మధుమేహంతో కిడ్నీలు పాడవకుండా ఉండాలంటే.. మీ జీవనశైలిలో ఈ 6 మార్పులు తప్పనిసరి
షుగర్ వల్ల కిడ్నీలు ఎలా దెబ్బతింటాయి? కాళ్ల వాపులు, మూత్రంలో మార్పుల వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? విజయవాడ మణిపాల్ ఆసుపత్రి నెఫ్రాలజీ (కిడ్నీ స్పెషలిస్ట్) వైద్య నిపుణులు డాక్టర్ ఏవీవీఎస్‌ఎన్ శ్రీధర్ అందిస్తున్న సమాచారం మీకోసం.
డయాబెటిస్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా కనిపించే దీర్ఘకాలిక వ్యాధుల్లో ఒకటి. అయితే డయాబెటిస్ వల్ల భవిష్యత్తులో ఆరోగ్యంపై, ముఖ్యంగా కిడ్నీలపై ఎంత ప్రభావం పడుతుందో చాలా మందికి పూర్తిగా తెలియదు. ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ ఫెయిల్యూర్ కేసుల్లో పెద్ద శాతం డయాబెటిస్ కారణంగానే జరుగుతున్నాయి. చాలా కాలం పాటు రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే కిడ్నీల్లోని చిన్న రక్తనాళాలు దెబ్బతింటాయి. దాంతో శరీరంలో ఏర్పడే వ్యర్థ పదార్థాలు, అదనపు ద్రవాలను కిడ్నీలు సరిగా ఫిల్టర్ చేయలేని పరిస్థితి వస్తుంది.

మన శరీరంలో కిడ్నీలు చాలా ముఖ్యమైన పని చేస్తాయి. శరీరంలో చేరిన హానికర పదార్థాలను బయటకు పంపించడం, రక్తం దేన్ని గ్రహించాలి? అన్నది నియంత్రించడం, శరీరంలో నీటి మోతాదును సమతుల్యంగా ఉంచడం - ఇలాంటి కీలక బాధ్యతలు కిడ్నీలదే. డయాబెటిస్‌ను చాలా సంవత్సరాలు సరైన చికిత్స లేకుండా వదిలేస్తే డయాబెటిక్ నెఫ్రోపతి అనే సమస్య రావచ్చు. దీనిని డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ అని కూడా అంటారు.
అసలేం జరుగుతుంది?
దీన్ని సులభంగా అర్థం చేసుకోవాలంటే.. ఒక జల్లెడలో ఇసుకను వడపోస్తున్నప్పుడు, అందులో పెద్ద రాళ్లు పడితే జల్లెడ రంధ్రాలు ఎలా దెబ్బతింటాయో, కిడ్నీల పరిస్థితి కూడా అలాగే ఉంటుంది.
- ప్రారంభ దశ: రక్తంలో గ్లూకోజ్ ఎక్కువైతే కిడ్నీలపై పనిభారం పెరుగుతుంది.
- ప్రోటీన్ లీకేజీ: కిడ్నీలు దెబ్బతినడం వల్ల రక్తంలో ఉండాల్సిన 'అల్బుమిన్' అనే ప్రోటీన్ మూత్రం ద్వారా బయటకు పోవడం మొదలవుతుంది.
- నిర్వహణ లోపం: వ్యర్థాలు బయటకు వెళ్లవు, ద్రవాలు శరీరంలో పేరుకుపోతాయి. ఫలితంగా బీపీ (రక్తపోటు) విపరీతంగా పెరుగుతుంది.
ఎలా గుర్తించాలి?
కిడ్నీ వ్యాధిని 'సైలెంట్ కిల్లర్' అంటారు ఎందుకంటే 70-80% కిడ్నీ దెబ్బతినే వరకు బయటకి పెద్దగా లక్షణాలు కనిపించవు. అయినప్పటికీ, శరీరం పంపే ఈ చిన్న చిన్న సంకేతాలను గమనించాలి.
- పాదాలు, కాళ్ల వాపు: శరీరంలో నీరు చేరడం వల్ల సాయంత్రం వేళల్లో వాపులు రావడం.
- మూత్రంలో మార్పులు: నురుగుతో కూడిన మూత్రం రావడం (ప్రోటీన్ పోతుందని అర్థం) లేదా రాత్రిపూట తరచుగా వెళ్లాల్సి రావడం.
- అలసట: హిమోగ్లోబిన్ తగ్గిపోయి అకారణంగా నీరసం రావడం.
- దురదలు: రక్తంలో వ్యర్థాలు పెరగడం వల్ల చర్మంపై దురదలు రావడం.
ఎలాంటి లక్షణాలు లేకుండానే..
చాలా సందర్భాల్లో మొదట్లో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు లేకుండానే, కిడ్నీ దెబ్బతింటుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారు రెగ్యులర్‌గా పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా మూత్రంలో ప్రోటీన్ ట్రేసెస్ పరీక్షించడం, కిడ్నీ పనితీరు పరీక్షలు చేయించడం ద్వారా ప్రారంభ దశలోనే మార్పులను గుర్తించవచ్చు. అప్పుడు సరైన చికిత్సను త్వరగా ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది.
చేయాల్సిన 6 మార్పులు
కిడ్నీ ఆరోగ్యం విషయంలో మన జీవనశైలి కూడా చాలా ముఖ్యం.
- రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడం
- బీపీని కంట్రోల్ చేయడం
- ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం
- శారీరకంగా చురుకుగా ఉండడం
- ఉప్పు తక్కువగా వాడడం
- పెయిన్‌కిల్లర్ మందులు వాడకుండా ఉండటం
డయాబెటిస్‌ను కంట్రోల్ లో ఉంచుకోవడం, క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం, అవసరమైన వైద్య సహాయం తీసుకోవడం ద్వారా కిడ్నీ వ్యాధి మరింత పెరగకుండా ఆపడం లేదా దాని వేగాన్ని తగ్గించడం సాధ్యమవుతుంది. డయాబెటిస్, కిడ్నీ ఆరోగ్యం మధ్య ఉన్న సంబంధంపై అవగాహన పెంచుకోవడం కూడా చాలా అవసరం. ఇలా అవగాహనతో ముందుగానే గుర్తిస్తే, దీర్ఘకాలంలో మెరుగైన ఆరోగ్య ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది.
- డాక్టర్ ఏవీఎస్ఎస్‌ఎన్ శ్రీధర్,
కన్సల్టెంట్, నెఫ్రాలజీ
మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper












