కేవలం 90 క్యాలరీలే.. ఎముకల బలానికి కాల్షియం లడ్డూ రెసిపీ
రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే అద్భుతమైన స్వీట్ ఏదైనా ఉంటే బాగుంటుందని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అచ్చం అలాంటి రెసిపీనే సోషల్ మీడియాలో పంచుకున్నారు ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ వంశిక ఖురానా. కేవలం 90 క్యాలరీలతో ఎముకలకు మేలు చేసే 'కాల్షియం బాల్స్' (లడ్డూలు) ఎలా తయారు చేయాలో ఆమె వివరించారు.
సాధారణంగా మనం తినే లడ్డూల్లో నెయ్యి, చక్కెర మోతాదు ఎక్కువగా ఉంటుంది. కానీ వంశిక పరిచయం చేసిన ఈ లడ్డూల్లో రిఫైన్డ్ షుగర్ అస్సలు ఉండదు. పైగా ఇందులో వాడిన పదార్థాలు కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలను పుష్కలంగా అందిస్తాయి. ఈ కాల్షియం బాల్స్ తీసుకోవడం వల్ల ఎముకలు, కీళ్ల ఆరోగ్యంతో పాటు హార్మోన్ల సమతుల్యత, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆమె పేర్కొన్నారు.

కావలసిన పదార్థాలు:
- నల్ల నువ్వులు – ముప్పావు కప్పు
- గుమ్మడి గింజలు (Pumpkin seeds) – అర కప్పు
- వాల్‌నట్స్ (అక్రూట్లు) – 10 నుంచి 12
- ఎండు కొబ్బరి తురుము – 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు
- తామర గింజలు (మఖానా) – 1 కప్పు
- నెయ్యి – అర టేబుల్ స్పూన్
- అంజీర్ – 8 నుంచి 10 (రుచికి తగినట్టుగా)
- కిస్‌మిస్ – 2 టేబుల్ స్పూన్లు (ఆప్షనల్)
- తెల్ల నువ్వులు – 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు (వేయించినవి - పైన చల్లుకోవడానికి)
తయారీ విధానం:
- ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి తక్కువ మంటపై నల్ల నువ్వులు, గుమ్మడి గింజలు, వాల్‌నట్స్, ఎండు కొబ్బరిని దోరగా వేయించాలి. మంచి సువాసన వచ్చే వరకు వేయించి పక్కన పెట్టి పూర్తిగా చల్లార్చాలి.
- ఈ మిశ్రమాన్ని బ్లెండర్‌లో వేసి, అర చెంచా నెయ్యి కలిపి మెత్తటి 'నట్-సీడ్ బటర్' అయ్యే వరకు గ్రైండ్ చేయాలి.
- ఇప్పుడు అందులో అంజీర్ ముక్కలు వేసి మళ్లీ గ్రైండ్ చేస్తే చిక్కటి, మెరిసే తీపి పేస్ట్ తయారవుతుంది. దీనికి అదనపు ఫ్యాట్ అవసరం లేదు.
- మరోవైపు మఖానాలను (తామర గింజలు) విడిగా కరకరలాడే వరకు వేయించి, వాటిని పొడి చేసుకోవాలి.
- ఒక గిన్నెలో ముందుగా సిద్ధం చేసుకున్న నట్స్-అంజీర్ పేస్ట్‌ను తీసుకుని, అందులో మఖానా పొడిని వేసి బాగా కలపాలి.
- చివరగా కిస్‌మిస్, వేయించిన తెల్ల నువ్వులు వేసి మొత్తం కలిసేలా కలిపి, చిన్న చిన్న లడ్డూలుగా చుట్టుకోవాలి.
ఈ మిశ్రమంతో సుమారు 20 లడ్డూలు తయారవుతాయి. ఇలా ఒక్కో లడ్డూలో సుమారు 90 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. వీటిని గాలి చొరబడని డబ్బాలో భద్రపరుచుకుని రోజూ ఒకటి తీసుకోవచ్చు.
(గమనిక: ఈ సమాచారం సోషల్ మీడియాలోని కంటెంట్ ఆధారంగా సేకరించినది. పైన పేర్కొన్న అంశాలను నిర్ధారించడంలో గానీ, ప్రోత్సహించడంలో గానీ మాకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా డైట్ ఫాలో అయ్యే ముందు నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.)
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


