గర్భధారణ సమయంలో షుగర్ వచ్చిందా? వెంటనే చేయాల్సిన 7 సులువైన పనులు
గర్భధారణ సమయంలో డయాబెటిస్ (GDM) నిర్ధారణ కాగానే ఆందోళన చెందకుండా కొన్ని సులువైన జీవనశైలి మార్పులతో దానిని అదుపు చేయవచ్చని హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ శారదా వాణి వివరిస్తున్నారు. తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యాన్ని సురక్షితంగా కాపాడుకునేందుకు తోడ్పడే మార్గదర్శకాలు ఇవే.
గర్భధారణ సమయంలో శరీరంలో జరిగే హార్మోన్ల మార్పుల వల్ల ఇన్సులిన్ వినియోగం మందగించి, రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీనినే వైద్య పరిభాషలో 'జెస్టేషనల్ డయాబెటిస్' (GDM) అంటారు. ప్రసవం కాగానే ఈ చక్కెర స్థాయిలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకున్నప్పటికీ, గర్భంతో ఉన్న కాలంలో దీనిని అదుపులో ఉంచుకోవడం తల్లి, బిడ్డల ఆరోగ్యానికి ఎంతో కీలకం.

డయాబెటిస్ నిర్ధారణ అయిన వెంటనే కంగారు పడకుండా క్రమశిక్షణతో కూడిన ప్రణాళికను పాటిస్తే సురక్షితమైన ప్రసవం సాధ్యమవుతుంది. అందుకు సహాయపడే 7 సులువైన దశలు ఇవే:
1. జెస్టేషనల్ డయాబెటిస్‌పై స్పష్టమైన అవగాహన తెచ్చుకోండి
డయాబెటిస్ అని తేలిన వెంటనే మీ గైనకాలజిస్ట్‌ను సంప్రదించి వ్యాధి స్వభావం గురించి అడిగి తెలుసుకోండి.
- రక్తంలో ఉండాల్సిన ఆదర్శవంతమైన చక్కెర స్థాయిలు ఎంత?
- ఎంత తరచుగా బ్లడ్ షుగర్ తనిఖీ చేసుకోవాలి?
- తక్షణమే ప్రారంభించాల్సిన ఆహార, జీవనశైలి మార్పులు ఏంటి?
- తదుపరి చెకప్‌ల షెడ్యూల్ ఏమిటి?
ఈ ప్రాథమిక విషయాలపై స్పష్టత ఉంటే భయం పోయి ఆత్మవిశ్వాసంతో పరిస్థితిని ఎదుర్కోగలరు.
2. బ్లడ్ షుగర్ స్థాయిలను క్రమం తప్పకుండా పరీక్షించండి
ఇంట్లోనే గ్లూకోమీటర్ సహాయంతో షుగర్ లెవల్స్ తనిఖీ చేసుకోవడం వల్ల మీరు తినే ఆహారం, చేసే వ్యాయామం శరీరంపై ఎలా పనిచేస్తున్నాయో అర్థమవుతుంది. సాధారణంగా ఉదయం పరగడుపున (Fasting), భోజనం చేసిన తర్వాత బ్లడ్ షుగర్ లెవల్స్ నోట్ చేసుకోవాలని వైద్యులు సూచిస్తారు. ప్రారంభంలో ఇది కాస్త ఇబ్బందిగా అనిపించినా, క్రమంగా రోజువారీ అలవాటుగా మారిపోతుంది.
3. పోషకాహారంపై ప్రత్యేక దృష్టి పెట్టండి
డయాబెటిస్ నివారణలో తక్కువ తినడం కంటే, సమతులాహారం (Balanced Diet) తినడం చాలా ముఖ్యం.
- పుష్కలంగా ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవాలి.
- తగిన పరిమాణంలో తృణధాన్యాలు, ప్రొటీన్ (మాంసకృత్తులు), మంచి కొవ్వులు ఆహారంలో భాగం చేసుకోవాలి.
- పండ్ల రసాలకు (Juices) బదులుగా తాజా పండ్లను నేరుగా తినడం శ్రేయస్కరం.
- ఒక్కసారిగా ఎక్కువగా తినకుండా, తక్కువ పరిమాణంలో క్రమమైన వ్యవధిలో భోజనం చేయడం వల్ల చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా ఉంటాయి.
