లక్షణాలు లేకుండానే రొమ్ము క్యాన్సర్ గుర్తింపు సాధ్యమేనా? డాక్టర్ సమాధానం ఇదీ

రొమ్ము క్యాన్సర్ లక్షణాలు బయటపడకముందే ప్రాథమిక దశలోనే దానిని గుర్తించడం సాధ్యమేనా అంటే.. ఖచ్చితంగా సాధ్యమేనని అంటున్నారు హైదరాబాద్ ఎల్‌బీ నగర్‌లోని గ్లెనెగల్స్ అవేర్ హాస్పిటల్ (ఫోర్టిస్ హెల్త్‌కేర్ నెట్‌వర్క్) గైనకాలజీ నిపుణురాలు డాక్టర్ సంతోషిణి గౌరిశెట్టి. ప్రత్యేక విశ్లేషణ ఆమె మాటల్లోనే చదవండి.

Published on: Oct 10, 2026, 20:07:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

క్యాన్సర్ వ్యాధి బారిన పడితే శరీరంలో ఏదో ఒక లక్షణం కనిపించడం ఖాయమని చాలామంది భావిస్తారు. శరీరంపై గడ్డ ఏర్పడటం, విపరీతమైన నొప్పి, చర్మంలో మార్పులు రావడం లేదా ద్రవాలు స్రవించడం వంటివి జరిగే వరకు వేచి చూస్తుంటారు. కానీ, రొమ్ము క్యాన్సర్ విషయంలో ఇలా లక్షణాలు బయటపడే వరకు వేచి చూడటం వల్ల వ్యాధిని నయం చేసే విలువైన సమయాన్ని కోల్పోతాం.

లక్షణాలు లేకుండానే రొమ్ము క్యాన్సర్ గుర్తింపు సాధ్యమేనా? డాక్టర్ సమాధానం ఇదీ
లక్షణాలు లేకుండానే రొమ్ము క్యాన్సర్ గుర్తింపు సాధ్యమేనా? డాక్టర్ సమాధానం ఇదీ

అసలు ఎలాంటి బాహ్య లక్షణాలు కనిపించకుండానే రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించవచ్చా? అంటే.. కచ్చితంగా సాధ్యమే. మనకు ఎలాంటి లక్షణాలు కనిపించకముందే వ్యాధి ఆనవాళ్లను పసిగట్టడమే స్క్రీనింగ్ పరీక్షల ప్రధాన ఉద్దేశం.

ఆరంభ దశలో లక్షణాలు ఎందుకు కనిపించవు?

క్యాన్సర్ చాలా ప్రాథమిక దశలో (స్టేజ్ 0 లేదా స్టేజ్ 1 ఆరంభంలో) ఉన్నప్పుడు, వ్యాధి కణాలు రొమ్ము నాళాలు లేదా లోబ్యూల్స్ లోపల పెరుగుతుంటాయి. ఈ సమయంలో ఎలాంటి నొప్పి ఉండదు, చేతికి ఎలాంటి గడ్డ తగలదు. సాధారణంగా చేతికి గడ్డ తగిలే సమయానికి దాని పరిమాణం 1 నుంచి 2 సెంటీమీటర్లకు చేరుకుంటుంది. అంటే, ఆ గడ్డ నెలలు లేదా ఏళ్ల తరబడి శరీరంలో నిశ్శబ్దంగా ఎదుగుతూ వచ్చిందని అర్థం. ఎలాంటి లక్షణాలు లేని ఈ నిశబ్ద కాలాన్నే స్క్రీనింగ్ పరీక్షలు పట్టుకుంటాయి.

నిర్ధారణకు ఉపయోగించే ప్రధాన స్క్రీనింగ్ పరీక్షలు

1. మామోగ్రఫీ (Mammography): రొమ్ము క్యాన్సర్ నిర్ధారణలో ఇది అత్యంత కీలకమైన పరీక్ష. ఇది తక్కువ డోస్ ఎక్స్-రే సాయంతో పనిచేస్తుంది. చేతికి దొరకని అత్యంత చిన్నపాటి కాల్సియం నిల్వలను (మైక్రోకాల్సిఫికేషన్లు), కణజాల మార్పులను మ్యామోగ్రఫీ ద్వారా ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు.

2. అల్ట్రాసౌండ్, ఎంఆర్‌ఐ (Ultrasound & MRI): రొమ్ము కణజాలం సాంద్రత (Dense breasts) ఎక్కువగా ఉన్న మహిళల్లో మ్యామోగ్రఫీ ద్వారా కొన్ని చిన్నపాటి లోపాలను గుర్తించడం కష్టం కావచ్చు. అలాంటి వారికి అల్ట్రాసౌండ్ ఉపయోగపడుతుంది. ఇక అధిక ముప్పు (High Risk) ఉన్న మహిళలకు ఎంఆర్‌ఐ పరీక్షను వైద్యులు సిఫార్సు చేస్తారు.

