వినే లోపం కేవలం చెవులకే పరిమితం కాదు. ఇది మనిషి నడక, శరీర సమతుల్యత, దైనందిన జీవితంపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. వినికిడి శక్తికి, శరీర కదలికలకు మధ్య ఉన్న అనుబంధం చాలామందికి సరిగ్గా తెలియదు. వినికిడి సమస్యను సకాలంలో గుర్తించకపోతే కిందపడిపోయే ప్రమాదం పెరగడమే కాకుండా, శారీరక చురుకుదనం తగ్గి త్వరగా అలసిపోతుంటారు.
చెవిలోని సమతుల్య వ్యవస్థపై ప్రభావం

లోపలి చెవిలో శరీరం స్థిరంగా నిలబడేందుకు సహాయపడే కొన్ని భాగాలు ఉంటాయి. వినికిడి లోపం ఏర్పడినప్పుడు చుట్టుపక్కల పరిసరాలపై అవగాహన తగ్గుతుంది. ఫలితంగా నడుస్తున్నప్పుడు అడుగులు తడబడటం, కిందపడే ప్రమాదం ఎక్కువ కావడం జరుగుతుంది. ఎదుటివారి మాటలను స్పష్టంగా వినడానికి, అర్థం చేసుకోవడానికి నిరంతరం శ్రమించాల్సి రావడంతో మెదడు తీవ్ర అలసటకు గురవుతుంది. కాలక్రమేణా ఈ మానసిక అలసట శారీరక ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది.
సామాజిక దూరం.. శారీరక క్షీణత
సరిగ్గా వినిపించకపోవడం వల్ల చాలామంది నలుగురితో మాట్లాడటానికి, శుభకార్యాలకు వెళ్లడానికి వెనుకాడుతుంటారు. మాటలు అర్థం కాక నలుగురిలో అసౌకర్యానికి గురవుతామనే భయంతో సామాజిక జీవితానికి దూరమవుతారు. ఈ ఒంటరితనం వల్ల శారీరక కార్యకలాపాలు తగ్గిపోయి కండరాల బలం, కీళ్ల కదలికలు మందగిస్తాయి. పెద్దవయస్సు ఉన్నవారిలో ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది.
పరిశోధనల ప్రకారం, వినికిడి లోపానికి చికిత్స తీసుకోకపోతే మానసిక ఆందోళన (Anxiety), నిరాశ (Depression), జ్ఞాపకశక్తి తగ్గడం, ఆలోచనా శక్తి క్షీణించడం (Dementia) వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇవి మనిషి స్వతంత్రంగా జీవించే సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి.
నడక వేగం తగ్గుతోందా?
మనిషి నడక వేగం అతని సంపూర్ణ ఆరోగ్యానికి ఒక సూచికగా పనిచేస్తుంది. మెదడు, నాడులు, కండరాలు, గుండె, ఊపిరితిత్తులు ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నాయో నడిచే వేగాన్ని బట్టి చెప్పవచ్చు. వినికిడి లోపంతో బాధపడుతున్నవారు సాధారణ వ్యక్తుల కంటే నెమ్మదిగా నడుస్తున్నట్లు అధ్యయనాల్లో వెల్లడైంది. వినికిడి ఆరోగ్యం కేవలం కమ్యూనికేషన్ కోసమే కాకుండా, మొత్తం శారీరక ఆరోగ్య వ్యవస్థతో ముడిపడి ఉందని ఇది నిరూపిస్తోంది.
ప్రారంభంలోనే గుర్తించి చికిత్స పొందితే..
వినికిడి సమస్యలను ఆరంభంలోనే గుర్తించి తగిన వైద్యం పొందడం ఎంతో ముఖ్యం. హియరింగ్ ఎయిడ్స్ వాడటం, వినికిడి పునరావాస చికిత్సలు పొందడం, ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవడం వల్ల ఇతరులతో సులువుగా సంభాషించవచ్చు. పెద్ద శబ్దాలు ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండటం ద్వారా చెవులను కాపాడుకోవచ్చు.
{{/usCountry}}వినికిడి సమస్యలను ఆరంభంలోనే గుర్తించి తగిన వైద్యం పొందడం ఎంతో ముఖ్యం. హియరింగ్ ఎయిడ్స్ వాడటం, వినికిడి పునరావాస చికిత్సలు పొందడం, ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవడం వల్ల ఇతరులతో సులువుగా సంభాషించవచ్చు. పెద్ద శబ్దాలు ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండటం ద్వారా చెవులను కాపాడుకోవచ్చు.
{{/usCountry}}ప్రారంభంలోనే ఈ సమస్యకు పరిష్కారం కనుగొంటే శరీర సమతుల్యతను కాపాడుకుంటూ, కిందపడే ప్రమాదాలను నివారించవచ్చని, ఇతరులపై ఆధారపడకుండా స్వతంత్రంగా ఉండటానికి వీలవుతుంది.
వ్యాసకర్త:
డాక్టర్ కేవీఎస్‌ఎస్‌ఆర్‌కే శాస్త్రి,
కన్సల్టెంట్ ఎండోస్కోపిక్ ఈఎన్‌టీ సర్జన్
యశోద హాస్పిటల్స్ , హైదరాబాద్