బంగారం, వెండి భారీ పతనం: డిసెంబర్ 2025 నాటి ధరల వైపు పయనం
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు దారుణంగా పడిపోయాయి. బంగారం తులానికి రూ.3,200 తగ్గగా, వెండి కేజీకి రూ.4,200 క్షీణించింది. అంతర్జాతీయ సంకేతాలు, ద్రవ్యోల్బణ భయాలు ఇందుకు ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
నవంబర్ 1న పసిడి, వెండి ప్రియులకు కోలుకోలేని షాక్ తగిలింది. దేశీయంగా బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. పసిడి పతనం ముగిసేలా కనిపించడం లేదు. గత అక్టోబర్ నెలలో ఆల్ టైమ్ వర్స్ట్ పెర్ఫార్మెన్స్ నమోదు చేసిన బంగారం, ఇప్పుడు 2025 డిసెంబర్ నాటి కనిష్ఠ స్థాయిలకు పడిపోయే దిశగా వేగంగా పయనిస్తోంది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ అందించిన వివరాల ప్రకారం, 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.3,200 తగ్గి రూ.1,42,000కు చేరుకుంది. అంతక్రితం శుక్రవారం రోజున ఈ ధర రూ.1,45,200 వద్ద ముగిసింది. గత ఏడాది 2025 డిసెంబర్ 26న పసిడి ధర రూ.1,42,300 వద్ద ట్రేడ్ అయిన సంగతి తెలిసిందే.

వెండి ధరల్లోనూ అదే తీరు
పసిడి బాటలోనే వెండి కూడా భారీగా కరిగిపోతోంది. 2026 జనవరిలో రికార్డు స్థాయి గరిష్ఠాలను తాకిన వెండి, ఆ తర్వాత ఊహించని రీతిలో పతనమవుతోంది. నవంబర్ 1న కిలో వెండి ధర రూ.4,200 మేర తగ్గి రూ.1,86,000కు దిగివచ్చిందని పీటీఐ నివేదిక తెలిపింది. శుక్రవారం నాడు కేజీ వెండి రూ.1,90,200 వద్ద ముగిసింది. ప్రస్తుతం కనిపిస్తున్న మార్కెట్ పోకడలు చూస్తుంటే వెండి ధరలు సైతం 2025 డిసెంబర్ స్థాయికి చేరేలా ఉన్నాయి.
పతనానికి కారణాలేంటి?
దేశీయ మార్కెట్‌లో పసిడి తగ్గడానికి అంతర్జాతీయ కమొడిటీ మార్కెట్ల బలహీనతే ప్రధాన కారణం. గ్లోబల్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 3,900 డాలర్ల దిగువకు పడిపోయింది. ఇది 2025 అక్టోబర్ తర్వాత నమోదైన అత్యల్ప స్థాయి.
"యూఎస్‌లో అంచనాల కంటే ఎక్కువగా నమోదైన ద్రవ్యోల్బణ గణాంకాలు, డిసెంబర్‌లో ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు పెరగడంతో రాబడి లేని బంగారంపై పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గింది. పసిడి కన్నా వెండిపై అమ్మకాల ఒత్తిడి మరింత ఎక్కువగా ఉంది. పారిశ్రామికంగా డిమాండ్ తగ్గడమే దీనికి కారణం" అని లెమన్ రీసెర్చ్ హెడ్ గౌరవ్ గార్గ్ విశ్లేషించారు.
"ఇంధన ధరలు పెరగడం ద్రవ్యోల్బణ భయాలను పెంచగా, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వైఖరి బంగారం, వెండి ధరలను మరింత కిందకు నెట్టింది" అని 360 వన్ అసెట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఫండ్ మేనేజర్ రాహుల్ ఖేతావత్ పేర్కొన్నారు.
నవంబర్‌లో కోలుకునే అవకాశాలు ఉన్నాయా?
వచ్చే వారాల్లో పసిడి ధరలు ఒకే శ్రేణిలో ఊగిసలాడే అవకాశం ఉందే తప్ప భారీగా పుంజుకునే అవకాశం తక్కువగా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
"బలపడుతున్న అమెరికన్ డాలర్, పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్, వడ్డీ రేట్ల పెంపు భయాలు పసిడి భారీగా కోలుకోకుండా అడ్డుకోవచ్చు" అని వైభవంగళ్ అనుకూలకర ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ్ మౌర్య అభిప్రాయపడ్డారు.
ముడి చమురు ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు, యూఎస్ ఫెడ్ నిర్ణయాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరల గమనాన్ని నిర్దేశించనున్నాయి.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