3. థర్మల్ ఇమేజింగ్ (Thermal Imaging): రేడియేషన్ లేని ఈ కొత్త రకం పరీక్షలను గ్రామీణ ప్రాంతాల్లో, మ్యామోగ్రఫీ సదుపాయం లేని వైద్య శిబిరాల్లో ప్రాథమిక ప్రమాద అంచనా కోసం వాడుతున్నారు. అయితే, ఇవి రెగ్యులర్ మామోగ్రఫీ స్క్రీనింగ్‌కు ప్రత్యామ్నాయం కావు.

ఎవరెవరు.. ఎప్పుడు స్క్రీనింగ్ చేయించుకోవాలి?

ప్రతి మహిళ తన వ్యక్తిగత ఆరోగ్య చరిత్ర, ముప్పు తీవ్రత ఆధారంగా స్క్రీనింగ్ ఎంచుకోవాలి:

సాధారణ ముప్పు ఉన్న మహిళలు: కుటుంబంలో లేదా వ్యక్తిగతంగా ఎలాంటి క్యాన్సర్ చరిత్ర లేని మహిళలు 40 ఏళ్ల వయస్సు నుంచి స్క్రీనింగ్ పరీక్షలపై వైద్యులతో చర్చించాలి.

అధిక ముప్పు ఉన్న మహిళలు: కుటుంబంలో రొమ్ము లేదా అండాశయ (Ovarian) క్యాన్సర్ చరిత్ర ఉన్నవారు, జీన్ ముటేషన్లు (BRCA1, BRCA2) ఉన్నవారు, లేదా చిన్న వయస్సులోనే ఛాతీకి రేడియేషన్ చికిత్స పొందినవారు 30 ఏళ్ల వయస్సు నుంచే స్క్రీనింగ్ ప్రారంభించాలి. వీరు ఏడాదికి ఒకసారి మామోగ్రఫీతో పాటు ఎంఆర్‌ఐ పరీక్ష చేయించుకోవడం అవసరం.

దీనితో పాటు, ప్రతి మహిళా తన రొమ్ముల సహజ ఆకృతి, స్థితిపై అవగాహన కలిగి ఉండాలి. ప్రతీ రోజూ ఆందోళనగా పరీక్షించుకోవాల్సిన పనిలేదు కానీ, ఏదైనా కొత్త మార్పు కనిపిస్తే వెంటనే గుర్తించేలా అవగాహన ఉండటం మంచిది.

ముందస్తు గుర్తింపు వల్ల కలిగే ప్రయోజనాలు

లక్షణాలు కనిపించకముందే రొమ్ము క్యాన్సర్‌ను గుర్తిస్తే అనేక ప్రయోజనాలు ఉంటాయి.

  • వ్యాధిని ఆరంభ దశలోనే గుర్తిస్తే 5 సంవత్సరాల మనుగడ రేటు (Survival rate) 90 నుంచి 95 శాతానికి పైగా ఉంటుంది.
  • రొమ్ము మొత్తాన్ని తొలగించే అవసరం లేకుండా, కేవలం గడ్డ ఉన్న భాగాన్ని మాత్రమే తొలగించే సర్జరీ (Lumpectomy) సరిపోతుంది.
  • క్యాన్సర్ తీవ్రతను బట్టి కీమోథెరపీ అవసరం లేకుండా లేదా తక్కువ తీవ్రత కలిగిన చికిత్సలతోనే నయం చేయవచ్చు.
  • చికిత్స విధానం తేలికగా ఉండటంతో పాటు ఆర్థిక భారం, మానసిక ఒత్తిడి చాలా వరకు తగ్గుతాయి.

ప్రధాన ప్రతిబంధకం.. భయం, నిర్లక్ష్యం

భారతదేశంలో క్యాన్సర్ స్క్రీనింగ్‌కు ప్రధాన అడ్డంకి భయమే. "నాకు ఎలాంటి లక్షణాలు లేవు కదా, నేనెందుకు పరీక్ష చేయించుకోవాలి?" అని చాలామంది మహిళలు భావిస్తుంటారు. మరికొందరు ఫలితం ఎలా వస్తుందోననే భయంతో పరీక్షలకు దూరంగా ఉంటారు. కానీ, బీపీ, షుగర్ పరీక్షల మాదిరిగానే స్క్రీనింగ్ అనేది ముందస్తు జాగ్రత్త చర్య మాత్రమే. ఎలాంటి లక్షణాలు లేని వారికి చేసే పరీక్షే స్క్రీనింగ్ అని గుర్తించాలి.

రొమ్ము క్యాన్సర్‌ను ప్రారంభంలోనే గుర్తించి, సరైన సమయంలో చికిత్స తీసుకుంటే దానిని పూర్తిగా నయం చేసే అవకాశాలు మెరుగవుతాయి.

వ్యాసకర్త:

డాక్టర్ సంతోషిణి గౌరిశెట్టి,

కన్సల్టెంట్ – గైనకాలజీ అండ్ ఆబ్‌స్టెట్రిక్స్,

గ్లెనెగల్స్ అవేర్ హాస్పిటల్,

ఫోర్టిస్ హెల్త్‌కేర్ నెట్‌వర్క్,

ఎల్‌బీ నగర్, హైదరాబాద్

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More