ఏడాదిన్నర నిరుద్యోగం.. క్యాబ్ డ్రైవర్‌గా మారిన బెంగుళూరు వ్యక్తి కథ ఇదీ
బెంగుళూరులో నిరుద్యోగం, అప్పుల బాధతో క్యాబ్ డ్రైవర్‌గా మారిన ఒక వ్యక్తి తన రోజువారీ కష్టాలను రెడ్డిట్ (Reddit) వేదికగా పంచుకున్నారు. 16 గంటల కఠిన శ్రమ, ట్రాఫిక్ ఇబ్బందులు, యాప్ ఒత్తిడి మధ్య సాగుతున్న అతని జీవిత పోరాటం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
సాంకేతిక నగరంగా పేరుగాంచిన బెంగుళూరులో ఒక పక్క సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల కోలాహలం కనిపిస్తుంటే, మరోపక్క బతుకు బండిని లాగడానికి సగటు మనిషి పడుతున్న కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. సుమారు ఏడాదిన్నర పాటు నిరుద్యోగంతో కుదేలై, చివరకు క్యాబ్ డ్రైవర్‌గా మారిన ఒక వ్యక్తి తన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకోగా, అది ఇప్పుడు వైరల్‌గా మారింది.

వ్యాపారం దెబ్బతిని.. అప్పుల ఊబిలో చిక్కుకుని..
రెడ్డిట్ వేదికగా ఆ వ్యక్తి తన గోడును వెళ్లగక్కారు. “దాదాపు 1.5 ఏళ్ల పాటు నిరుద్యోగిగా ఉన్నాను. మధ్యలో ఒక వ్యాపారం మొదలుపెట్టి చేతులు కాల్చుకున్నాను. లోన్లు, క్రెడిట్ కార్డు అప్పులు కొండలా పెరిగిపోయాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాలేదు. దీంతో గత నెలలో రోజుకు రూ. 1500 అద్దెకు ఒక కారు తీసుకుని క్యాబ్ నడపడం ప్రారంభించాను” అని ఆయన తన గతాన్ని గుర్తు చేసుకున్నారు.
సంపాదన రూ. 4000.. మిగిలేది మాత్రం రూ. 1000
ఉబర్, రాపిడో వంటి ప్లాట్‌ఫామ్‌లలో రోజుకు దాదాపు 16 గంటల పాటు ఆయన డ్యూటీ చేస్తున్నారు. తన సంపాదన లెక్కలను వివరిస్తూ.. “రోజుకు రూ. 4,000 వరకు సంపాదిస్తాను. అందులో రూ. 1,500 కారు అద్దెకు, రూ. 1,200 సీఎన్‌జీ (CNG) గ్యాస్‌కు, మరో రూ. 200 భోజనానికి పోతాయి. చివరకు చేతికి మిగిలేది కేవలం రూ. 1,000 మాత్రమే. బెంగుళూరు ట్రాఫిక్‌లో 16 గంటలు స్టీరింగ్ పట్టుకోవడం చాలా నరకప్రాయంగా ఉంది” అని ఆవేదన వ్యక్తం చేశారు.
శారీరక శ్రమ.. యాప్‌ల ఒత్తిడి
కేవలం ఆర్థిక ఇబ్బందులే కాకుండా, శారీరక సమస్యలు కూడా ఆయన్ని వేధిస్తున్నాయి. రోజుకు కేవలం 6 గంటలే నిద్రపోతూ, మిగిలిన సమయమంతా రోడ్డుపైనే గడుపుతుండటంతో మోకాళ్ల నొప్పులు వస్తున్నాయని చెప్పారు.
“యాప్‌లు ఒక రాక్షసుడిలా తయారయ్యాయి. ఇండియాలో ఇదొక గాడిద చాకిరీలా మారిపోయింది. ఆర్డర్ వచ్చిన 5-6 సెకన్లలోనే యాక్సెప్ట్ చేయాలి, లేదంటే రేటింగ్ తగ్గిపోతుంది. కోట్లాది మంది భారతీయుల వాస్తవికత ఇది. ఎదుటివారికి సౌకర్యం కలగడానికి మనలాంటి వాళ్లు చౌక కార్మికులుగా మిగిలిపోతున్నారు. దోపిడీ చేసేవాడిగా అన్నా ఉండాలి లేదా దోపిడీకి గురయ్యే వాడిగా అన్నా మిగలాలి. అసలు ఇది ఒక జీవితమేనా?” అని ఆయన ప్రశ్నించారు.
నెటిజన్ల స్పందన
ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆ డ్రైవర్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. “ఇది చాలా కష్టమైన పని. కచ్చితంగా మీకు మంచి రోజులు వస్తాయి, ధైర్యంగా ఉండండి” అని ఒక యూజర్ కామెంట్ చేశారు.
“మనం క్యాబ్ డ్రైవర్లను చాలా తేలికగా తీసుకుంటాం. ఈ పోస్ట్ చదివాక వారి వెనుక ఉన్న మానసిక, శారీరక వేదన అర్థమవుతోంది” అని మరొకరు పేర్కొన్నారు.
“డ్రైవర్లు ఎందుకు అంత కోపంగా ఉంటారో, ట్రాఫిక్ నిబంధనలు ఎందుకు అతిక్రమిస్తారో ఇప్పుడు అర్థమవుతోంది. వారు అనుభవిస్తున్న కష్టాలే వారిని అలా మారుస్తున్నాయి” అని మరో యూజర్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
జీవన పోరాటంలో అలుపెరగని శ్రమ చేస్తున్న అసంఘటిత రంగ కార్మికుల దీనస్థితికి ఈ డ్రైవర్ గాథ ఒక నిదర్శనం.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


