షనేల్ (Chanel) షోలో రాయ్‌పూర్ యువతి భూమికా యాదవ్.. రికార్డు సృష్టించిన 19 ఏళ్ల మోడల్
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 19 ఏళ్ల భూమికా యాదవ్ షనేల్ బ్రాండ్‌కు ర్యాంప్ వాక్ చేసిన అతి పిన్న వయస్కురాలైన భారతీయ మోడల్‌గా రికార్డు సృష్టించారు. రంగు వివక్షను ఎదిరించి ఆమె సాధించిన విజయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
కేవలం 19 ఏళ్ల వయసులోనే ప్రపంచ ఫ్యాషన్ రాజధాని పారిస్‌లో తనదైన ముద్ర వేశారు భూమికా యాదవ్. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌కు చెందిన ఈ యువతి, అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్ 'షనేల్' (Chanel) కోసం ర్యాంప్ వాక్ చేసిన అతి పిన్న వయస్కురాలైన భారతీయ మోడల్‌గా చరిత్ర సృష్టించారు. మన దేశంలో ఇప్పటికీ కొనసాగుతున్న తెల్లటి రంగు పిచ్చికి, పాతకాలపు సౌందర్య ప్రమాణాలకు సవాల్ విసురుతూ ఆమె గ్లోబల్ వేదికలపై దూసుకుపోతున్నారు.

గత ఏడాది డిసెంబర్‌లో న్యూయార్క్ సిటీలో జరిగిన షనేల్ షోను మన తెలుగు అమ్మాయి భవిత మండవ ప్రారంభించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ సంచలనం ఇంకా కొనసాగుతుండగానే, ఇప్పుడు రాయ్‌పూర్ నుంచి మరో నల్లటి రత్నం అంతర్జాతీయ వేదికపై వెలుగులు విరజిమ్ముతోంది.
రాయ్‌పూర్ వీధుల నుంచి పారిస్ రన్‌వే వరకు..
సాధారణంగా ఫ్యాషన్ ప్రపంచంలోకి రావాలంటే పెద్ద పెద్ద నగరాలు, మెట్రో లైఫ్‌స్టైల్ అవసరమనే భావన ఉంటుంది. కానీ భూమిక కథ వేరు. ఆమెను ఏ మోడలింగ్ ఏజెన్సీ కూడా పెద్ద ఆఫీసుల్లో కూర్చుని గుర్తించలేదు. రాయ్‌పూర్ వీధుల్లో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడే ఆమెలోని ప్రతిభను గుర్తించారు. ఆ క్షణం నుంచి మొదలైన ఆమె ప్రయాణం భారతదేశంలో పాతుకుపోయిన పాతకాలపు అందాల కొలతలను నేరుగా ప్రశ్నించింది.
భూమికా ప్రయాణానికి సంబంధించిన ఆసక్తికర వివరాలను ఏప్రిల్ 2న ‘నింజాస్ మోడల్ మేనేజ్‌మెంట్’ (Nninjas Model Management) అనే ఏజెన్సీ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పంచుకుంది. భూమికా 2006 జనవరి 27న జన్మించారని, ఆమె కుటుంబ మూలాలు బిహార్‌లో ఉన్నాయని ఆ సంస్థ తెలిపింది.
"భూమికా యాదవ్‌ను తన సొంత ఊరి వీధుల్లోనే గుర్తించాం. భారతదేశంలో గాఢంగా నాటుకుపోయిన పాత సౌందర్య నిబంధనలను సవాలు చేసేలా ఆమె ప్రయాణం సాగింది" అని ఏజెన్సీ వెల్లడించింది. అంతేకాదు, "ఆమె అద్భుతమైన డార్క్ స్కిన్ కలిగిన భారతీయ సౌందర్యం. మన దేశంలో ఎక్కువ మంది ఈ రంగులోనే ఉన్నప్పటికీ, నల్లగా ఉన్నారంటూ సమాజం ఇంకా అన్యాయంగా చిన్నచూపు చూస్తూనే ఉంది. అలాంటి చోట ఆమెను ఎగతాళిగా 'కాళి' అని పిలిచేవారు" అని ఆ సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది.
సామాజిక వివక్షను ఎదిరించి..
సమాజం నుంచి ఎదురైన ఇలాంటి అవహేళనలను భూమిక ఏమాత్రం పట్టించుకోలేదు. ఆమె కెరీర్ మెరుపు వేగంతో దూసుకుపోయింది. ఇప్పటికే ఆమె ప్రతిష్టాత్మక షనేల్ బ్రాండ్ కోసం మూడుసార్లు ర్యాంప్ వాక్ చేశారు. అలాగే అమెరికన్ వోగ్ (Vogue) మ్యాగజైన్‌తో కూడా కలిసి పనిచేశారు. ప్రస్తుతం ఆమె తన మకాంను పారిస్‌కు మార్చారు. ఫ్రాన్స్, భారత్, యూకేల మధ్య తిరుగుతూ అంతర్జాతీయ కెరీర్‌ను విజయవంతంగా బ్యాలెన్స్ చేస్తున్నారు.
