధారంగా మాత్రమే ఉండదు.. మెదడు నుంచి శరీరంలోని ఇతర భాగాలకు సమాచారాన్ని చేరవేసే వెన్నుపాము, నాడీ వ్యవస్థకు అది రక్షణ కవచంగా పనిచేస్తుంది. డిస్క్ సమస్యలు, వయసు పెరగడం వల్ల వచ్చే మార్పులు లేదా వెన్నుపాము మార్గం (స్పైనల్ కెనాల్) సన్నబడటం వల్ల ఈ నరాలపై ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడు ఈ సమస్య కేవలం ఎముకలు లేదా కండరాల నొప్పిగా కాకుండా తీవ్రమైన నరాల (న్యూరోలాజికల్) సమస్యగా మారుతుంది.

సాధారణ వెన్నునొప్పి నరాల సమస్యగా మారే ప్రమాదం ఉందా? నిపుణుల హెచ్చరిక
సాధారణ వెన్నునొప్పి నరాల సమస్యగా మారే ప్రమాదం ఉందా? నిపుణుల హెచ్చరిక

వెన్నుపాము సమస్యలు నరాలపై ఎలా ప్రభావం చూపుతాయి?

మెదడు పుర్రె అడుగు భాగం నుంచి మొదలయ్యే వెన్నుపాము, వెన్నుపూసల మధ్యలోని ఖాళీ మార్గం ద్వారా నడుము భాగంలోని మొదటి లేదా రెండు వెన్నుపూసల (ఎల్1/ఎల్2) వరకు పొడవునా ఉంటుంది. దాని కింద భాగం నుంచి నరాల వేళ్లు కొనసాగుతూ వెన్నుపూసల మధ్య ఉండే రంధ్రాల ద్వారా వెలుపలికి వస్తాయి. డిస్క్ బల్జ్ (Herniated Disc), ఎముకల పెరుగుదల (Bone Spurs), లిగమెంట్లు మందం కావడం, వెన్నుపూస జారడం లేదా దెబ్బతగలడం వల్ల ఈ ఖాళీ ప్రదేశం సన్నబడుతుంది. కొన్ని అరుదైన సందర్భాల్లో ట్యూమర్లు, ఇన్ఫెక్షన్లు కూడా వెన్నుపాము, నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి.

నరాలపై ఒత్తిడి పడటాన్ని 'రాడిక్యులోపతీ' అంటారు. దీనివల్ల ఆ నరం సరఫరా చేసే భాగంలో తీవ్రమైన నొప్పి, తిమ్మిర్లు, సూదులతో గుచ్చినట్లు అనిపించడం, బలహీనత వంటివి కనిపిస్తాయి. అదే మెడ లేదా వీపు పైభాగంలో నేరుగా వెన్నుపాముపై ఒత్తిడి పడితే దానిని 'మైలోపతీ' అంటారు. దీనివల్ల చేతి వేళ్ల కదలికలు మందగించడం, కాళ్ల బలహీనత, నడకలో తూలడం, చివరకు మూత్రాశయం, పేగుల నియంత్రణ కోల్పోవడం వంటి తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి.

సాధారణ నొప్పి కాదని చెప్పే ముందస్తు హెచ్చరికలు

నరాలపై ఒత్తిడి పడినప్పుడు ప్రారంభంలో లక్షణాలు చాలా స్వల్పంగా ఉండి, వయసు పెరగడం వల్లో లేదా అలసట వల్లో అని పొరబడే అవకాశం ఉంది. ఈ కింది లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం కావాలి.

శరీరంలో పాకే నొప్పి: మెడ నుంచి చేతిలోకి లేదా నడుము నుంచి పిరుదుల మీదుగా కాలు కిందికి (సయాటికా) విద్యుత్ షాక్ కొట్టినట్లు, మంటతో కూడిన నొప్పి రావడం.

తిమ్మిర్లు, సూదులు గుచ్చినట్లు ఉండటం: చేతులు, వేళ్లు, పాదాలు లేదా కాలి వేళ్లలో నిరంతరం తిమ్మిర్లు లేదా సూదులు గుచ్చినట్లు అనిపించడం.

బలహీనత, చేతి కదలికల్లో ఇబ్బంది: చేతిలో ఉన్న వస్తువులు జారిపోవడం, చొక్కా గుండీలు పెట్టుకోవడం లేదా రాయడం కష్టంగా మారడం, నడిచేటప్పుడు పాదం కింద పడిపోవడం లేదా ఈడ్చుకెళ్లడం (ఫుట్ డ్రాప్).

నడిచేటప్పుడు కాళ్లు బరువుగా అనిపించడం: కొద్ది దూరం నడవగానే కాళ్లలో తీవ్రమైన నొప్పి లేదా తిమ్మిరి వచ్చి, కూర్చున్నప్పుడు లేదా ముందుకూ వంగినప్పుడు ఉపశమనం లభించడం (లంబార్ స్పైనల్ స్టెనోసిస్ లక్షణం).

శరీర సమతుల్యత దెబ్బతినడం: నిలకడగా నడవలేకపోవడం, కాళ్లు బిగుసుకుపోవడం, తిన్నని వరుసలో అడుగులు వేయలేకపోవడం (ఇది మెడ భాగంలో వెన్నుపాము నొక్కుకుపోవడానికి సంకేతం).

సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోకపోతే సుదీర్ఘకాలం పాటు నరాలు నొక్కుకుపోయి శాశ్వత నాడీ వ్యవస్థ నష్టం జరగొచ్చు.

అత్యవసర వైద్యం ఎప్పుడు అవసరం?