4. సురక్షితమైన వ్యాయామాలను దినచర్యలో చేర్చుకోండి
సక్రమమైన శరీర శ్రమ ఇన్సులిన్ పనితీరును మెరుగుపరిచి, చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. గర్భిణులు చేయదగిన సురక్షిత వ్యాయామాలు:
- భోజనం పూర్తయ్యాక 10 నుంచి 15 నిమిషాల పాటు మెల్లగా నడవటం
- ప్రసూతి యోగా (Prenatal Yoga)
- ఈత (Swimming) లేదా ఇంట్లోనే స్టేషనరీ సైక్లింగ్ చేయడం
- ఏదైనా వ్యాయామం ప్రారంభించే ముందు మీ గైనకాలజిస్ట్ సలహా తప్పక తీసుకోండి.
5. వైద్య నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసుకోండి
డయాబెటిస్ నిర్వహణ అనేది ఒక టీమ్‌వర్క్. మీ ఆరోగ్య సంరక్షణ కోసం గైనకాలజిస్ట్, డయాబెటోలజిస్ట్, డైటీషియన్, డయాబెటిస్ ఎడ్యుకేటర్‌లతో కూడిన బృందం మార్గదర్శకత్వం అవసరం. షుగర్ స్థాయిలు తీవ్రంగా పెరిగినా లేదా తగ్గినా ఎవరిని సంప్రదించాలో ముందే అవగాహన కలిగి ఉండండి.
6. మానసిక ప్రశాంతతను కాపాడుకోండి
రోగ నిర్ధారణ తర్వాత ఆందోళన చెందడం, భయపడటం సహజం. అయితే అధిక ఒత్తిడి వల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. మీ మనసులోని భయాలను కుటుంబ సభ్యులతో పంచుకోండి. వైద్యులతో స్పష్టంగా మాట్లాడండి. తగినంత విశ్రాంతి తీసుకోండి, మైండ్‌ఫుల్‌నెస్ పద్ధతులు పాటించండి. సోషల్ మీడియాలో వచ్చే అస్పష్ట సమాచారాన్ని నమ్మకండి.
7. దీర్ఘకాలిక ప్రణాళికను సిద్ధం చేసుకోండి
తొలి వారం పూర్తయ్యేసరికి ఆహారం, వ్యాయామం, క్రమబద్ధమైన చెకప్‌లతో కూడిన ఒక స్పష్టమైన దినచర్య అలవాటవుతుంది. చాలామంది మహిళల్లో కేవలం ఆహార నియమాలు, జీవనశైలి మార్పులతోనే షుగర్ అదుపులోకి వస్తుంది. అయితే అవసరాన్ని బట్టి కొంతమందికి ఇన్సులిన్ లేదా మందులు వాడాల్సి రావచ్చు. వైద్యుల సలహాలను పాటించడమే ఇక్కడ అత్యంత సురక్షితమైన మార్గం.
ముందస్తు నివారణ ఎందుకు ముఖ్యం?
తొలినాళ్లలోనే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేయడం వల్ల ప్రసవ సమయంలో ఎదురయ్యే సంక్లిష్టతలను అడ్డుకోవచ్చు.
- పుట్టబోయే బిడ్డ బరువు అతిగా పెరగకుండా చూడవచ్చు.
- ప్రసవ సమయాన ఎదురయ్యే ఇబ్బందులను నివారించవచ్చు.
- నవజాత శిశువులో షుగర్ లెవల్స్ పడిపోకుండా కాపాడుకోవచ్చు.
- భవిష్యత్తులో తల్లికి టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
ముగింపు: గర్భధారణ సమయంలో డయాబెటిస్ నిర్ధారణ కాగానే భయపడాల్సిన పనిలేదు. తగిన వైద్య సంరక్షణ, సరైన ఆహారం, నిరంతర పర్యవేక్షణతో ఈ పరిస్థితిని అధిగమించి, ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వవచ్చు.
రచయిత/నిపుణుల వివరాలు
- డాక్టర్ శారదా వాణి,
సీనియర్ కన్సల్టెంట్ - అబ్‌స్టెట్రిక్స్ & గైనకాలజీ,
మినిమల్ యాక్సెస్ సర్జన్ (లాపరోస్కోపీ),
హై-రిస్క్ ప్రెగ్నెన్సీ స్పెషలిస్ట్
యశోద హాస్పిటల్స్, హైదరాబాద్.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


