Alcohol : 'ఆల్కహాల్​లో ఎనర్జీ డ్రింక్స్​ కలిపి తాగితే ఉంటది…'- అని అనుకుంటే ప్రాణం పోయినట్టే..

Alcohol with enery drinks : ఇటీవలి కాలంలో ఆల్కహాల్‌తో పాటు ఎనర్జీ డ్రింక్స్‌ని కలిపి తాగడం ఫ్యాషన్‌గా మారింది. అయితే ఈ కాంబినేషన్ గుండెపై తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా, ప్రాణాంతకమైన డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. ఈ రెండింటిని మిక్స్​ చేస్తే వచ్చే అనర్థాలను ఇక్కడ వివరంగా తెలుసుకోండి.

Published on: Jun 19, 2026 2:01 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Mixing Alcohol Energy Drinks : ప్రస్తుత కాలంలో రాత్రి పూట జరిగే లేట్ నైట్ పార్టీలు, పబ్బుల్లో యువత సరికొత్త ప్రయోగాలు చేస్తోంది. తామే గొప్ప మిక్సాలజిస్టులైనట్లు భావిస్తూ.. ఒక డ్రింక్‌లో మరొకటి కలిపి కొత్త కొత్త కాంబినేషన్లను ప్రయత్నిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా చాలా మంది ఆల్కహాల్‌ (మద్యం)లో ఎనర్జీ డ్రింక్స్‌ను కలుపుకుని తాగుతుంటారు. ఇలా తాగడం వల్ల సామాజికంగా అందరితో కలిసి ఎంజాయ్ చేస్తూనే, ఎక్కువ సమయం పాటు యాక్టివ్‌గా, నిద్ర రాకుండా అలర్ట్‌గా ఉండవచ్చని వారు భావిస్తారు. అయితే, ఈ కాంబినేషన్ ఎంత ప్రమాదకరమో, శరీరానికి ఎంతటి విషంగా మారుతుందో ఒక ప్రముఖ కార్డియాలజిస్ట్ హెచ్చరిస్తున్నారు.

మద్యంలో ఎనర్జీ డ్రింక్ కలిపితే ఎంత నష్టమో తెలుసా? (Picture credit: AI generated)
మద్యంలో ఎనర్జీ డ్రింక్ కలిపితే ఎంత నష్టమో తెలుసా? (Picture credit: AI generated)

ఈ మిశ్రమాన్ని తాగిన వెంటనే శరీరంలో వచ్చే విపరీతమైన ఎనర్జీ అంతా కేవలం ఒక భ్రమ మాత్రమే అని మణిపాల్ హాస్పిటల్ (మిల్లర్స్ రోడ్) కార్డియాలజీ కన్సల్టెంట్ డాక్టర్ సునీల్ ద్వివేది వివరించారు. ఎనర్జీ డ్రింక్స్ మన నరాల వ్యవస్థను ఉత్తేజపరిచి, మనల్ని మరింత అలర్ట్‌గా ఉంచుతాయి. అదే సమయంలో ఆల్కహాల్ శరీర వేగాన్ని, మెదడు పనితీరును మందగింపజేస్తుంది. ఈ రెండింటినీ కలిపి తీసుకున్నప్పుడు, ఎనర్జీ డ్రింక్ అనేది ఆల్కహాల్ వల్ల వచ్చే మత్తు, నిద్రమత్తును ముసుగులా కప్పేస్తుంది. ఫలితంగా మీరు ఎంత మద్యం తాగినా, మత్తుగా ఉన్నప్పటికీ.. మీ శరీరం మాత్రం “నేను చాలా బాగున్నాను, నిద్ర రావడం లేదు,” అనే అబద్ధపు సంకేతాన్ని ఇస్తుంది.

అసలు ఇందులో ఉన్న ముప్పు ఏంటి?