విజయాలు నెత్తికెక్కని వైనం
అంతర్జాతీయ వేదికలపై ఇంతటి కీర్తి ప్రతిష్టలు దక్కినా భూమిక మాత్రం చాలా సాధారణంగా ఉండటానికే ఇష్టపడతారు. ఆమె మనస్తత్వం గురించి ఏజెన్సీ ఇన్స్టాగ్రామ్‌లో స్పందిస్తూ..
"ఆమె చాలా ఒదిగి ఉండే మనస్తత్వం ఉన్న వ్యక్తి. జీవితంలో ఎన్నో అవకాశాలు ఉంటాయని నమ్ముతుంది. ఎవరితోనూ పోటీ పడటం కానీ, అసూయ పడటం కానీ ఆమెకు అస్సలు నచ్చదు. గ్లోబల్ వేదికలపై మెరిసే ఆమెకు ఇప్పటికీ ఇష్టమైన ఆహారం కేవలం ‘పప్పు అన్నం’ మాత్రమే" అని రాసుకొచ్చింది.
ఈ అంతర్జాతీయ విజయం, వ్యక్తిగత సరళత్వం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా భారతీయ మీడియాకు సదరు ఏజెన్సీ ఒక సూటి ప్రశ్న వేసింది. "నిజమైన భారతదేశాన్ని ప్రతిబింబించే ఈ వైవిధ్యాన్ని మన మీడియా మనస్ఫూర్తిగా అంగీకరించడానికి సిద్ధంగా ఉందా? లేక ఇంకా పాతకాలపు తెల్లటి రంగు పిచ్చినే ప్రోత్సహిస్తుందా?" అని ప్రశ్నించింది.
నెటిజన్ల ప్రశంసల జల్లు
భూమిక రన్‌వేపై ఆమె నడిచిన తీరు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె కేవలం ఒక మోడల్ మాత్రమే కాదని, గ్లోబల్ వేదికపై నిజమైన భారతీయులకు ప్రతినిధి అని కొనియాడుతున్నారు.
"ఎంత అద్భుతమైన రూపం ఇది" అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. "ఆమె భారతీయ మహిళలందరికీ ఒక పెద్ద ప్రేరణ. చాలా అందంగా ఉంది" అని మరొకరు రాసుకొచ్చారు. "భారతదేశం గర్వపడేలా చేశావు. అంతర్జాతీయ లగ్జరీ ఫ్యాషన్ రంగంలో ఇలాంటి భారతీయ ప్రాతినిధ్యం ఇంకా ఎక్కువగా రావాలి" అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు.
భూమికా యాదవ్, భవిత మండవ వంటి యువతులు ఇవాళ ఫ్యాషన్ ప్రపంచంలో సరికొత్త శకానికి నాంది పలుకుతున్నారు. ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ రన్‌వేలపై ‘అసలైన భారతదేశం’ సగర్వంగా అడుగులు వేస్తోందనడానికి వీరి విజయాలే నిదర్శనం.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: భూమికా యాదవ్ ఎవరు?
జవాబు: భూమికా యాదవ్ ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన 19 ఏళ్ల భారతీయ మోడల్. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్ 'షనేల్' కోసం ర్యాంప్ వాక్ చేసిన అతి పిన్న వయస్కురాలైన భారతీయురాలిగా ఆమె గుర్తింపు పొందారు.
ప్రశ్న: ఆమె మోడలింగ్ రంగంలోకి ఎలా వచ్చారు?
జవాబు: భూమికా యాదవ్‌ను రాయ్‌పూర్ వీధుల్లో నడుస్తున్నప్పుడు 'నింజాస్ మోడల్ మేనేజ్‌మెంట్' ఏజెన్సీ ప్రతినిధులు గుర్తించారు. ఆ తర్వాత ఆమె అంతర్జాతీయ స్థాయిలో మోడల్‌గా ఎదిగారు.
ప్రశ్న: ఆమె ఇప్పటివరకు సాధించిన ప్రధాన విజయాలు ఏమిటి?
జవాబు: ఆమె ఇప్పటివరకు ప్రసిద్ధ షనేల్ బ్రాండ్ కోసం మూడుసార్లు ర్యాంప్ వాక్ చేశారు. అంతేకాకుండా అమెరికన్ వోగ్ (Vogue) మ్యాగజైన్‌తో కూడా కలిసి పనిచేశారు. ప్రస్తుతం ఆమె పారిస్‌లో ఉంటున్నారు.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


