క్యాన్సర్ చికిత్స పొందుతున్న రోగులలో రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. దీనివల్ల వివిధ రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడే ముప్పు పెరుగుతుంది. ప్రమాదకర ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందడంలో వ్యాక్సిన్లు (టీకాలు) కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, క్యాన్సర్ చికిత్స రకం, రోగి శరీరంలో ఉండే రోగనిరోధక శక్తి ఆధారంగా వ్యాక్సిన్ ఎప్పుడు వేసుకోవాలి, ఏ రకం వ్యాక్సిన్ ఎంచుకోవాలనేది జాగ్రత్తగా నిర్ణయించాల్సి ఉంటుంది.
వ్యాక్సిన్లు ఎందుకు అంత కీలకం?

కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి చికిత్సల వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి గణనీయంగా తగ్గుతుంది. ఇటువంటి సమయంలో ఫ్లూ (ఇన్‌ఫ్లుయెంజా), కోవిడ్-19, న్యుమోకోకల్ వ్యాధులు, హెపటైటిస్-బి వంటి ప్రమాదకర ఇన్ఫెక్షన్లు సోకే ముప్పు ఎక్కువ. తగిన వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల ఈ ముప్పును సమర్థవంతంగా తగ్గించవచ్చు. అయితే, తీవ్రమైన చికిత్స కొనసాగుతున్న సమయంలో రోగనిరోధక వ్యవస్థ పూర్తిస్థాయిలో స్పందించకపోవచ్చు. అందువల్ల ఆ సమయంలో వ్యాక్సిన్ వల్ల లభించే రక్షణ కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంది.
ఏ వ్యాక్సిన్లు సురక్షితం?
క్యాన్సర్ రకం, తీసుకుంటున్న చికిత్స, శరీర రోగనిరోధక స్థాయిని బట్టి వ్యాక్సిన్ల ఎంపిక ఆధారపడి ఉంటుంది. చికిత్స సమయంలో సాధారణంగా నిష్క్రియాత్మక (Inactivated/Non-live) వ్యాక్సిన్లకే ప్రాధాన్యం ఇస్తారు.
వైద్యుల పర్యవేక్షణలో పరిగణనలోకి తీసుకునే ప్రధాన వ్యాక్సిన్లు:
- ఇన్‌ఫ్లుయెంజా (సీజనల్ ఫ్లూ) వ్యాక్సిన్
- కోవిడ్-19 వ్యాక్సిన్
- అర్హులైన రోగులకు న్యుమోకోకల్ వ్యాక్సిన్
- ప్రమాదం ఉన్నవారికి హెపటైటిస్-బి వ్యాక్సిన్
- రోగి వయస్సు, వైద్య చరిత్ర, చికిత్స ప్రణాళిక ఆధారంగా ఇతర టీకాలు.
- సజీవ కణాలుండే 'లైవ్ వ్యాక్సిన్ల' (Live Vaccines) విషయంలో అత్యంత అప్రమత్తత అవసరం. ఇవి బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న రోగులకు సురక్షితం కావు. కాబట్టి, ఆంకాలజీ వైద్య బృందంతో సమగ్రంగా చర్చించిన తర్వాతే లైవ్ వ్యాక్సిన్లపై నిర్ణయం తీసుకోవాలి.
టీకాలు ఎప్పుడు వేసుకోవాలి?
వ్యాక్సిన్ వేసుకునే సమయం అత్యంత ముఖ్యం. వీలైనంత వరకు క్యాన్సర్ చికిత్స ప్రారంభం కావడానికి ముందే సిఫార్సు చేసిన టీకాలు పూర్తి చేయడం మంచిది. దీనివల్ల శరీరంలో రోగనిరోధక వ్యవస్థ తగినంత ప్రతిస్పందనను అభివృద్ధి చేసుకునేందుకు సమయం లభిస్తుంది.
{{/usCountry}}వ్యాక్సిన్ వేసుకునే సమయం అత్యంత ముఖ్యం. వీలైనంత వరకు క్యాన్సర్ చికిత్స ప్రారంభం కావడానికి ముందే సిఫార్సు చేసిన టీకాలు పూర్తి చేయడం మంచిది. దీనివల్ల శరీరంలో రోగనిరోధక వ్యవస్థ తగినంత ప్రతిస్పందనను అభివృద్ధి చేసుకునేందుకు సమయం లభిస్తుంది.
{{/usCountry}}ఇప్పటికే కీమోథెరపీ లేదా రోగనిరోధక వ్యవస్థను తగ్గించే ఇతర చికిత్సలు పొందుతున్న రోగులకు, చికిత్స సైకిల్‌లో ఒక నిర్దిష్ట సమయంలో మాత్రమే టీకా ఇవ్వాలని వైద్యులు సూచిస్తారు. కొన్నిసార్లు రోగనిరోధక శక్తి కోలుకునే వరకు వ్యాక్సిన్లను వాయిదా వేయవచ్చు. చికిత్స పూర్తయిన తర్వాత, ప్రత్యేకించి స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ పొందిన రోగుల్లో పాత రోగనిరోధక శక్తి తగ్గిపోవడం లేదా పూర్తిగా నశించడం జరుగుతుంది. అందువల్ల వారికి మళ్లీ వ్యాక్సిన్లు (రివ్యాక్సినేషన్) లేదా అదనపు డోసులు అవసరమవుతాయి.
భారతదేశంలో రోగులు పాటించాల్సిన జాగ్రత్తలు
మన దేశంలో వాతావరణ మార్పుల వల్ల వచ్చే సీజనల్ ఫ్లూ, కోవిడ్-19, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి తీవ్ర ముప్పుగా మారుతాయి. అందుకే క్యాన్సర్ బాధితులు సాధారణ వ్యాక్సినేషన్ షెడ్యూల్‌ను గుడ్డిగా అనుసరించకూడదు.
వయస్సు, క్యాన్సర్ రకం, పొందుతున్న చికిత్స, ప్రస్తుత ఇమ్యూనిటీ స్థాయి, గతంలో వేసుకున్న టీకాలు, ఇతర ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఆంకాలజిస్ట్ సలహా మేరకు నిర్ణయం తీసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా, రోగులు తమంతట తాముగా వ్యాక్సిన్ వేసుకోవడం, ఆపేయడం లేదా వాయిదా వేయడం చేయకూడదు. ఏ వ్యాక్సిన్ ఎప్పుడు వేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చికిత్స అందిస్తున్న ఆంకాలజిస్ట్ మాత్రమే సరైన మార్గదర్శకత్వం చేయగలరు.
వ్యాసకర్త:
— డాక్టర్ జి. వంశీకృష్ణ రెడ్డి,
డైరెక్టర్ - ఆంకాలజీ సర్వీసెస్,
కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ & హెమటో ఆంకాలజిస్ట్,
యశోద హాస్పిటల్స్, హైదరాబాద్.