మూత్రాశయ నొప్పితో బాధపడుతున్నారా? మీ ఈ అలవాట్లే కారణం కావచ్చు: డాక్టర్ ఎం.గోపీచంద్ అందిస్తున్న సమగ్ర వివరాలు
మూత్రాశయ నొప్పితో (బ్లాడర్ పెయిన్ సిండ్రోమ్) బాధపడేవారు రోజువారీ కొన్ని చిన్నపాటి పొరపాట్ల వల్ల ఆ సమస్యను మరింత తీవ్రం చేసుకుంటున్నారు. ఈ వ్యాధి లక్షణాలు, దానిని నివారించే మార్గాలను యశోద హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ ఎం. గోపీచంద్ ఇక్కడ వివరిస్తున్నారు.
మూత్రాశయంలో ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకపోయినా తీవ్రమైన నొప్పి, ఒత్తిడి, పదే పదే మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం వంటి లక్షణాలతో ఇబ్బంది పెట్టే దీర్ఘకాలిక సమస్యను 'బ్లాడర్ పెయిన్ సిండ్రోమ్' లేదా 'ఇంటర్‌స్టీషియల్ సిస్టిటిస్' (IC/BPS) అంటారు. దీని లక్షణాలు సాధారణ మూత్రనాళ ఇన్ఫెక్షన్ (UTI) లాగే ఉండటం వల్ల, చాలామంది యూరిన్ టెస్ట్ రిపోర్టులు సాధారణంగా వచ్చినప్పటికీ పదే పదే యాంటీబయాటిక్స్ వాడుతుంటారు. అయితే, మన దైనందిన జీవితంలో చేసే కొన్ని పొరపాట్లు ఈ నొప్పులను మరింత ఎక్కువ చేస్తాయి. ఈ వ్యాధిని సమర్థవంతంగా అదుపు చేయాలంటే ఆ అలవాట్లను గుర్తించడం ఎంతో అవసరం.

సమస్యను పెంచే దైనందిన అలవాట్లు
మనకు తెలియకుండానే చేసే కొన్ని చిన్న చిన్న పనులు ఈ సమస్యను మరింత జటిలం చేస్తాయి. వాటిలో కొన్ని ప్రధానాంశాలు:
మూత్రాన్ని ఆపుకోవడం: మూత్ర విసర్జన చేయాలనే భావన కలిగినప్పుడు వెళ్లకుండా ఎక్కువసేపు ఆపుకోవడం వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది లోపలి పొరలను దెబ్బతీసి, నొప్పి తీవ్రతను పెంచుతుంది.
అధిక కెఫిన్, ఆల్కహాల్: కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్, ఆల్కహాల్, సోడా వంటి పానీయాలు ఎక్కువగా తాగడం అస్సలు మంచిది కాదు. వీటిలోని కెఫిన్, యాసిడ్ గుణాలు మూత్రాశయ గోడలపై తీవ్రమైన ఇరిటేషన్ కలిగిస్తాయి.
ఆహార నియమాలు పాటించకపోవడం: టమోటాలు, సిట్రస్ పండ్లు, ఘాటైన మసాలా ఆహారాలు, చాక్లెట్లు, కృత్రిమ స్వీట్నర్లు ఈ సమస్యను ప్రేరేపిస్తాయి. ఈ ఆహారాల ప్రభావం అందరిలో ఒకేలా ఉండదు. కాబట్టి మీకు ఏ ఆహారం వల్ల నొప్పి పెరుగుతుందో స్వయంగా గుర్తించి దానికి దూరంగా ఉండాలి.
డీహైడ్రేషన్: శరీరానికి సరిపడా నీరు తాగకపోవడం వల్ల మూత్రం చిక్కగా (concentrated) మారుతుంది. దీనివల్ల మంట, తీవ్రమైన నొప్పి వస్తాయి. అలాగని అవసరానికి మించి విపరీతంగా నీళ్లు తాగినా పదే పదే మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి శరీరానికి అవసరమైన మేరకే నీరు తీసుకోవాలి.
