...
...
Next Story

హెచ్చరిక! మీరు నిర్లక్ష్యం చేస్తున్న ఊపిరితిత్తుల వ్యాధుల తొలి సంకేతాలు ఇవే

ఊపిరితిత్తుల వ్యాధుల తొలి హెచ్చరికలైన తగ్గని దగ్గు, ఊపిరి ఆడకపోవడం, వీజింగ్, ఛాతీ నొప్పి, తరచుగా ఇన్ఫెక్షన్లు, గొంతు మారడం, అకారణంగా బరువు తగ్గడాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదని డాక్టర్ ఉదయ్ కిరణ్ హెచ్చరించారు. ఈ సంకేతాలు COPD లేదా లంగ్ క్యాన్సర్ వంటి తీవ్ర సమస్యలను సూచించవచ్చు.

Published on: Dec 15, 2025 04:15 PM IST
Advertisement

మన ఊపిరితిత్తులు (Lungs) ఆరోగ్యానికి ఎంత కీలకమో చాలా మందికి నిజంగా అర్థమయ్యేది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైన తర్వాతే. ఊపిరితిత్తులు మన శరీరంలోని ప్రతి కణానికి ప్రాణవాయువు (ఆక్సిజన్)ను పంపిస్తాయి. ఈ ప్రక్రియలో చిన్నపాటి ఆటంకం ఏర్పడ్డా, అది మన శక్తి (Energy), గుండె ఆరోగ్యం (Heart Health), రోజువారీ జీవితంపై నేరుగా ప్రభావం చూపుతుంది.

హెచ్చరిక! మీరు నిర్లక్ష్యం చేస్తున్న ఊపిరితిత్తుల వ్యాధుల తొలి సంకేతాలు ఇవే
హెచ్చరిక! మీరు నిర్లక్ష్యం చేస్తున్న ఊపిరితిత్తుల వ్యాధుల తొలి సంకేతాలు ఇవే

కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే... ఊపిరితిత్తుల వ్యాధికి సంబంధించిన తొలి హెచ్చరికలు, సంకేతాలు మొదట్లో చాలా చిన్నవిగా అనిపిస్తాయి. వాటిని మనం తరచుగా నిర్లక్ష్యం చేస్తుంటాం. ఆ నిర్లక్ష్యమే కొన్నిసార్లు పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. ఈ లక్షణాలను తొందరగా గుర్తిస్తే మాత్రం, సరైన చికిత్సకు చక్కగా స్పందించి, జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవచ్చు.

మీరు తప్పక గమనించాల్సిన 7 ముఖ్య లక్షణాలు

1. తగ్గని దగ్గు (Persistent Cough)

దగ్గు మూడు వారాల కంటే ఎక్కువగా వస్తుంటే, 'చలిగాలికి వస్తోందేమోలే' అని వదిలేయకూడదు. దీర్ఘకాల దగ్గు అనేది క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD), బ్రాంకైటిస్ లేదా ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి సమస్యలకు ప్రధాన లక్షణం కావచ్చు. దగ్గు పెరుగుతున్నా, తీవ్రంగా వస్తున్నా, ముఖ్యంగా దగ్గుతున్నప్పుడు రక్తం పడుతున్నా, లేదా కఫంలో రక్తపు చాయలు కనిపించినా.. ఆలస్యం చేయకుండా వైద్యుడిని కలవాలి.

2. ఊపిరి ఆడకపోవడం (Shortness of Breath)

కాస్త మెట్లు ఎక్కినా లేదా చిన్న చిన్న పనులకే ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంటే, 'వయసు పెరుగుతోందిలే' అని అనుకోవడం సరికాదు. ఇది ఊపిరితిత్తుల వ్యాధి (Lung Disease) తొలి లక్షణం కావచ్చు. ఆస్త్మా (Asthma), ఇంటర్‌స్టీషియల్ లంగ్ డిసీజ్, లేదా COPD ప్రారంభ లక్షణాలు ఇలాగే ఉంటాయి. మొదట్లో ఇబ్బంది తక్కువగా ఉన్నప్పటికీ, చికిత్స తీసుకోకపోతే నెమ్మదిగా పెరుగుతుంది.

3. వీజింగ్ లేదా పిల్లికూతలు (Wheezing)

కొన్ని రోజులు ఛాతీలో పట్టేసినట్టు అనిపిస్తే, 'మజిల్ క్రాంప్స్ ఏమోలే' అనుకొని వదిలేయకండి. అదే నొప్పి కొనసాగితే, అది ఇన్ఫెక్షన్, పల్మనరీ ఎంబాలిజం (Pulmonary Embolism) లేదా లంగ్ క్యాన్సర్ కూడా కావచ్చు. ఛాతీలో నొప్పితో పాటు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

5. తరచుగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు (Frequent Infections)

పదేపదే బ్రాంకైటిస్, న్యుమోనియా లేదా ఛాతీ ఇన్ఫెక్షన్లు వస్తుంటే, ఊపిరితిత్తుల రక్షణ వ్యవస్థ బలహీనపడుతోందని అర్థం. COPD ఉన్నవారికి లేదా రోగనిరోధక శక్తి (Immunity) తక్కువగా ఉన్నవారికి తరచూ ఇన్ఫెక్షన్లు రావడం సాధారణమే. కానీ, ఇలా పదేపదే రావడం జరిగితే, దానిని చాలా సీరియస్‌గా తీసుకోవాలి.

6. గొంతు మారిపోవడం (Voice Changes)

కొంతమందిలో లంగ్ క్యాన్సర్ (Lung Cancer) అనేది స్వరపేటిక (Voice Box) వైపు వ్యాపించి, గొంతు బొంగురుపోవడానికి లేదా గరగరకు కారణమవుతుంది. లారింజైటిస్ (Laryngitis) వల్ల సాధారణంగా ఇలా జరిగినా, ఈ లక్షణాలు వారాల తరబడి కొనసాగితే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.

7. అకారణంగా బరువు తగ్గడం (Unexplained Weight Loss)

మీరు ఆహారంలో మార్పు చేయలేదు, వ్యాయామాన్ని పెంచలేదు, అయినా కూడా అకారణంగా బరువు తగ్గిపోతుంటే.. అది లంగ్ క్యాన్సర్ లేదా టీబీ (TB) వంటి అడ్వాన్స్‌డ్ లంగ్ డిసీజెస్‌కు సంకేతం కావచ్చు. సాధారణంగా ఆకలి లేకపోవడం, తీవ్రమైన అలసట వల్ల బరువు తగ్గినట్టు అనిపించినా, ఆలస్యం చేయకుండా వెంటనే పరీక్షలు చేయించాలి.

చివరిగా ఒక ముఖ్యమైన విషయం

మనలో చాలామంది... ఈ లక్షణాలను చూసి కూడా 'వయసు ప్రభావం వల్లో', 'పొల్యూషన్ వల్లో', 'జీవనశైలిలో మార్పుల వల్లో' ఇలా అవుతోందనుకుని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ సరైన సమయానికి డాక్టర్‌ని సంప్రదించి, లంగ్ ఫంక్షన్ టెస్టులు, స్కాన్‌లు చేయించుకోవడం వల్ల సమస్యను తొందరగా గుర్తించవచ్చు. సకాలంలో అందించే చికిత్సతో చాలా మంచి ఫలితాలు సాధించవచ్చు.

- డా. ఉదయ్ కిరణ్,

కన్సల్టెంట్, పల్మనాలజీ,

మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON