Bittu Tabahi: నదిని శుభ్రం చేసిన యువకుడు: నెదర్లాండ్స్ సీఈఓ నుంచి నేరుగా జాబ్ ఆఫర్

మధ్యప్రదేశ్‌లోని అజ్నార్ నదిలోని ప్లాస్టిక్ వ్యర్థాలను ఒంటరిగా తొలగించి వార్తల్లో నిలిచాడు 20 ఏళ్ల సురేంద్ర సింగ్ చౌదరి అలియాస్ బిట్టు తబాహి. అతని అపరిమిత శ్రమకు ముగ్ధుడైన నెదర్లాండ్స్ పర్యావరణ సంస్థ 'ది ఓషన్ క్లీనప్' సీఈఓ బొయాన్ స్లాట్, నేరుగా తమ వద్ద పనిచేయాల్సిందిగా ఉద్యోగ ఆఫర్ ఇచ్చారు.

Published on: Sep 5, 2026, 16:01:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసం కొందరు విచిత్ర విన్యాసాలు చేస్తుంటే, మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక యువకుడు మాత్రం తన ఊరి నదిని కాపాడుకోవాలని నిశ్చయించుకున్నాడు. నెలల తరబడి ఒంటరిగా పోరాడి, చెత్తాచెదారంతో నిండిపోయిన నదిని పునరుద్ధరించాడు. ఆ యువకుడి అంకితభావానికి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ పర్యావరణ సంస్థ 'ది ఓషన్ క్లీనప్' సీఈఓ బొయాన్ స్లాట్ అతడికి నేరుగా తమ సంస్థలో పనిచేసేందుకు ఆఫర్ ఇచ్చారు.

Bittu Tabahi: నదిని శుభ్రం చేసిన యువకుడు: నెదర్లాండ్స్ సీఈఓ నుంచి జాబ్ ఆఫర్ (Instagram/@bittu_tabahi)
Bittu Tabahi: నదిని శుభ్రం చేసిన యువకుడు: నెదర్లాండ్స్ సీఈఓ నుంచి జాబ్ ఆఫర్ (Instagram/@bittu_tabahi)

మాతో కలిసి పనిచేయండి: డచ్ సీఈఓ ఆఫర్

మధ్యప్రదేశ్ రాజ్‌గఢ్ జిల్లా బియోరా ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల సురేంద్ర సింగ్ చౌదరి (బిట్టు తబాహిగా ప్రసిద్ధుడు) గత కొన్ని నెలలుగా అజ్నార్ నదిలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, నాచును తొలగిస్తూ స్వచ్ఛమైన నదిగా మార్చాడు. నది పాత, కొత్త రూపాలకు సంబంధించిన ఫోటోలను ఒక ఎక్స్ (ట్విటర్) వినియోగదారుడు సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఈ పోస్ట్ 'ది ఓషన్ క్లీనప్' సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ బొయాన్ స్లాట్ దృష్టికి వెళ్లింది. ఆ ఫోటోలను చూసి ఆశ్చర్యపోయిన స్లాట్.. "మా సంస్థలో పనిచేయడానికి వచ్చేయండి" (Come work for us) అంటూ ఆ పోస్ట్ కింద కామెంట్ చేశారు. ఈ ఊహించని ఆహ్వానంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సొంత డబ్బులతో నదికి నయా లుక్

బిట్టు తబాహి ఈ ఏడాది జనవరి నుంచి అజ్నార్ నదిని శుభ్రం చేసే పనిని ప్రారంభించాడు. ప్రతిరోజు నదిలో దిగి ప్లాస్టిక్ సీసాలు, వ్యర్థాలను తొలగిస్తూ ఆ దృశ్యాలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసేవాడు. కేవలం లైక్‌లు, వ్యూస్ కోసమే ఇదంతా చేస్తున్నాడని ప్రారంభంలో కొందరు విమర్శించినప్పటికీ అతడు వెనకడుగు వేయలేదు. ఈ శ్రమకోసం అతడు తన సొంత డబ్బు రూ. 30,000 వరకు వెచ్చించినట్లు సమాచారం.

ఆనంద్ మహీంద్రా ప్రశంసలు

బిట్టు చేస్తున్న కృషిని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సైతం గమనించి గత మార్చిలో అభినందించారు. "సామాజిక మాధ్యమాల్లో లైక్‌ల కోసం ప్రయత్నిస్తున్నా, దానివల్ల సమాజానికి మేలు జరుగుతున్నప్పుడు దాన్ని స్వాగతించాల్సిందే. బిట్టు తబాహి కృషి నాకు #MondayMotivation)" అని ఆనంద్ మహీంద్రా అప్పట్లో ఎక్స్‌లో కొనియాడారు.

ఎవరీ బొయాన్ స్లాట్?

నెదర్లాండ్స్‌కు చెందిన బొయాన్ స్లాట్ పర్యావరణ వేత్త, పరిశోధకుడు. సముద్రాల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే లక్ష్యంతో 'ది ఓషన్ క్లీనప్' అనే ఎన్జీఓను స్థాపించారు. 2040 నాటికి సముద్రాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్‌ను పూర్తిగా తొలగించడమే లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తోంది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More