ఒత్తిడి, శారీరక జాగ్రత్తలు
మానసిక స్థితి, శారీరక అలవాట్లు కూడా ఈ వ్యాధిపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఆ వివరాలు..
నిరంతర మానసిక ఒత్తిడి: మానసిక ఒత్తిడి నేరుగా ఈ సిండ్రోమ్‌కు కారణం కాకపోయినప్పటికీ, రోగులలో నొప్పులు హఠాత్తుగా పెరగడానికి (Flare ups) ఇది ప్రధాన ప్రేరకంగా మారుతుంది.
పెల్విక్ ఫ్లోర్ కండరాల నిర్లక్ష్యం: పొత్తికడుపు కింది భాగంలోని (పెల్విక్ ఫ్లోర్) కండరాలు బిగుసుకుపోవడం వల్ల కూడా తీవ్రమైన నొప్పి, మూత్ర సమస్యలు వస్తాయి. చాలామంది కేవలం వ్యాయామాలతోనే ఇది తగ్గుతుందని భావిస్తారు. కానీ వీరికి కండరాలను సడలించే ప్రత్యేక పద్ధతులు (Relaxation techniques), నిపుణుల పర్యవేక్షణలోని ఫిజియోథెరపీ ఎంతో మేలు చేస్తాయి.
బిగుతుగా ఉండే దుస్తులు: పొత్తికడుపు లేదా నడుము భాగంలో చాలా టైట్‌గా ఉండే దుస్తులు ధరించడం వల్ల సున్నితంగా ఉండే మూత్రాశయ భాగాలపై ఒత్తిడి పెరిగి అసౌకర్యానికి దారితీస్తుంది.
నిపుణులను ఎప్పుడు సంప్రదించాలి?
చాలామంది పదే పదే మూత్రానికి వెళ్లడం లేదా పొత్తికడుపు నొప్పిని సాధారణ ఇన్ఫెక్షన్‌గా భావించి డాక్టర్‌ను సంప్రదించడంలో ఆలస్యం చేస్తారు. అయితే, మీకు 6 వారాల కంటే ఎక్కువ కాలం పాటు మూత్రాశయ నొప్పి ఉండి, యూరిన్ కల్చర్ రిపోర్టులలో ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదని తేలితే తప్పనిసరిగా యూరాలజిస్ట్‌ను కలవాలి. దీనివల్ల అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడటాన్ని నివారించవచ్చు, సరైన చికిత్సను త్వరగా ప్రారంభించవచ్చు.
బ్లాడర్ పెయిన్ సిండ్రోమ్‌ను పూర్తిగా నయం చేయలేకపోయినా, సరైన వైద్య విధానాల ద్వారా విజయవంతంగా అదుపు చేయవచ్చు. జీవనశైలి మార్పులు, సరైన ఆహార నియమాలు, బ్లాడర్ ట్రైనింగ్, ఒత్తిడి నిర్వహణ, పెల్విక్ ఫ్లోర్ థెరపీ, అవసరమైన మందుల కలయికతో కూడిన ప్రామాణిక చికిత్స దీనికి అవసరం. తీవ్రమైన కేసులలో 'బ్లాడర్ ఇన్‌స్టిలేషన్ థెరపీ', 'నెర్వ్ స్టిమ్యులేషన్' వంటి అధునాతన చికిత్సలను సూచిస్తారు. ఇవి కేవలం నొప్పిని తగ్గించడమే కాకుండా రోగుల నిద్రను మెరుగుపరుస్తాయి, దైనందిన పనులను సులువు చేస్తాయి. ఈ రకమైన దీర్ఘకాలిక లక్షణాలను వృద్ధాప్య సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేయకూడదు. ముందస్తు నిర్ధారణ, వ్యక్తిగత చికిత్స ప్రణాళికతో మెరుగైన జీవన నాణ్యతను పొందవచ్చు.
ఆర్టికల్ రాసిన వైద్య నిపుణులు:
- డాక్టర్ ఎం. గోపీచంద్,
సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్,
యశోద హాస్పిటల్స్, హైదరాబాద్.

ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


