వెన్నునొప్పితో నిద్ర సరిగ్గా పట్టట్లేదా? వయోధికులు తెలుసుకోవాల్సిన ముఖ్యాంశాలు
వయోధికులలో వచ్చే వెన్నునొప్పిని కేవలం వయసు పైబడటం వల్ల వచ్చే సాధారణ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయకూడదని హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దశరథ రామిరెడ్డి తేతలి స్పష్టం చేశారు. దీనిపై సమగ్ర వివరాలు డాక్టర్ గారి మాటల్లోనే చదవండి.
వయోధికులలో ఎక్కువగా కనిపించే సమస్యల్లో వెన్నునొప్పి ఒకటి. అయితే దీనిని వయసు పెరగడం వల్ల వచ్చే సహజమైన సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలిక వెన్నునొప్పి కేవలం కదలికలను మాత్రమే కాకుండా, రాత్రి వేళల్లో నిద్రను తీవ్రంగా భంగపరుస్తుంది. సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల నొప్పి మరింత ఎక్కువవడం, దానివల్ల నిద్ర మరింత దూరం కావడం వంటి విషవలయంలో వయోధికులు చిక్కుకుంటారు. దీనివల్ల వారి రోజువారీ పనులు, శారీరక స్వయం సమృద్ధి, జీవన ప్రమాణాలు దెబ్బతింటాయి.

దీర్ఘకాలిక వెన్నునొప్పితో బాధపడే వయోధికులు నిద్రలేమి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కాబట్టి ఈ సమస్యను ప్రారంభంలోనే గుర్తించి చికిత్స తీసుకోవడం ఎంతో ముఖ్యం.
నిద్ర, వెన్నునొప్పి మధ్య సంబంధం
శరీరంలో తలెత్తే వెన్నునొప్పే నిద్రలేమికి ప్రధాన కారణమవుతుంది. వెన్నునొప్పితో బాధపడే వయోధికులలో ఈ క్రింది సమస్యలు కనిపిస్తుంటాయి:
- త్వరగా నిద్ర పట్టకపోవడం
- రాత్రి వేళల్లో పదే పదే మెలకువ రావడం
- గాఢ నిద్ర లేకపోవడం, నిద్రపోయినా రీఫ్రెషింగ్‌గా అనిపించకపోవడం
- పగటిపూట నీరసం, అలసట, శక్తి లేనట్లు అనిపించడం
- శరీరం తనను తాను పునరుజ్జీవింపజేసుకోవడానికి, కణజాలాల పునరుద్ధరణకు (Tissue Repair) సరైన నిద్ర ఎంతగానో అవసరం.
రాత్రి వేళల్లో వెన్నునొప్పి ఎందుకు ఎక్కువవుతుంది?
పగటిపూట కంటే రాత్రి పడుకున్న సమయంలో వెన్నునొప్పి ఎక్కువగా అనిపించడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి.
- రోజంతా శ్రమించడం వల్ల కండరాల్లో బిగుతు (Stiffness) ఏర్పడటం
- వెన్నెముక వశ్యత (Flexibility) తగ్గడం
- నేరుగా పడుకున్నప్పుడు నరాలు ఒత్తిడికి గురికావడం మరియు కండరాల తిమ్మిర్లు/నొప్పులు స్పష్టంగా తెలియడం
- ఈ రకమైన అసౌకర్యం వల్ల లభించాల్సిన గాఢ నిద్ర (Deep Sleep) కరువవుతుంది.
నిద్రలేమితో ఆరోగ్యానికి జరిగే ముప్పు
నొప్పి, నిద్ర ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. సుదీర్ఘకాలం పాటు నిద్ర లేకపోవడం వల్ల శరీరంపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు పడతాయి.
- నొప్పిని తట్టుకునే శక్తి తగ్గిపోవడం (Increased pain sensitivity)
- కండరాలు, కీళ్ల గాయాలు నెమ్మదిగా మానడం
- శరీర సమతుల్యత దెబ్బతిని కిందపడిపోయే ప్రమాదం పెరగడం
- జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మందగించడం
- మానసిక ఒత్తిడి, మూడ్ స్వింగ్స్ పెరిగి రోగనిరోధక శక్తి తగ్గడం
వయోధికులలో ఎముకల ఆరోగ్యం, కండరాల బలం, సమతుల్యత, జ్ఞాపకశక్తి మరియు మొత్తం శారీరక క్షేమానికి తగినంత నిద్ర అత్యంత అవసరం. వెన్నునొప్పికి ప్రారంభంలోనే సరైన చికిత్స తీసుకోవడం వల్ల కదలికలు సులువవుతాయి, మంచి నిద్ర లభిస్తుంది. తద్వారా వయోధికులు ఇతరులపై ఆధారపడకుండా చురుగ్గా, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు.
వెన్నునొప్పి, నిద్రలేమి చక్రానికి చెక్ పెట్టండిలా
వెన్నునొప్పికి గల మూల కారణాలను గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా వెన్నుముక ఆరోగ్యాన్ని, నిద్ర నాణ్యతను కాపాడుకోవచ్చు. వెన్నుముక ఆకృతిలో మార్పులు, బలహీనమైన కోర్ కండరాలు, చెడు భంగిమలు (Bad Posture), లేదా వయసుతో వచ్చే క్షీణత వల్ల ఈ నొప్పి రావచ్చు. దీనిని అధిగమించేందుకు కొన్ని కీలక సూచనలు:
- క్రమం తప్పకుండా వ్యాయామం: రోజూ ఫిజియోథెరపీ, స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం.
- కండరాల దృఢత్వం: వెన్ను, కోర్ కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు ఎంచుకోవడం.
- సరైన భంగిమ: కూర్చునేటప్పుడు, నడిచేటప్పుడు, పడుకునేటప్పుడు సరైన భంగిమను పాటించడం.
- ఆరోగ్యకరమైన బరువు: శరీర బరువును అదుపులో ఉంచుకోవడం.
- వైద్యుల సలహా మేరకు మందులు: నొప్పులు తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్ సూచించిన పెయిన్ కిల్లర్స్ మాత్రమే వాడటం.
- చురుకైన జీవనశైలి: ఎక్కువ సేపు పడకకే పరిమితం కాకుండా, రోజూ చురుగ్గా ఉండటానికి ప్రయత్నించడం.
వ్యాసకర్త:
- డాక్టర్ దశరథ రామిరెడ్డి తేతలి,
సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్,
యశోద హాస్పిటల్స్, హైదరాబాద్
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