ఈ కింది రెడ్ ఫ్లాగ్ (ప్రమాదకర) లక్షణాలు కనిపిస్తే సమయం వృథా చేయకుండా వెంటనే అత్యవసర వైద్య సేవలను ఆశ్రయించాలి.

  • మూత్రం రాకపోవడం లేదా మూత్రాశయం, పేగుల నియంత్రణ పూర్తిగా కోల్పోవడం.
  • తొడల లోపలి భాగం, జననాంగాలు, పిరుదుల ప్రాంతంలో స్పర్శ కోల్పోవడం (సాడిల్ అనస్థీషియా).
  • ఒక కాలు లేదా రెండు కాళ్లలో వేగంగా బలహీనత పెరగడం.
  • వెన్నునొప్పితో పాటు జ్వరం రావడం, హఠాత్తుగా బరువు తగ్గడం లేదా క్యాన్సర్ చరిత్ర ఉండటం.
  • ఏదైనా తీవ్రమైన ప్రమాదం లేదా దెబ్బ తగిలిన తర్వాత తీవ్రమైన వెన్నునొప్పి రావడం.

నడుము కింది భాగంలోని నరాల సమూహంపై తీవ్ర ఒత్తిడి పడితే దానిని 'కాడా ఈక్వినా సిండ్రోమ్' అంటారు. ఇది తక్షణమే శస్త్రచికిత్స చేయాల్సిన అత్యవసర పరిస్థితి. వికలాంగులుగా మారే ప్రమాదాన్ని తగ్గించాలంటే తక్షణమే డికంప్రెషన్ సర్జరీ చేయడం చాలా ముఖ్యం.

నరాల సమస్యలను ఎలా నిర్ధారిస్తారు?

వైద్యులు రోగి ఆరోగ్య చరిత్రను, నాడీ వ్యవస్థ పనితీరును (న్యూరోలాజికల్ పరీక్ష) నిశితంగా పరిశీలిస్తారు. కండరాల బలం, రిఫ్లెక్స్‌లు, స్పర్శ, నడిచే తీరు ఆధారంగా ఏ భాగంలో సమస్య ఉందో గుర్తిస్తారు. డిస్క్‌లు, నరాల వేళ్లు, వెన్నుపాము స్పష్టమైన రూపాన్ని చూడటానికి 'ఎంఆర్‌ఐ' స్కాన్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

డయాబెటిక్ న్యూరోపతీ, కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ వంటి ఇతర సమస్యల నుంచి వెన్నుపాము సమస్యలను వేరు చేసి చూడటానికి నరాల పనితీరు పరీక్షలు (Nerve Conduction Studies), ఎలక్ట్రోమైయోగ్రఫీ (EMG) దోహదపడతాయి. అయితే ఎంఆర్‌ఐ నివేదికను రోగి లక్షణాలతో సరిపోల్చి చూడటం ముఖ్యం. ఎందుకంటే ఎటువంటి నొప్పి లేని వారి ఎంఆర్‌ఐలలో కూడా డిస్క్ బల్జ్, వయసుతో వచ్చే సాధారణ మార్పులు కనిపిస్తాయి. కేవలం స్కాన్ రిపోర్ట్ ఆధారంగానే ముగింపునకు రాకూడదు.

చికిత్స విధానాలు: ఫిజియోథెరపీనా? శస్త్రచికిత్సనా?

రాడిక్యులోపతీ ఎదుర్కొంటున్న మెజారిటీ బాధితులకు శస్త్రచికిత్స లేకుండానే నయం చేయవచ్చు. తేలికపాటి శారీరక చురుకుదనం, ఫిజియోథెరపీ, పరిమిత కాలం పాటు వాడే నొప్పి నివారణ మందులు, నరాల నొప్పిని తగ్గించే ఔషధాలు ఫలితాన్నిస్తాయి. అవసరమైన వారికి ఇమేజ్-గైడెడ్ ఎపిడ్యూరల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇస్తారు.

అయితే కాళ్లలో బలహీనత పెరుగుతున్నప్పుడు, వెన్నుపాముపై తీవ్ర ఒత్తిడి ఉన్నప్పుడు, కాడా ఈక్వినా సిండ్రోమ్ అనుమానం ఉన్నప్పుడు లేదా ఇతర చికిత్సల వల్ల నొప్పి తగ్గనప్పుడు మాత్రమే శస్త్రచికిత్స అవసరమవుతుంది. ఒత్తిడికి గురైన నరాలకు విముక్తి కలిగించి, నరాలు మరింత దెబ్బతినకుండా చూడటమే ఈ సర్జరీ ముఖ్య ఉద్దేశం.

సాధారణ వెన్నునొప్పి గురించి భయపడాల్సిన పనిలేదు. కానీ దాంతో పాటు తిమ్మిర్లు, బలహీనత, సమతుల్యత కోల్పోవడం, నడవడంలో ఇబ్బంది లేదా మూత్ర, మల విసర్జన నియంత్రణ తప్పడం వంటి లక్షణాలు కనిపిస్తే అస్సలు అలక్ష్యం చేయకూడదు. ప్రారంభంలోనే న్యూరోలాజికల్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా సరైన చికిత్స పొంది, నరాలు శాశ్వతంగా దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు.

వ్యాసకర్త:

డాక్టర్ ఎ.అవినాష్ కుమార్ అద్దోజు,

సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్,

గ్లెనెగల్స్ హాస్పిటల్, ఫోర్టిస్ నెట్‌వర్క్,

లక్డీకాపూల్, హైదరాబాద్

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More