ఈ ప్రక్రియను క్లినికల్‌గా వివరిస్తూ డాక్టర్ ద్వివేది కీలక విషయాలు చెప్పారు. “ఎనర్జీ డ్రింక్స్ నరాల వ్యవస్థను యాక్టివేట్ చేసి అప్రమత్తతను పెంచితే.. ఆల్కహాల్ మెదడు పనితీరును తగ్గించి, శరీరాన్ని రిలాక్స్ మోడ్‌లోకి తీసుకెళ్లి మత్తును కలిగిస్తుంది. ఆల్కహాల్‌తో పాటు ఇలాంటి స్టిమ్యులెంట్స్ (ఉత్తేజపరిచే పానీయాలు) తీసుకునే వ్యక్తులు, ఆల్కహాల్ ఇచ్చే మత్తును గుర్తించలేరు. దీనివల్ల తాము ఇంకా పూర్తిగా స్పృహలోనే ఉన్నామని, తమకు మత్తు ఎక్కలేదని వారు బలంగా నమ్ముతారు,” అని ఆయన పేర్కొన్నారు.

దీని తర్వాత ఏం జరుగుతుంది? తనకు మత్తు ఎక్కలేదనే భ్రమలో ఉన్న వ్యక్తి, తాను అనుకున్న పరిమాణం కంటే చాలా ఎక్కువ మొత్తంలో మద్యం తాగేస్తాడు. ఇది చివరికి ఒకేసారి పరిమితికి మించి విపరీతంగా మద్యం తాగే 'బింజ్ డ్రింకింగ్' అలవాటుకు దారితీస్తుందని డాక్టర్ ద్వివేది హెచ్చరించారు.

ప్రమాదకరమైన డీహైడ్రేషన్ లక్షణాలు..

ఈ ప్రమాదకరమైన కాంబినేషన్ వల్ల వచ్చే అతిపెద్ద ముప్పు డీహైడ్రేషన్ (శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం).

“ఆల్కహాల్ తాగడం వల్ల పదే పదే మూత్ర విసర్జన జరుగుతుంది. దీనికి తోడు ఎనర్జీ డ్రింక్స్ కూడా శరీరంలోని ద్రవాలను బయటకు పంపేలా చేస్తాయి. అదే సమయంలో, పార్టీల్లో ఎంజాయ్ చేసే మూడ్‌లో ఉండి ప్రజలు అసలు మంచి నీళ్లు తాగడం మర్చిపోతారు. ఫలితంగా శరీరం తీవ్రమైన డీహైడ్రేషన్‌కు గురవుతుంది,” అని డాక్టర్ ద్వివేది స్పష్టం చేశారు.

ఆల్కహాల్, ఎనర్జీ డ్రింక్ కలిపి తాగినప్పుడు శరీరంలో ఇటువంటి ప్రమాదకరమైన మార్పులు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు:

తీవ్రమైన డీహైడ్రేషన్, కళ్లు తిరగడం

రక్తపోటు అకస్మాత్తుగా పడిపోవడం (ముఖ్యంగా నిలబడినప్పుడు)

గుండె కొట్టుకునే వేగం విపరీతంగా పెరగడం, బీపీ ఎక్కువవడం

గుండె గుభులుమనడం, గుండె లయ తప్పడం

సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, శరీర నియంత్రణ కోల్పోవడం

రక్త సాంద్రత పెరగడం, ఇది భవిష్యత్తులో రక్తం గడ్డకట్టే సమస్యలకు దారితీస్తుంది

పరిస్థితి తీవ్రంగా మారితే, గుండె లయ తప్పుతుండటం వల్ల అకస్మాత్తుగా మెడికల్ ఎమర్జెన్సీ లేదా కార్డియాక్ అరెస్ట్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అంతేకాకుండా, ఈ అలవాటు ప్రాణాంతకమైన ప్రవర్తనలకు కూడా కారణమవుతుంది. ఒక వ్యక్తి విపరీతంగా మద్యం మత్తులో ఉన్నప్పుడు, అతని ఆలోచనా సామర్థ్యం దెబ్బతింటుంది. దీనివల్ల డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం, ప్రమాదాల బారిన పడటం లేదా రక్షణ లేని శృంగారంలో పాల్గొనడం వంటి తీవ్రమైన తప్పులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

అందుకే, ఆల్కహాల్‌లో ఎనర్జీ డ్రింక్స్‌ను కలిపి తాగే అలవాటును పూర్తిగా మానుకోవడం ఎంతైనా శ్రేయస్కరం. ఈ మిశ్రమం తాగిన తర్వాత మీరు ఎంత చురుగ్గా ఉన్నట్లు అనిపించినా, మీ శరీరంపై మద్యం ప్రభావం చూపడం లేదని అర్థం కాదు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More