పచ్చసొన పారేసేస్తున్నారా? గుండె నిపుణుల సలహా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది

గుడ్డులో పచ్చసొన (Yolk) తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని, గుండెకు ప్రమాదమని చాలామంది దాన్ని పక్కన పెడతారు. కానీ, పచ్చసొనతో కలిపి తింటేనే గుడ్డు సంపూర్ణ ఆహారం అవుతుందని ప్రముఖ గుండె నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఇక్కడ చూద్దాం.

Published on: Feb 09, 2026 11:25 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సాధారణంగా జిమ్‌కు వెళ్లేవారైనా లేదా ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నవారైనా గుడ్డులోని తెల్లసొనను మాత్రమే తిని, పచ్చసొనను పారేస్తుంటారు. పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బులు వస్తాయని ఒక బలమైన అపోహ మనలో నాటుకుపోయింది. అయితే, ఈ విషయంలో ప్రముఖ కార్డియాలజిస్ట్, ఫంక్షనల్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ అలోక్ చోప్రా సంచలన విషయాలు వెల్లడించారు. 40 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఆయన మాటల్లోనే ఈ విశేషాలు తెలుసుకుందాం.

పచ్చసొనతో కలిపి తింటేనే గుడ్డు సంపూర్ణ ఆహారం అవుతుందని గుండె నిపుణులు చెబుతున్నారు (Shutterstock)
పచ్చసొనతో కలిపి తింటేనే గుడ్డు సంపూర్ణ ఆహారం అవుతుందని గుండె నిపుణులు చెబుతున్నారు (Shutterstock)

గుడ్డు పచ్చసొనే అసలైన పోషక గని

కేవలం తెల్లసొన మాత్రమే తినడం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువని డాక్టర్ చోప్రా హెచ్చరిస్తున్నారు. తెల్లసొన అనేది ఒక 'ఇన్‌ఫ్లమేటరీ ప్రోటీన్' (శరీరంలో మంటను కలిగించేది). దీన్ని పచ్చసొనతో కలిపి తిన్నప్పుడు మాత్రమే అది సమతుల్యమైన, సంపూర్ణ ఆహారంగా మారుతుందని చెబుతున్నారు.

“పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఉంటుందనే కారణంతో దాన్ని అందరూ విలన్‌గా చూస్తారు. కానీ, వాస్తవానికి గుడ్డులోని మెజారిటీ పోషకాలు అందులోనే ఉంటాయి. తెల్లసొనతో పోలిస్తే పచ్చసొనలో విటమిన్ ఏ, విటమిన్ ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి” అని ఆయన వివరించారు.

కొలెస్ట్రాల్‌పై ఉన్న అపోహలు ఇవే..

చాలామంది కొలెస్ట్రాల్ అనగానే భయపడిపోతారు. కానీ మన శరీరానికి అది ఎంతో అవసరమని డాక్టర్ చోప్రా గుర్తు చేస్తున్నారు.

  • శరీరమే తయారు చేస్తుంది: మన శరీరానికి అవసరమైన కొలెస్ట్రాల్‌లో దాదాపు 85 శాతం మన కాలేయమే (Liver) సొంతంగా తయారు చేస్తుంది. కేవలం 15 శాతం మాత్రమే మనం తినే ఆహారం ద్వారా అందుతుంది. శరీరం తనంతట తానుగా తయారు చేసుకునేది ఆరోగ్యానికి ఎప్పుడూ హానికరం కాదని ఆయన వాదన.
  • ప్రాముఖ్యత: కణాల నిర్మాణం, హార్మోన్ల ఉత్పత్తి, మెదడు పనితీరు, రోగనిరోధక శక్తి మెరుగుపడటానికి కొలెస్ట్రాల్ ఎంతో కీలకం.
  • గుండె జబ్బులకు కారణం కాదు: “కొలెస్ట్రాల్ వల్లే గుండె జబ్బులు వస్తాయన్నది కేవలం ఒక అపోహ మాత్రమే. దీనికి సుమారు 16 రకాల ముఖ్యమైన పనులు శరీరంలో ఉన్నాయి” అని ఆయన పేర్కొన్నారు.

ఏది మంచిది?

ఆరోగ్యంగా ఉండాలంటే పచ్చసొనను విస్మరించకూడదని నిపుణులు సూచిస్తున్నారు. మీరు బరువు తగ్గాలనుకున్నా, కండరాలు దృఢంగా ఉండాలని కోరుకున్నా గుడ్డును పూర్తిగా తినడమే శ్రేయస్కరం. మార్కెట్లో దొరికే కృత్రిమ ప్రోటీన్ల కంటే ప్రకృతి సిద్ధంగా లభించే ఈ పచ్చసొన ఎంతో మేలు చేస్తుంది.

(గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నవారు లేదా ప్రత్యేకమైన డైట్ పాటించేవారు తమ వైద్యులను సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.)